యువతకు లక్ష విదేశీ ఉద్యోగాలు

రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన దిశగా తెదేపా కసరత్తు ప్రారంభించింది. దీనికి వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు, పారిశ్రామికవేత్తలూ మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు.

Published : 06 May 2024 06:19 IST

ముందుకొస్తున్న ప్రవాసాంధ్రులు, పారిశ్రామికవేత్తలు
ఎన్‌ఆర్‌ఐ తెదేపా ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ
ప్రతి నియోజకవర్గంలో ఆ పార్టీ విభాగ కార్యాలయం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన దిశగా తెదేపా కసరత్తు ప్రారంభించింది. దీనికి వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు, పారిశ్రామికవేత్తలూ మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐ తెదేపా విభాగం ఆధ్వర్యంలో లక్ష విదేశీ ఉద్యోగాల హామీ ఇచ్చారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించి దేశ, విదేశాల్లో ఉద్యోగాలు కల్పించే దిశగా శ్రీకారం చుట్టింది. ఇంట్లో ఉంటూనే పనిచేసే అవకాశాన్ని యువతులకు కల్పించాలనేది ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆలోచన. అందుకు అనుగుణంగానూ పనిచేస్తోంది.

సాధికార కేంద్రం ఏర్పాటు.. శిక్షణ

2014-19 తెదేపా ప్రభుత్వ హయాంలో లక్షలాది మంది శిక్షణ పొంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ తర్వాత యువతకు ఉద్యోగాల్లేవు. వైకాపా ప్రభుత్వం పరిశ్రమలు తరిమేసింది. దీంతో యువతకు చేదోడుగా నిలిచేందుకు.. తెదేపా కేంద్ర కార్యాలయంలో సాధికార కేంద్రం ప్రారంభించింది. మూడేళ్లుగా ఎన్‌ఆర్‌ఐ తెదేపా ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో యువతకు శిక్షణ అందిస్తూ ఉద్యోగాల్లో చేరేందుకు సహకారం అందిస్తోంది. ఇప్పటికే 1,000మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించింది. ఉపాధ్యాయ, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, ఇతర కోర్సులు చేసిన సుమారు 200మందికి పైగా యువతకు వివిధ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పించారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించినా.. పారిశ్రామిక అవసరాల విషయంలో వారికి మార్గనిర్దేశం ఉండటం లేదు. ఇంటర్వ్యూలకు వెళ్తున్న విద్యార్థులకు అదే ప్రధానలోపంగా ఉందని గుర్తించారు. దీంతో ప్రపంచస్థాయి ప్రమాణాలను అనుసరిస్తున్నారు. ‘మెర్సర్‌ స్కోర్‌ ఆధారంగా యువతను కంపెనీలకు పంపిస్తాం. ఒకవేళ యువతకు అందులో తక్కువ స్కోర్‌ వస్తే అవసరమైన శిక్షణ ఇప్పిస్తాం. ఇలా మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పించగలమని నమ్ముతున్నాం’ అని ఎన్‌ఆర్‌ఐ తెదేపా విభాగ అధ్యక్షుడు వేమూరి రవికుమార్‌ వివరించారు.


ఒక్కో పారిశ్రామికవేత్త 20 ఉద్యోగాలిచ్చినా..

‘చంద్రబాబు అమలు చేసిన విధానాల కారణంగా 1990నుంచి ఎంతోమంది విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు సాధించారు. కొన్నేళ్లపాటు అక్కడ పనిచేసి పారిశ్రామికవేత్తలుగా తయారయ్యారు. హైదరాబాద్‌ అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. ఫలితంగానే భాగ్యనగరం మెరిసిపోతోంది’ అని రవికుమార్‌ ఈ సందర్భంగా వివరించారు. ‘ఎన్‌ఆర్‌ఐ తెదేపాలో యూరోప్‌, అమెరికా, జపాన్‌, గల్ఫ్‌ తదితర 15దేశాల నుంచి 3వేల మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వారంతా 20ఉద్యోగాలు చొప్పున సృష్టిస్తే 60వేలు ఇవ్వొచ్చు. వీరు కాకుండా మా విభాగంలో 25వేల మంది వరకు పలు దేశాల్లో, వివిధ స్థాయిల్లో పనిచేసే వారున్నారు. తలో ఉద్యోగం కల్పించినా లక్ష ఉద్యోగాల కల్పనను తేలిగ్గా చేరుకుంటాం’ అని వివరించారు.


నైపుణ్యం ఉంటే విస్తృత ఉపాధి అవకాశాలు

‘యువతకు నైపుణ్యం ఉంటే పలు దేశాల్లో వివిధ రంగాల్లో విస్తృత ఉపాధి అవకాశాలున్నాయి. ఉదాహరణకు ఎయిర్‌ కండిషనింగ్‌, లిఫ్ట్ట్‌ మెకానిక్‌ తదితర విభాగంలో దాదాపు 20వేలకు పైగా ఉద్యోగాలు కల్పించవచ్చు. నైపుణ్యం కలిగిన వారు లేరని ఎలివేటర్‌ కంపెనీ వాళ్లు చెబుతుంటారు. ఈ రంగంలో శిక్షణ ఇప్పిస్తే మంచి ఉపయోగం ఉంటుంది. వీరికి గల్ఫ్‌ దేశాల్లో మంచి అవకాశాలున్నాయి’ అని అమెరికాలోని హ్యూస్టన్‌కు చెందిన శేషుబాబు, ఫ్లోరిడాలో ఉండే తుమ్మల శ్రీనివాస్‌ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఎన్‌ఆర్‌ఐ తెదేపా కార్యాలయం ఏర్పాటుచేసి.. అక్కడే స్థానిక యువతకు శిక్షణ ఇప్పిస్తామని దినేష్‌ నాగమోతు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని