భూ యాజమాన్య హక్కు చట్టం.. ప్రమాదకరం

‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంలో సెక్షన్‌ 64 కింద భూములు, ఆస్తులకు సంబంధించి టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి (టీఆర్‌వో)కి సమాచారం ఇవ్వకపోతే బాధ్యులైన హక్కుదారులకు 6 నెలల వరకు జైలుశిక్ష లేదా రూ.50 వేల వరకు జరిమానా విధించొచ్చు.

Published : 06 May 2024 05:24 IST

సమాచారం ఇవ్వకపోతే హక్కుదారులకు జైలుశిక్ష
అది తీవ్రమైన అంశం
జనచైతన్యవేదిక చర్చాగోష్ఠిలో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పి.కృష్ణయ్య

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-గుంటూరు నగరం: ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంలో సెక్షన్‌ 64 కింద భూములు, ఆస్తులకు సంబంధించి టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి (టీఆర్‌వో)కి సమాచారం ఇవ్వకపోతే బాధ్యులైన హక్కుదారులకు 6 నెలల వరకు జైలుశిక్ష లేదా రూ.50 వేల వరకు జరిమానా విధించొచ్చు. సమాచారం ఇవ్వడానికి కొన్ని అంశాల్లో 7 రోజుల నుంచి 3 నెలల వరకు గడువు ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన అంశం’ అని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పి.కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరులోని జనచైతన్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం ‘భూ యాజమాన్య హక్కు చట్టం అమలు - పూర్వాపరాలు, సమస్యలపై’ నిర్వహించిన చర్చాగోష్ఠిలో ఆయన మాట్లాడారు. ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌.. పెద్దరైతులు, ఎకరా, అరెకరా ఉన్నవారే కాకుండా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సెంటు, అరసెంటు ఇంటి స్థలం ఉన్నవారికి కూడా ప్రమాదకరంగా పరిణమిస్తుందన్నారు. వ్యవసాయ భూములకే కాకుండా వ్యక్తులు, సంస్థలకు చెందిన స్థలాలు, భవనాలు, పరిశ్రమలు, దుకాణాలు సహా వ్యవసాయేతర భూములు సైతం ఈ చట్ట  పరిధిలోకి వస్తాయన్నారు. దీని అమలు వల్ల భూమితో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తి ఎలా నష్టపోతారో? ఎలా కష్టాలు పడతారో ప్రజల్లో చర్చ జరగాలని సూచించారు.

పారదర్శకత ఏదీ?

భూహక్కుల నిర్ధారణ, వివాదాల పరిష్కారాలను స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయస్థానాల నుంచి తొలగించి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రెవెన్యూ అధికారులకు సంక్రమింపజేయడం ద్వారా అనేక కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయని కృష్ణయ్య పేర్కొన్నారు. ‘చట్టం అమలు చేసేందుకు సీఎస్‌ స్థాయి అధికారి ఛైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ అథారిటీని ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా అధికారులను నియమించే విధానం రహస్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది. టీఆర్‌వోలుగా ఏ శాఖ నుంచి ఏ స్థాయి వారిని నియమిస్తారో చట్టంలో స్పష్టత లేదు. టీఆర్వోలు చేసే తప్పిదాల వల్ల కొందరి జీవితాలు నాశనమయ్యే ప్రమాదం ఉంది. అస్మదీయులు, చిన్నస్థాయి అధికారులకు కీలక పదవి అప్పగిస్తే.. వారిని భయపెట్టి ప్రభుత్వంలోని నేతలు ఆస్తులు కాజేసేందుకు అవకాశం ఉంది’ అని కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు.  

తప్పుడు సమాచారం ఇచ్చే అధికారులపై చర్యల్లేవు

‘ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ అథారిటీ ఛైర్మన్‌ను ప్రజా సంక్షేమం దృష్ట్యా తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వం తన చేతుల్లో పెట్టుకుంది. నీతి ఆయోగ్‌ చేసిన నమూనా చట్టంలో ఇది లేదు. అంతేకాకుండా.. మూడంచెల పరిష్కార వ్యవస్థను అది ప్రతిపాదించగా.. మన రాష్ట్ర చట్టంలో దాన్ని రెండంచెల వ్యవస్థకే పరిమితం చేశారు. ముఖ్యంగా జిల్లా జడ్జి ఛైర్మన్‌గా ఉండాల్సిన ల్యాండ్‌ టైటిల్‌ అప్పీల్‌ ట్రైబ్యునల్‌ను లేకుండా చేశారు. సమాచారం ఇవ్వని, తప్పుడు సమాచారం ఇచ్చే అధికారులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని నమూనా చట్టంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ అంశాన్ని తొలగించింది. భూ హక్కుల రికార్డులు, ఛార్జీలు, ఒప్పందాలు, వివాదాల రికార్డులను ల్యాండ్‌ అథారిటీ నిర్వహిస్తుంది. ల్యాండ్‌ టైటిల్‌ అప్పీల్‌ అధికారికి తనంతట తానే విచారణ జరిపే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టింది. దీని వల్ల అధికారులు ఒత్తిళ్లకు తలొగ్గి, చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి, ల్యాండ్‌ టైటిల్‌ అప్పీల్‌ అధికారి ఉత్తర్వులను సివిల్‌ కోర్టులో ప్రశ్నించే అవకాశం లేదు. టైటిల్‌ అప్పీల్‌ అధికారి ఇచ్చిన ఆదేశాలను హైకోర్టులో రివిజన్‌ రూపంలో మాత్రమే సవాల్‌ చేయొచ్చు. దీంతో ఎక్కువ సంఖ్యలో కేసులు హైకోర్టుకు చేరుతాయి. ఇప్పటికే ఉన్నత న్యాయస్థానంలో పెద్దఎత్తున కేసులు పెండింగ్‌లో ఉన్నందున భూవివాదాల పరిష్కారం మరింత జాప్యమవుతుంది. స్థిరాస్తుల కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉంటే.. వాటిని మూడు నెలల్లోపు టీఆర్వో వద్ద నమోదు చేయించుకోవాలి. జడ్జిమెంట్లు, ఆర్బిట్రేషన్‌, సెటిల్‌మెంట్‌ వివరాలను ఉత్తర్వులిచ్చిన ఏడు రోజుల్లోగా టీఆర్వో వద్ద నమోదు చేసుకున్న తరువాతే నిర్ణయాలు అమల్లోకి వస్తాయి. ఒక స్థిరాస్తిపై జరిగే లావాదేవీల వివరాలన్నీ టీఆర్‌వోకు సమర్పించాలి. ఆయన విచారించి సంతృప్తి చెందినప్పుడే అధికారికంగా రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. ఇది పూర్తయితేనే లావాదేవీని నిర్ధారిస్తారు’ అని కృష్ణయ్య వివరించారు.


న్యాయ నిపుణుల ప్రమేయం లేకుండా రూపకల్పన

- సుంకర రాజేంద్రప్రసాద్‌, ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల హక్కులను హరించే విధంగా 14 చట్టాలకు వ్యతిరేకంగా ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ తీసుకొచ్చింది. దీనిని రద్దు చేయాలని న్యాయవాదులంతా ఉద్యమం చేసినా ప్రభుత్వం స్పందించలేదు. న్యాయ నిపుణుల ప్రమేయం లేకుండా రూపొందించారు. ప్రజల ఆస్తులను రెవెన్యూ అధికారుల చేతుల్లో పెడుతున్నారు.


రెవెన్యూ వ్యవస్థకు అధికారం కట్టబెట్టడం రాజ్యాంగ విరుద్ధం

- డాక్టర్‌ దివాకర్‌బాబు, ప్రిన్సిపల్‌, సిద్దార్థ లా కళాశాల

భూవివాదాల పరిష్కారంలో న్యాయ వ్యవస్థను పక్కనపెట్టి రెవెన్యూ వ్యవస్థకు అధికారాలు కట్టబెట్టడం రాజ్యాంగ విరుద్ధం. ఈ చట్టం వల్ల ఆదివాసీలు, బలహీన, వెనుకబడిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీలకు ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. హక్కుదారుల పేర్లు రిజిస్టర్‌లో నమోదు చేసినప్పుడు నోటీసులివ్వకుండా కేవలం ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ప్రకటించడం హాస్యాస్పదం. రైతుల భూములు తీసుకుని కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించే ప్రయత్నమే ఈ చట్టం ఉద్దేశం.


న్యాయ వ్యవస్థను దూరం పెట్టడం సరికాదు

- లక్ష్మణరెడ్డి, జనచైతన్య వేదిక అధ్యక్షుడు

అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న రెవెన్యూ యంత్రాంగం చేతిలో భూ హక్కు చట్టాన్ని ఉంచడం, న్యాయవ్యవస్థను దూరం పెట్టడం సరికాదు. రైతులకు చెందిన భూముల హద్దు రాళ్లు, పట్టాదారు పాసు పుస్తకాలపై సీఎం జగన్‌ బొమ్మలు వేసుకోవడాన్ని అందరూ వ్యతిరేకించాలి.


కొత్త చట్టంతో ప్రజలకు అన్యాయం

- నర్రా శ్రీనివాసరావు, హైకోర్టు న్యాయవాది

ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం వల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఈ చట్టాన్ని రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాం. ప్రస్తుతం అమలు చేయటం లేదని ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టులో చెప్పారు. ఇది అమల్లోకి వస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని