ఉద్యోగాలు సృష్టించేవారినే ఎన్నుకోవాలి

‘ఉద్యోగాలు సృష్టించేవారినే అమెరికాలో ఎన్నుకుంటారు. విదేశీ పెట్టుబడులు రావడానికి ఆ దేశంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అందుకే అమెరికా అన్ని రంగాల్లో ముందుంది.

Published : 06 May 2024 06:17 IST

రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే వాతావరణం లేదు
ప్రవాస భారతీయుడు మల్లిక్‌ మేదరమెట్ల

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘ఉద్యోగాలు సృష్టించేవారినే అమెరికాలో ఎన్నుకుంటారు. విదేశీ పెట్టుబడులు రావడానికి ఆ దేశంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అందుకే అమెరికా అన్ని రంగాల్లో ముందుంది. అలాగే రాష్ట్రానికి ఎవరి నాయకత్వం బాగుంటుందో, ఎవరి నాయకత్వంలో సానుకూల వాతావరణంలో పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయో వారికే ఓటెయ్యాలి. మీ భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తుకు భరోసా కల్పించేవారినే ఎన్నుకోవాలి’ అని ప్రవాస భారతీయుడు మల్లిక్‌ మేదరమెట్ల సూచించారు. రాబోయే అయిదేళ్లలో ఉద్యోగాలు సృష్టిస్తారనుకునేవారినే యువత ఎన్నుకోవాలి’ అని మల్లిక్‌ తెలిపారు. ఆదివారం ఆయన ఈనాడు - ఈటీవీతో మాట్లాడారు.

పెట్టుబడులకు సానుకూల వాతావరణం లేదు

‘అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోని పెద్ద కంపెనీల్లో ఎక్కువగా భారతీయులే ఉన్నారు. వారిలో ఉన్నత స్థానాలలో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు చాలామంది ఉన్నారు. వారితో రాష్ట్రానికి మైక్రోసాఫ్ట్‌, సిస్కో లాంటి పెద్ద కంపెనీల నుంచి సులువుగా పెట్టుబడులు తీసుకురావచ్చు. వాటిద్వారా రాష్ట్ర యువతకు మెరుగైన ఉద్యోగాలు కల్పించవచ్చు. ఫార్మా, ఐటీ పరిశ్రమలను కూడా వీరి సహకారంతో తీసుకురావచ్చు. కానీ రాష్ట్రంలో వాటికి అనుకూలమైన వాతావరణం లేదు. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి, తెదేపా అధినేత చంద్రబాబుల హయాంలో రాష్ట్రానికి కంపెనీలు, పెట్టుబడులు వస్తున్నట్లు పత్రికల్లో వచ్చేవి. కానీ గత ఐదేళ్లలో ఇలాంటివి ఒక్కటీ మీడియాలో కనిపించలేదు. ఏ రాష్ట్రానికైనా, దేశానికైనా ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి మంచి వాతావరణం కావాలి. నైపుణ్యాలు కలిగిన యువత ఉండాలి. అప్పుడే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి. ఇవన్ని ఉంటే రాష్ట్రం దానంతట అదే అభివృద్ధి చెందుతుంది. విభజన తర్వాత రాష్ట్రం అప్పులతో మొదలయింది. రాష్ట్రంలో రాజధాని నిర్మాణం, యువతలో నైపుణ్యం, పరిశ్రమలు సానుకూల వాతావరణం ఉండటంతో 2019 వరకు పెట్టుబడులు పెరుగుతూ వచ్చాయి. 2019 తర్వాత రాష్ట్రంలో ప్రతికూల వాతావరణం ఉండటంతో పెట్టుబడులు రావట్లేదు. రాష్ట్రానికి వెన్నెముకగా ఉండాల్సిన యువత నిర్వీర్యమై గంజాయి వైపు మళ్లుతున్నట్లు కనిపిస్తోంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇతర దేశాల నుంచి పెట్టుబడులు, పరిశ్రమలను ఎవరు తీసుకురాగలరో గమనించాలి. కంపెనీలు వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఎటువంటి వాతావరణ పరిస్థితులున్నా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు వేయడానికే నేను అమెరికా నుంచి వచ్చాను’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని