Macharla: మాచర్లలో 5 వేల ఓట్లు డబ్లింగ్‌

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ ఓటరు జాబితాలో 5 వేలకుపైగా ఓటర్లకు రెండేసి ఓట్లు ఉన్నట్లు స్పష్టమైంది. ఎన్నికల సంఘం తాజాగా రూపొందించిన జాబితాను బూత్‌ల వారీగా పరిశీలించగా అక్రమాలు కోకొల్లలుగా వెలుగు చూస్తున్నాయి.

Updated : 29 Oct 2023 11:25 IST

ఎమ్మెల్యే పిన్నెల్లి కుటుంబం, బంధువులకు రెండుచోట్లా ఓటు హక్కు
పేర్లు, ఊర్లు మార్చి..  వేర్వేరు బూత్‌లలో చేర్పులు

ఈనాడు, అమరావతి: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ ఓటరు జాబితాలో 5 వేలకుపైగా ఓటర్లకు రెండేసి ఓట్లు ఉన్నట్లు స్పష్టమైంది. ఎన్నికల సంఘం తాజాగా రూపొందించిన జాబితాను బూత్‌ల వారీగా పరిశీలించగా అక్రమాలు కోకొల్లలుగా వెలుగు చూస్తున్నాయి. ‘డబ్లింగ్‌’ తొలగించాల్సి ఉండగా, బీఎల్‌వోలపై రాజకీయ ఒత్తిళ్లతో వదిలేసినట్లు తెలుస్తోంది. వేల మంది వైకాపా సానుభూతిపరులకు రెండుచోట్లా ఓటు హక్కు ఉండటం గమనార్హం. వీరంతా సాంకేతికంగా ఎక్కడా దొరక్కుండా పేరు, వయసు, ఫొటోల్లో మార్పులు చేసి వేర్వేరు బూత్‌ల పరిధిలో ఓటర్లుగా చేరారు. ఈ అక్రమంలో విశ్రాంత తహసీల్దారు ఒకరు కీలకపాత్ర పోషించినట్లు సమాచారం.

ఎమ్మెల్యే కుటుంబంలోనే డబ్లింగ్‌

  • మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి, అతని కుటుంబసభ్యులకు వారి సొంతూరు వెల్దుర్తి మండలం కండ్లకుంటతో పాటు మాచర్ల పట్టణంలోనూ ఓటుహక్కు ఉంది. ఎమ్మెల్యే భార్య రమకు కండ్లకుంట 114వ బూత్‌లో సీరియల్‌ నంబర్‌ 69లో ఎస్‌కేకే0044859తో ఓటు ఉండగా, మాచర్లలోని 67వ బూత్‌ వరుస సంఖ్య 1176లో ఎస్‌కేకే0098764తో మరో ఓటు ఉంది.
  • ఎమ్మెల్యే సోదరుడు వెంకట్రామిరెడ్డికి కండ్లకుంటలో 114వ బూత్‌లో వరుస సంఖ్య 75లో ఎస్‌కేకే1897669తో ఓటు ఉండగా, మాచర్లలోని 67వ బూత్‌లో వరుస సంఖ్య 1175తో కేబీబీ2864791తోనూ రెండో ఓటు ఉంది.
  • ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి భార్య సోదరులు, వారి కుటుంబసభ్యులకు దుర్గి మండలం కోలగట్ల, మాచర్ల పట్టణంలో ఓట్లున్నాయి. శ్రీనివాసరెడ్డి మద్దికర (ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి బావమరిది)కి కోలగట్లలో 177వ బూత్‌లో వరుస సంఖ్య 651లో ఎస్‌కేకే0164673తో ఓటు ఉండగా, మాచర్లలోని 69వ బూత్‌లో వరుస సంఖ్య 617లో ఎస్‌కేకే9685743తో మరోటి ఉంది. శ్రీనివాసరెడ్డి భార్య, గ్రామ సర్పంచి మద్దికర మహాలక్ష్మి 177వ బూత్‌లో వరుస సంఖ్య 653లో ఎస్‌కేకే0660076తో ఓటు కలిగి ఉన్నారు. మాచర్లలోని 69వ బూత్‌లో వరుస సంఖ్య 620లో ఎస్‌కేకే0686956తో రెండో ఓటు నమోదైంది.
  • జక్కా శివపార్వతికి కోలగట్ల 178వ బూత్‌(ఎస్‌కేకే2381176), దుర్గిలోని 168వ బూత్‌లో (ఎస్‌కేకే0742387) రెండు ఓట్లు ఉన్నాయి.
  • కారంపూడి మండలం ఒప్పిచర్ల వాసి ప్రేమయ్య మహంకాళికి 250వ బూత్‌లో వరుస సంఖ్య 25లో ఎస్‌కేకే1674555తో ఓటు హక్కు ఇచ్చారు. అదే గ్రామంలో 255వ బూత్‌లో వరుస సంఖ్య 337లో ఎస్‌కేకే1807387తో మరో ఓటుహక్కు కల్పించారు. ఇదే గ్రామానికి చెందిన చల్లా జానకి మహాలక్ష్మికి 252(ఎస్‌కేకే2520450), 253(ఎస్‌కేకే2523322) బూత్‌లలో ఓట్లు ఉన్నాయి.
  • రెంటచింతలకు చెందిన వైకాపా ముఖ్య నాయకుడు మోర్తల వెంకటేశ్వరరెడ్డికి స్వగ్రామంలోని 227వ బూత్‌లో వరుస సంఖ్య 1048లో ఎస్‌కేకే0519454తో, రెంటాలలోని 239వ బూత్‌లో వరుస సంఖ్య 520లో ఎల్‌హెచ్‌ఎల్‌ 2977387తో రెండు ఓట్లున్నాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని