YSRCP: వైద్య శిబిరమా..? వైకాపా సమావేశమా?

ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ ప్రచారానికి వాడుకోవడం వైకాపాకు అలవాటుగా మారింది. పక్కా వ్యూహంతో ప్రభుత్వ పథకమైన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను ఎరగా వేసి ఓటర్లను ఆకర్షించేందుకు యత్నిస్తోంది.

Updated : 07 Oct 2023 08:55 IST

పార్టీ కార్యక్రమాల్లా ‘సురక్ష’ శిబిరాలు

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ ప్రచారానికి వాడుకోవడం వైకాపాకు అలవాటుగా మారింది. పక్కా వ్యూహంతో ప్రభుత్వ పథకమైన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను ఎరగా వేసి ఓటర్లను ఆకర్షించేందుకు యత్నిస్తోంది. రోగులకు సేవల ముసుగులో పార్టీ తరఫున ప్రచారానికి తెరలేపింది. ఇందుకు నాయకులు చాలక.. ఐప్యాక్‌ సంస్థ ప్రతినిధులనూ మోహరిస్తోంది. ఫలితంగా వైద్య శిబిరాలు కాస్త.. అధికార పార్టీ సమావేశాల్లా మారిపోయాయి. అనంతపురం జిల్లా రాప్తాడులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం నిర్వహించారు. కార్యక్రమం మొదలుకావడానికి ముందు శిబిరానికి వచ్చిన జనాలతో సభ నిర్వహించారు. రాప్తాడు వైకాపా ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులంతా పాల్గొన్నారు. వారంతా సమావేశంలో మాట్లాడుతూ.. వైకాపాకు ఓటు వేయాలని అభ్యర్థించారు. వైద్యులు కూర్చోవాల్సిన స్థానాన్ని నాయకులు ఆక్రమించారు. రాప్తాడు ఎంపీడీవో మాత్రమే సమావేశంలో కనిపించారు. ఐప్యాక్‌ సభ్యుడు ముందుండి ఇదంతా నడిపించారు. ఎవరేం మాట్లాడాలో సూచనలు ఇచ్చారు. చివరిలో ఐప్యాక్‌ సభ్యుడినీ మాట్లాడాలని పిలవగా.. వేదిక వద్దకు వచ్చిన మీడియాను చూసి ప్రసంగించకుండానే వెనుదిరిగారు. అయితే.. శిబిరాల వద్ద పార్టీ సమావేశాలు వద్దని అనంతపురం జాయింట్‌ కలెక్టర్‌ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. రాజకీయ ఒత్తిళ్లతో కిందిస్థాయి అధికారులు పట్టించుకోవడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని