జగన్‌ను గెలిపించినందుకు లెంపలేసుకుంటున్నాం

గత ఎన్నికల్లో జగన్‌కు ఓట్లు వేసి గెలిపించినందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని ఆంధ్రా పెన్షనర్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్‌ అన్నారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు ఆత్మబంధువైన చంద్రబాబును గెలిపించుకుంటామని స్పష్టం చేశారు.

Published : 06 May 2024 09:41 IST

ఆంధ్రా పెన్షనర్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బరాయన్‌

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే: గత ఎన్నికల్లో జగన్‌కు ఓట్లు వేసి గెలిపించినందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని ఆంధ్రా పెన్షనర్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్‌ అన్నారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు ఆత్మబంధువైన చంద్రబాబును గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. కడప ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆయన మాట్లాడారు. ‘పండుటాకులైన పింఛన్‌దారులు కూడా జగన్‌ సర్కార్‌ తీరుతో అవస్థలు పడుతున్నారు. నాతో సహా ఇప్పటికీ చాలా మందికి డబ్బులు అందలేదు. పెన్షనర్ల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే. ఇంటింటికీ వెళ్లి వృద్ధులకు పింఛన్లు ఇస్తున్నామని చెప్పుకొంటున్న జగన్‌.. ప్రభుత్వ పింఛనుదారులకు మాత్రం ఎందుకు ఇవ్వడం లేదు? చంద్రబాబు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే.. జగన్‌ అధికారంలోకి రాగానే 23 శాతానికి తగ్గించారు’ అని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు మూడువేల కిలోమీటర్లు తిరిగామని, పింఛనుదారులందరినీ అప్రమత్తం చేస్తూ చంద్రబాబును గెలిపించాలని ప్రచారం చేస్తున్నామని చెప్పారు. సోమవారం పులివెందులకు వెళ్లి ఉద్యోగ, ఉపాధ్యాయులు, పింఛనుదారులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కూటమి మ్యానిఫెస్టోలో ప్రభుత్వ పింఛనుదారులకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, గౌరవాధ్యక్షుడు నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని