YS Sharmila: వివేకాది రాజకీయ హత్యే

బాహ్య ప్రపంచానికి పైకి అంతా సవ్యంగా కనిపించినా తమ కుటుంబంతో అవినాష్‌రెడ్డి కుటుంబానికి కొంత కోల్డ్‌వార్‌ నడిచేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు, వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల వెల్లడించారు.

Updated : 22 Jul 2023 08:07 IST

అవినాష్‌కు వ్యతిరేకంగా నిలవడమే హత్యకు కారణం కావొచ్చు
సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో షర్మిల స్పష్టీకరణ
అవినాష్‌ కుటుంబంతో మా కుటుంబానికి కోల్డ్‌వార్‌ ఉంది
ఎంపీగా ఆయన్ను పోటీ చేయనివ్వద్దనేది వివేకా ఆలోచన
ఎన్నికల్లో వివేకాను వెన్నుపోటు పొడిచింది కుటుంబ సన్నిహితులేనని వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: బాహ్య ప్రపంచానికి పైకి అంతా సవ్యంగా కనిపించినా తమ కుటుంబంతో అవినాష్‌రెడ్డి కుటుంబానికి కొంత కోల్డ్‌వార్‌ నడిచేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు, వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల వెల్లడించారు. అవినాష్‌రెడ్డికి మరోసారి కడప ఎంపీ టికెట్‌ దక్కొద్దన్నది తమ బాబాయి వివేకానందరెడ్డి అభిప్రాయమన్నారు. తన ఉద్దేశంలో వివేకాది రాజకీయ హత్యేనని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఆమె పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి తన దగ్గర ఆధారాలేమీ లేవని.. అయితే వివేకా ఆర్థిక, కుటుంబ కారణాలతో ఘర్షణకు దిగే వ్యక్తి మాత్రం కాదని స్పష్టం చేశారు. తమ కుటుంబం, అవినాష్‌రెడ్డి కుటుంబం తమ ముత్తాతకు ఇద్దరు భార్యల సంతానమని.. ఈ కారణంగానే తమ కుటుంబాల మధ్య విబేధాలుండేవని చెప్పారు. వివేకా హత్యకు దారితీసిన పలు అంశాల గురించి తన వాంగ్మూలంలో ఆమె కూలంకషంగా వివరించారు.

  • అవినాష్‌రెడ్డిని కడప ఎంపీ సీటుకు పోటీ చేయనివ్వద్దనేది తన ఆలోచన అని వివేకానందరెడ్డి నాతో చెప్పారు. నన్ను పోటీ చేయమంటే ముందు నేను ఒప్పకోలేదు. జగన్‌ నాకు మద్దతివ్వరని తెలిసే నేను అందుకు అంగీకరించలేదు. కానీ వివేకా నన్ను పలుమార్లు అడగడంతో పోటీకి సరే అన్నాను. అవినాష్‌తోపాటు అతని కుటుంబానికి వ్యతిరేకంగా నిలవడమే వివేకా హత్యకు కారణం కావచ్చు. తాము వెళ్లే దారిలోకి వివేకానందరెడ్డి వస్తున్నారని వారి మనసులో పెట్టుకోవచ్చు. వివేకాది రాజకీయ లేదా ప్రేరేపిత హత్య కావచ్చు. నేనైతే అలాగే ఆలోచిస్తున్నాను. వ్యక్తిగత, ఆర్థిక లావాదేవీలతో వివేకా హత్యకు గురై ఉండరు.
  • అవినాష్‌ను పోటీ చేయనివ్వనని బహిరంగంగా ప్రకటించే మనిషి కాదు వివేకానందరెడ్డి. జగన్‌కు నేను వ్యతిరేకంగా వెళ్లనని వివేకా అనుకున్నారు. అవినాష్‌కు టికెట్‌ ఇవ్వకుండా జగన్‌ను ఒప్పించి తీరగలననే నమ్మకం చిన్నాన్నకు అపారంగా ఉండేది. ఆయన అవినాష్‌రెడ్డికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. అవినాష్‌రెడ్డి తరఫు నుంచి ఏమైనా జరిగి ఉండొచ్చనేదే మా ఆలోచన. అది నిజం కావచ్చు. కాకపోవచ్చు.
  • వైఎస్‌ఆర్‌ ఉన్నప్పుడు క్రియాశీలక రాజకీయాల్లో లేని అవినాష్‌రెడ్డి కుటుంబం ఆయన మరణించిన తర్వాత క్రియాశీలంగా వ్యవహరించడానికి ప్రధాన కారణం భారతినే. అవినాష్‌రెడ్డి ఆమెకు కజిన్‌. అవినాష్‌ తండ్రి, భారతి తల్లి తోబుట్టువులు.
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి అవినాష్‌రెడ్డి, అతని తండ్రి భాస్కరరెడ్డి, చిన్నాన్న మనోహర్‌రెడ్డి కారణం కావచ్చు. మనోహర్‌రెడ్డి తెదేపాకు మద్దతు పలికారు. జగన్‌ అతణ్ని ఒప్పించి తిరిగి వైకాపాకు మద్దతుగా పని చేయించాడు. కాబట్టి వివేకా ఓటమికి మనోహర్‌రెడ్డి ఓ కారణం కావచ్చు. 2019 మార్చి 15న జమ్మలమడుగులో నాతో ప్రచారం చేయించాలని వారు ప్రయత్నించారన్నది అవాస్తవం.
  • వైఎస్‌ఆర్‌ మరణించిన తర్వాత 2009 ఉపఎన్నికల నుంచి 2019 ఎన్నికల వరకూ నేను జగన్‌ కోసం పనిచేశాను. హత్యకు గురయ్యే రెండు, రెండున్నర నెల క్రితం వివేకా మా ఇంటికి వచ్చి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయమని నన్ను అడిగారు. అంతకు ముందెన్నడూ మా మధ్య ఆ అంశం చర్చకు రాలేదు. నేను కాదన్నా వినేందుకు ఆయన సిద్ధంగా లేరు. పోటీ చేయబోనని చెప్పొద్దంటూ గంటన్నరసేపు పదేపదే డిమాండ్‌ చేసి నన్ను ఒప్పించారు. ఈ విషయం మీడియాలో వచ్చిందా, బయట ప్రచారం జరిగిందా లేదా నాకు గుర్తులేదు. ఇది మా ఇద్దరి మధ్య మాత్రమే జరిగిన సంభాషణ అని కచ్చితంగా చెప్పగలను.
  • తాను కాకుండా ఎంపీ సీటుకు నన్నెందుకు పోటీ చేయించాలని వివేకా అనుకున్నారో నాకు తెలియదు. బహుశా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం కారణం కావచ్చు. తనకు టికెట్‌ రాదని ఆయన బలంగా నమ్మి ఉండొచ్చు. నాకు టికెట్‌ ఇప్పించేలా జగన్‌ను ఒప్పించే బాధ్యత తనదని మాత్రం చెప్పారు.
  • కొందరు దగ్గరి వ్యక్తులే ఆయనకు వెన్నుపోటు పొడిచారు. నాకు తెలిసినంత వరకు అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డితోపాటు మరికొందరు అనుచరులే వివేకా ఓటమికి కారణమని నాకు గుర్తు. వివేకాకు కుడిభుజం లాంటి వ్యక్తులు కూడా ఆయనకు మద్దతుగా నిలవలేదు. వారి పేర్లయితే గుర్తులేదు కానీ కుటుంబంలోని అత్యంత సన్నిహితులే ఓటమికి కారణం. మా కుటుంబంలోనూ ఇదే చర్చ జరిగింది.

అవినాష్‌ ఫోన్‌ చేసి వివేకా చనిపోయారని చెప్పారు: సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి

2019 మార్చి 15న తెల్లవారుజామున 4 గంటలకు లోటస్‌పాండ్‌లోని జగన్‌ నివాసానికి వెళ్లా. వైకాపా మీడియా సెల్‌ ఇన్‌ఛార్జి జీవీడీ కృష్ణమోహన్‌, సాంబశివరెడ్డి అక్కడ ఉన్నారు. 4.30 గంటలకు సమావేశం ప్రారంభమైంది. వైకాపా మేనిఫెస్టోతోపాటు జగన్‌ చేయాల్సిన ప్రసంగం గురించి సమావేశం జరిగింది. ఎన్నికల సమయం కావడంతో ఎక్కువసార్లు జీవీడీ, నేను కలిసి జగన్‌ ప్రసంగాలను రూపొందించేవాళ్లం. ఆ రోజు సమావేశంలో ఉండగా అటెండర్‌ నవీన్‌ తన ఫోన్‌ ఇచ్చి అవినాష్‌రెడ్డి లైన్‌లో ఉన్నారని చెప్పారు. నేను ఫోన్‌ మాట్లాడగానే వివేకా చనిపోయారని అవినాష్‌ చెప్పడంతో దిగ్భ్రాంతికి గురయ్యా. ఎలా జరిగిందని అడిగా. వివేకా బాత్రూంలో రక్తపుమడుగులో పడి ఉన్నారని.. పడకగదిలోనూ రక్తం ఉందని అవినాష్‌ చెప్పారు. అదే విషయం జగన్‌కు చెప్పమని అవినాష్‌ ఫోన్‌ పెట్టేశారు. నేను జగన్‌ దగ్గరికి వెళ్లి చెవిలో విషయం చెప్పాను. కొంతసేపటి తర్వాత జగన్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం జీవీడీ, సాంబశివరెడ్డికి విషయం చెప్పడంతో అంతా కలిసి బయటికి వచ్చాం. అదే సమయంలో వివేకా హత్య గురించి నాకు చాలా మంది నుంచి ఫోన్లు వచ్చాయి.

  • 6.40, 6.41 గంటలకు అవినాష్‌ నాకు ఫోన్‌ చేసి హత్య విషయం జగన్‌కు చెప్పారా లేదా అని అడిగారు. అనంతరం జగన్‌ పులివెందులకు విమానంలో వెళ్తారనుకొని ట్రావెల్‌ ఏజెన్సీలతో మాట్లాడటంలో నిమగ్నమయ్యా. అయితే 9-10 గంటల సమయంలో జగన్‌ రోడ్డు మార్గంలో పులివెందుల వెళ్లారు.
  • 8.28, 9.14 గంటలకు అవినాష్‌ ఫోన్‌ చేసి జగన్‌ కార్యక్రమాల గురించి అడిగినట్లు గుర్తు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య అయిదుసార్లు అవినాష్‌తో మాట్లాడింది వాస్తవమే అయినా చాలాకాలం కావడంతో అప్పుడు ఏం మాట్లాడానో గుర్తు లేదు. బహుశా జగన్‌ పులివెందులకు రాక గురించే అయి ఉంటుంది. అయితే ఆ రోజు జగన్‌ కార్యక్రమాలు ఎక్కడున్నాయో నాకు గుర్తు లేదు. నాకు తెలిసినంత వరకు జగన్‌ ఎప్పుడైనా పీఏ నాగేశ్వరరెడ్డి లేదా నా ఫోన్‌తో మాత్రమే మాట్లాడేవారు.

చిన్నాన్న ఇక లేరు అని జగన్‌ అన్నారు

- అజేయ కల్లం

2019 మార్చి 15 తెల్లవారుజామున 5 గంటలకు లోటస్‌పాండ్‌లో సమావేశం ప్రారంభమైంది. ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, డి.కృష్ణ, సాంబశివరెడ్డి తదితరులు సమావేశంలో ఉన్నారు. సమావేశం జరుగుతుండగానే 5.30 గంటల సమయంలో అటెండర్‌ వచ్చి అమ్మ (భారతి) పిలుస్తున్నారని జగన్‌కు చెప్పారు. బయటికి వెళ్లిన జగన్‌ పది నిమిషాల తర్వాత తిరిగి వచ్చి చిన్నాన్న ఈజ్‌ నో మోర్‌ అన్నారు. షాక్‌కు గురైన మేం కడపకు వెళ్లాలని ఆయనకు సూచించి, బయటికి వచ్చేశాం. జగన్‌ను బయటికి పిలిచిన అటెండర్‌ ఎవరో నాకు తెలియదు.


అప్పుడు సమయమెంతో గుర్తు లేదు

-ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

2019 ఎన్నికల సమయంలో వైకాపా ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా ఉన్నా. అప్పట్లో తరచూ తెల్లవారుజామున 4-5 గంటల మధ్య సమావేశాలు జరిగేవి. మార్చి 15న సమావేశం జరుగుతుండగా ఎవరో లోపలికి వచ్చి వివేకా చనిపోయారని జగన్‌కు చెప్పారు. అయితే అలా చెప్పిందెవరో నాకు గుర్తు లేదు. వృద్ధాప్యం కారణంగా ఆ సమయం ఎంతో కూడా చెప్పలేను. వెంటనే వెళ్లిపోవాలని జగన్‌కు సూచించి మేం వెనుదిరిగాం.


అవినాష్‌రెడ్డి ఫోన్‌ చేసి జగన్‌ ఉన్నారా అని అడిగారు

-గోపరాజు నవీన్‌కుమార్‌, జగన్‌ కుటుంబ అటెండర్‌

2019 మార్చిలో బంజారాహిల్స్‌ లోటస్‌పాండ్‌లో జగన్‌ వద్ద పనిచేశా. ఆయన ఇంట్లో గార్డెనింగ్‌తోపాటు కాఫీలు అందించేవాణ్ని. 2013-14లో హైదరాబాద్‌ వైకాపా కార్యాలయంలో పనిచేసే వర్ధన్‌రావు నాకు 90002 66234 సెల్‌ నంబర్‌ ఇప్పించారు. 2013-14 నుంచి 2019 మే వరకు దాన్ని నేనే వినియోగించా. తాడేపల్లికి జగన్‌ బంధువులెవరైనా రావాలనుకుంటే ఈ నంబర్‌కు ఫోన్‌ చేసేవారు. ఆ విషయాన్ని నేను ప్రధాన ద్వారం వద్ద ఉండే పోలీస్‌ అధికారులకు చెబితే లోపలికి రానిచ్చేవారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సైతం ఈ నంబర్‌కు ఫోన్‌ చేసేవారు. అనంతరం అవినాష్‌రెడ్డిని నేను ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, జగన్‌ పీఏ నాగేశ్వరరెడ్డితో ఇదే నంబరులో మాట్లాడించేవాణ్ని. వివేకా కుమార్తె సునీతారెడ్డి సైతం నాకు ఫోన్‌ చేసేవారు. భారతికి, ఆమె కుమార్తెలకు వైద్య సలహాల నిమిత్తం ఈ ఫోన్‌లోనే మాట్లాడేవారు. 2019 మార్చి 15న కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డ్డి, జీవీడీతో జగన్‌ సమావేశమయ్యారు. ఉదయం 6.30 గంటల సమయంలో అవినాష్‌రెడ్డి నాకు ఫోన్‌ చేసి, జగన్‌ ఇంట్లో ఉన్నారా అని అడిగారు. సమావేశంలో ఉన్నారని చెప్పాను. ఎవరెవరున్నారని అడిగితే ఓఎస్డీ, జీవీడీ ఉన్నారని చెప్పాను. కృష్ణమోహన్‌రెడ్డికి ఫోన్‌ ఇవ్వమని అవినాష్‌ చెప్పారు. ఆ సమయంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నా గదిలో ఉన్న నేను వెంటనే మూడో అంతస్తులోని కాన్ఫరెన్స్‌ హాల్‌కు వెళ్లి ఫోన్‌ కృష్ణమోహన్‌రెడ్డికి ఇచ్చి, వంటగదిలోకి వెళ్లిపోయాను. వారేం మాట్లాడుకున్నారో నాకు వినిపించలేదు. ఉదయం 8-8.30 గంటల సమయంలో వివేకా హత్య గురించి జగన్‌ గన్‌మెన్లు మాట్లాడుకుంటుండగా విన్నా. వెంటనే నా గదికి వెళ్లి టీవీలో చూశా. అదే రోజు 8.30 సమయంలో సునీతారెడ్డి నాకు ఫోన్‌ చేశారన్న సంగతి నాకు సరిగ్గా గుర్తు లేదు. సీడీఆర్‌లో చూసిన తర్వాత 25 సెకన్లపాటు మాట్లాడినట్లు గుర్తొచ్చింది. భారతి పులివెందులకు బయలుదేరారా అని ఆమె అడిగినట్లు గుర్తు. జగన్‌, భారతి నా ఫోన్‌ను ఎన్నడూ వినియోగించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని