దళితులు జగన్‌ను ఓడించి.. తమను తాము రక్షించుకోవాలి

దళితులు, ముఖ్యంగా మాలల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్‌.. తన ఐదేళ్ల పాలనలో వారిని రాజకీయంగా, సామాజికంగా అథఃపాతాళానికి తొక్కారని దళిత బహుజన ఫ్రంట్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు ధ్వజమెత్తారు.

Published : 06 May 2024 05:28 IST

అయిదేళ్ల వైకాపా పాలనలో దళితుల్ని అధఃపాతాళానికి తొక్కారు
దళిత, బహుజన ఫ్రంట్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు

ఈనాడు, అమరావతి: దళితులు, ముఖ్యంగా మాలల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్‌.. తన ఐదేళ్ల పాలనలో వారిని రాజకీయంగా, సామాజికంగా అథఃపాతాళానికి తొక్కారని దళిత బహుజన ఫ్రంట్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు ధ్వజమెత్తారు. దళితుల కోసం ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టకపోగా, గత ప్రభుత్వం అమలు చేసిన 27 పథకాలను రద్దు చేయడం పాశవిక పాలనకు నిదర్శనమని దుయ్యబట్టారు. ప్రశ్నించిన వారిని పోలీసులతో అణచివేశారని గుర్తుచేశారు. దళితులు తమను తాము రక్షించుకోవడానికి ఈ ఎన్నికల్లో జగన్‌ను ఓడించడం ఒక్కటే మార్గమని, దళితులు, ప్రధానంగా మాలలెవరూ జగన్‌కు ఓటేయొద్దని పిలుపునిచ్చారు. ఆదివారం ‘ఈనాడు’తో ఆయన మాట్లాడారు.

ఉపప్రణాళిక నిధుల్ని మళ్లించడం చట్ట వ్యతిరేకం

‘దళితులు, గిరిజనుల అభివృద్ధికి కీలకమైన ఉపప్రణాళిక నిధుల్ని జగన్‌ పక్కదారి పట్టించారు. మాదిగ, మాల, రెల్లి కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్టు గొప్పలు చెప్పి.. వాటికి నిధులు కేటాయించకుండా ఉనికినే దెబ్బతీశారు. గత ప్రభుత్వాల హయాంలో అందిన రాయితీ రుణాల్ని ఎత్తేశారు. ప్రొఫెషనల్‌ కోర్సులకు ఉపకార వేతనాలు తీసేశారు. ప్రైవేటు పీజీకి ఫీజు రీయింబర్స్‌మెంటును 77 జీవో తెచ్చి రద్దు చేశారు. విదేశీ విద్య పథకానికి అంబేడ్కర్‌ పేరు తొలగించి, తన పేరు పెట్టుకునే దుస్సాహసానికి జగన్‌ ఒడిగట్టారు’ అని పేర్కొన్నారు.


జగన్‌ది పెత్తందారీ భావాజాలం

‘ఐదేళ్లూ జగన్‌ ప్రదర్శించిందంతా పెత్తందారీ భావజాలమే. దళిత మహిళలు హోంమంత్రిగా ఉండి కూడా తోటి సామాజికవర్గంపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా కనీసం వారు మాట్లాడలేదు. జగన్‌ కనీసం వారితో కుర్చీ కూడా పంచుకోని సందర్భాలు కనిపించాయి. ప్రభుత్వమే పోలీసుల్ని ప్రయోగించి దళిత అధికారులు, యువకులపై దాడులు చేయించింది. డాక్టర్‌ సుధాకర్‌ ఉదంతమే అందుకు నిదర్శనం. జగన్‌ పాలనలో దళితుల శిరోముండనాల ఘటనలు పెరిగాయి. వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు శిరోముండనం కేసులో కోర్టు శిక్ష విధిస్తే, ఆయనకే జగన్‌ టికెట్‌ ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేయిస్తుండడం గమనార్హం. వైకాపాకు దళితులెవరూ ఓటేయొద్దు. జగన్‌ ఓటమికి ఐక్యంగా కృషి చేయాలి’ అని పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని