మార్షల్స్‌తో సభ నడిపిస్తున్నారు

‘అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలు దురదృష్టకరం. మార్షల్స్‌తో సభ నడిపించాలని చూస్తున్నారు.

Published : 23 Sep 2023 06:00 IST

తెదేపా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలు దురదృష్టకరం. మార్షల్స్‌తో సభ నడిపించాలని చూస్తున్నారు. స్పీకర్‌ అనకూడని మాటలు మాట్లాడటం అసెంబ్లీ చరిత్రలో దురదృష్టకరం. మమ్మల్ని సస్పెండ్‌ చేసి బలవంతంగా బయటకు పంపారు. ఈ ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా వెనకడుగు వేయబోం’. అని తెదేపా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.


చంద్రబాబు తప్పు చేయలేదని వారికీ తెలుసు: ఎమ్మెల్సీ అనురాధ

‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో అవినీతి జరగలేదని, ధర్మం చంద్రబాబు పక్షానే ఉందని వైకాపావాళ్లకూ తెలుసు. మా నాయకుణ్ని మానసికంగా హింసించాలనేదే జగన్‌ ఉద్దేశం. రాజమహేంద్రవరం కేంద్ర కార్యాలయంలో చంద్రబాబుకు మరింత భద్రత కల్పించాలని లోకేశ్‌ కోరితే దాన్నీ వక్రీకరించారు’.


కేసు నిరాధారమని ఐఏఎస్‌లే చెబుతున్నారు
-ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌

‘చంద్రబాబును ఇబ్బంది పెట్టాలనేదే వైకాపా ప్రభుత్వ అజెండా. ఐఏఎస్‌ల దగ్గరనుంచి కింది స్థాయి వరకూ ఈ కేసు నిరాధారమనే చెబుతున్నారు. వైకాపా వాళ్లు ఇంతకింతకు అనుభవిస్తారు. గతంలోనూ తెదేపా ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. ఇప్పుడూ సమర్థంగా ఎదుర్కొంటాం.’


న్యాయబద్ధ ఆందోళనలను అడ్డుకుంటున్నారు
-వైకాపా బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

‘సభలో న్యాయబద్ధంగా నిరసనలు చేస్తున్నా అడ్డుకుంటున్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవే. ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేకుండానే ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.’


తప్పుడు కేసులను వెనక్కు తీసుకోవాలనేదే మా నినాదం
-ఎమ్మెల్సీ అశోక్‌బాబు

‘చంద్రబాబుపై తప్పుడు కేసులను తక్షణం వెనక్కు తీసుకోవాలనేదే సభలోనైనా, మండలిలోనైనా మా నినాదం. మండలిలో అంత తీవ్రత లేకపోయినా అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలు దారుణం. స్పీకర్‌ వ్యాఖ్యలు అనుచితం’.

  • ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, అంగర రామ్మోహన్‌ స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని