వైకాపా బంటులైన డీఎస్పీలపై వేటు

అధికార వైకాపాకు అనుకూలంగా పనిచేస్తూ.. ప్రతిపక్ష పార్టీల శ్రేణులను వేధించడం, అణచివేయడమే లక్ష్యంగా పేట్రేగిపోతున్న ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది.

Updated : 06 May 2024 06:12 IST

అనంతపురం, రాయచోటి డీఎస్పీలు వీరరాఘవరెడ్డి, మహబూబ్‌ బాషా బదిలీ
ఇప్పటికీ వైకాపాతో అంటకాగుతున్న అధికారులపై చర్యలేవి?

ఈనాడు- అమరావతి, కడప, న్యూస్‌టుడే- అనంతపురం నేరవార్తలు: అధికార వైకాపాకు అనుకూలంగా పనిచేస్తూ.. ప్రతిపక్ష పార్టీల శ్రేణులను వేధించడం, అణచివేయడమే లక్ష్యంగా పేట్రేగిపోతున్న ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. అనంతపురం ఎస్‌డీపీవో జి.వీరరాఘవరెడ్డి, రాయచోటి ఎస్‌డీపీవో సయ్యద్‌ మహబూబ్‌ బాషాలను బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. వారి తర్వాత స్థానాల్లో ఉన్న అధికారులకు బాధ్యతలు అప్పగించేసి, తక్షణమే రిలీవ్‌ కావాలని ఆదేశించింది. వీరిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందటంతో ఆలస్యంగానైనా సరే ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది.

ప్రతిపక్షాలపై అడ్డగోలు కేసులు, వేధింపులు

అనంతపురం డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డి పోలీసు అధికారిగా కంటే వైకాపా కార్యకర్తగానే ఎక్కువ గుర్తింపు పొందారు. స్థానిక ప్రజాప్రతినిధి మాటే శాసనం అన్నట్లుగా పనిచేశారు. తెదేపాలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ముఖ్య నాయకులు, కార్యకర్తలపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టం సెక్షన్ల కింద అడ్డగోలుగా కేసులు పెట్టారు. క్షేత్రస్థాయిలో చురుగ్గా వ్యవహరించే తెదేపా నాయకుల్ని గుర్తించి, బైండోవర్‌ చేయించారు. 2019లో వైకాపా అధికారం చేపట్టిన వెంటనే స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు.. వీరరాఘవరెడ్డిని అనంతపురం డీఎస్పీగా ఏరికోరి తెచ్చుకున్నారు. 2022 నవంబరు వరకూ అక్కడే కొనసాగిన ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా నాయకుల్ని పోలింగ్‌ ఏజెంట్లుగా కూడా కూర్చోనివ్వలేదు. బుడ్డప్పనగర్‌లో దొంగ ఓట్లేస్తున్న వైకాపా నాయకులకు కొమ్ముకాశారు. అదేంటని ప్రశ్నించిన తెదేపా నాయకులపై విరుచుకుపడ్డారు. తన హయాంలో ప్రతిపక్షాలను తీవ్రంగా వేధించారు. వైకాపా ప్రభుత్వ మద్యం విధానంపై విమర్శలు చేసినందుకు తెదేపా మహిళా నాయకురాళ్ల ఇళ్లకు అర్ధరాత్రి వెళ్లి సోదాలు చేశారు. వారి పడకగదుల్లోకి చొరబడి, ఫోన్లు లాక్కున్నారు. ఈ వేధింపులు తాళలేక ఓ మహిళా నాయకురాలు ఆత్మహత్యకు యత్నించారు. ఎన్నికల వేళ తమకు అనుకూలమైన అధికారి ఉంటే... అడ్డదారుల్లోనైనా గెలవొచ్చన్న దురుద్దేశంతో రెండు నెలల కింద ఆయన్ను వైకాపా నాయకులు ఏరికోరి మళ్లీ అనంతపురం డీఎస్పీగా తెచ్చుకున్నారు. అప్పటి నుంచి ఆయన ప్రతిపక్షాలను మరింత వేధించారు.

అధికార పార్టీ అరాచకాలకు కొమ్ముకాశారు..

రాయచోటి డీఎస్పీ మహబూబ్‌ బాషాను ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే వైకాపా నేతలు ఏరికోరి అక్కడికి తెచ్చుకున్నారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన పూర్తిగా వైకాపాకు అనుకూలంగా పనిచేశారు. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చాక తెదేపా నేతలే లక్ష్యంగా కేసులు పెట్టారు. అధికార పార్టీ దాష్టీకాలకు పాల్పడినా వారిపై చర్యలు తీసుకోలేదు. రామాపురం మండలంలో వైకాపా నాయకులు తెదేపా ప్రచార రథంపై దాడి చేసి డ్రైవర్‌ను గాయపరిస్తే వారిపై చర్యలు తీసుకోకుండా.. పరామర్శించేందుకు వెళ్లిన తెదేపా అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిపై కేసు పెట్టారు. చిన్నమండెం మండలం వండాడిలో ఓ సర్పంచి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ర్యాలీగా వెళ్లిన తెదేపా నాయకులపై కేసు నమోదు చేశారు. పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం వద్ద తెదేపా అభ్యర్థి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి ప్రచార వాహనాన్ని వైకాపా నేతలు తగలబెట్టినా బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. ఇలా అడుగడుగునా అధికార పార్టీ అరాచకాలకు కొమ్ముకాసిన ఆయనపై వేటు పడింది.

మిగతా వైకాపా బంటులపై చర్యలేవి?

ఇప్పటికీ క్షేత్రస్థాయిలో అనేక మంది డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు అధికార వైకాపాకు బంటుల్లా పనిచేస్తూ ప్రతిపక్ష పార్టీలను తీవ్రంగా వేధిస్తున్నారు. వారి ప్రచారాలకు ఆటంకం కలిగిస్తున్నారు. అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారు.

  • కడప డీఎస్పీ షరీఫ్‌ పూర్తిగా వైకాపాకు ప్రయోజనం కలిగేలా పనిచేస్తున్నారన్న విమర్శలున్నాయి.
  • రాజమహేంద్రవరం సెంట్రల్‌ జోన్‌ డీసీపీ కె.విజయ్‌పాల్‌, నెల్లూరు గ్రామీణ డీఎస్పీ పి.వీరాంజనేయులురెడ్డి, పులివెందుల డీఎస్పీ వినోద్‌కుమార్‌ అధికార పార్టీ అరాచకాలకు అండగా ఉంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాయచోటి సీఐ సుధాకర్‌రెడ్డి, పామిడి సీఐ రాజశేఖర్‌రెడ్డి తదితరులు వైకాపా నేతల ఆదేశాలతో ప్రతిపక్షాలను అణచివేస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని