Andhra news: అ బదులు A చేసి.. సమస్యలు దాచేసి!

సాధారణంగా విద్యార్థుల ప్రోగ్రెస్‌ రిపోర్టులపై.. పెద్దలతో సంతకం చేయించి తీసుకురమ్మంటారు. కానీ, వైకాపా సర్కారు తీరు దానికి రివర్స్‌లో ఉంది.పిల్లల సామర్థ్యాలు తల్లిదండ్రులకు తెలియకుండా.. తమ పనితీరులోని డొల్లతనం బయటపడకుండా.. ఏకంగా ప్రోగ్రెస్‌ రిపోర్టులనే దాచేస్తూ.. జబ్బలు చరచుకుంటోంది.

Updated : 29 Jan 2024 09:19 IST

ఆంగ్లంలో చిన్న చిన్న పదాలూ చదవలేకపోతున్న సర్కారుబడి విద్యార్థులు
బేస్‌లైన్‌ పరీక్షలో తేలిన నిజాలను కప్పేస్తున్న వైనం
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను గాలికి వదిలేసి గొప్పగా ప్రచారం
పూటకో విధానంతో పిల్లలు, ఉపాధ్యాయుల్లో గందరగోళం
తల్లిదండ్రులను మోసం చేస్తున్న జగన్‌ ప్రభుత్వం

సాధారణంగా విద్యార్థుల ప్రోగ్రెస్‌ రిపోర్టులపై.. పెద్దలతో సంతకం చేయించి తీసుకురమ్మంటారు. కానీ, వైకాపా సర్కారు తీరు దానికి రివర్స్‌లో ఉంది.
పిల్లల సామర్థ్యాలు తల్లిదండ్రులకు తెలియకుండా..
తమ పనితీరులోని డొల్లతనం బయటపడకుండా..
ఏకంగా ప్రోగ్రెస్‌ రిపోర్టులనే దాచేస్తూ.. జబ్బలు చరచుకుంటోంది.
విద్యావ్యవస్థను ఉద్ధరిస్తున్నట్లు కలరింగ్‌ ఇచ్చుకుంటోంది.
పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తూ..
అమ్మానాన్నలను మోసం చేసేందుకు మీకు మనసెలా ఒప్పింది జగన్‌?


‘క్యాట్‌, రెడ్‌, సన్‌, న్యూ, ఫ్యాన్‌, బస్‌’ తదితర ఆంగ్ల పదాలను ఒకటో తరగతిలోపే పిల్లలు నేర్చుకుంటారు. కానీ, ప్రభుత్వ బడుల్లో మూడో తరగతి ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న వారిలో 24.3% మంది ఈ పదాలను చదవలేకపోతున్నారు.

గతేడాది జనవరిలో విడుదల చేసిన అసర్‌ నివేదిక-2022లో ప్రథమ్‌ సంస్థ వెల్లడించింది.

‘ఐ లైక్‌ టు రీడ్‌, వేర్‌ ఈజ్‌ యువర్‌ కౌ?, దిస్‌ ఈజ్‌ ఏ బిగ్‌ షాప్‌’ ఇలాంటి చిన్న చిన్న ఆంగ్ల వాక్యాలను 14-16 ఏళ్ల వారిలో 28.9%,     17-18 ఏళ్ల వారిలో 23.6% మంది చదవలేకపోతున్నారు. సులభ భాగహారాన్నీ 41.4శాతం మంది చేయలేకపోయారు.

జనవరి 17న విడుదల చేసిన అసర్‌ సర్వే నివేదిక-2023లో బహిర్గతమైన అంశమిది.  

‘నాన్న రోజూ పొలానికి వెళ్తారు. గతేడాది ధాన్యం బాగా పండింది. అందుకే ఈసారి మళ్లీ వరి వేశాం’ తెలుగులో ఇలాంటి చిన్న పేరాలనూ.. ప్రభుత్వ బడుల్లోని నాలుగు, అయిదో తరగతుల విద్యార్థులు 65.04% మంది తప్పులు లేకుండా చదవలేకపోయారు. ఇదే పేరాను 6, 7, 8 తరగతుల వారిలో 41.58% మంది చదవలేదు.

ఈ సర్వే చేసింది సాక్షాత్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ. 2022లో ప్రథమ్‌ సంస్థతో కలిసి రూపొందించిన ప్రశ్నపత్రంతో విద్యాశాఖ  బేస్‌లైన్‌ పరీక్ష నిర్వహించగా వెలుగుచూసిన వాస్తవాలివీ. కానీ, ఈ నిజాలను  రాష్ట్ర ప్రభుత్వమే రహస్యంగా దాచేసింది.


ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను బయటకు తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం దాచేస్తోంది. ఫలితంగా పిల్లలు నష్టపోవడంతోపాటు వారి తల్లిదండ్రులనూ సర్కారు మోసం చేస్తోంది. వాస్తవాలు ఒకలా ఉంటే జాతీయ సాధన సర్వే(న్యాస్‌) పరీక్షను ఆంగ్లంలో రాసిన వారిలో ఏపీ మొదటి స్థానంలో ఉందంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. ‘ఆంగ్ల మాధ్యమానికి ప్రాధాన్యమిచ్చాం. ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌(ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేశాం.. బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లు ఇస్తున్నాం.. టోఫెల్‌ పెట్టాం.. త్వరలో ఇంటర్నేషనల్‌ బకలారియేట్‌(ఐబీ) సిలబస్‌ రాబోతోంది. సీబీఎస్‌ఈ పాఠాలు చెబుతున్నాం’ అంటూ గొప్పగా ప్రచారం చేసుకోవడం మినహా అసలు క్షేత్రస్థాయి పరిస్థితులను పట్టించుకునే వారే కరవయ్యారు. ఏదైనా కొత్త విధానం తీసుకురావాలంటే.. అంతకంటే ముందు దానిపై విస్తృత అధ్యయనం జరగాల్సి ఉంది. కానీ, రాష్ట్రంలో అవేమీ ఉండటం లేదు. ఒకటి తర్వాత మరొకటి తీసుకొస్తూ హడావుడి చేయడం తప్ప.. క్షేత్రస్థాయిలో అమలును గాలికి వదిలేస్తోంది. విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే ఫార్మెటివ్‌, సమ్మెటివ్‌ పరీక్షలను సైతం చూచిరాతలుగా మార్చేసింది. విద్యకు రూ.70వేల కోట్లు ఖర్చు చేశామని బడాయికి పోతున్న ప్రభుత్వం.. కమీషన్లు వచ్చే అంశాలకే ప్రాధాన్యం ఇస్తోంది. టీచర్ల నియామకం, పిల్లలకు ఉపయోగపడే కార్యక్రమాలపై దృష్టిపెట్టడం లేదు. అవన్నీ వదిలేసి.. వింత ప్రయోగాలతో విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోంది. తాజాగా కృత్రిమ మేధలాంటి ఫ్యూచర్‌ స్కిల్స్‌ నేర్పిస్తామంటూ కొత్త రాగం అందుకుంది.

సిలబస్‌లతో సర్కస్‌..

రాష్ట్ర ప్రభుత్వ అశాస్త్రీయ విధానాలతో పాఠశాల విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. విద్యార్థుల అభ్యసనం, ఉపాధ్యాయుల సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. వైకాపా ప్రభుత్వం వచ్చాక తొలుత రాష్ట్ర సిలబస్‌లోని పుస్తకాలను మార్చారు. 2022-23 నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌ తెచ్చారు. ఆ సమయంలో ప్రపంచంలో సీబీఎస్‌ఈకి మించిన సిలబస్‌ లేదని, ఇది ఎంతో గొప్పదని ప్రభుత్వం ప్రచారం చేసింది. రెండేళ్లలోనే దాన్ని మూలకు పడేసింది. ఇప్పటికే వెయ్యి పాఠశాలలకు సీబీఎస్‌ఈ గుర్తింపు ఉంది. తాజాగా ఇంటర్నేషనల్‌ బకలారియేట్‌(ఐబీ) అంటూ ప్రచారం చేస్తోంది. అయిదేళ్ల కాలంలో సిలబస్‌పైనే ప్రభుత్వానికి స్పష్టత లేదు. ఒక్కోసారి ఒక్కోటి తీసుకొస్తూ.. పిల్లల్ని అయోమయానికి గురి చేస్తోంది.

కంటెంట్‌.. మళ్లీ మళ్లీ..

బైజూస్‌ కంటెంట్‌తో విద్యార్థులకు ప్రభుత్వం ట్యాబ్‌లను అందించింది.   మరోపక్క రూ.లక్షలు ఖర్చు చేస్తూ రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి కొత్తగా కంటెంట్‌ను తయారు చేస్తోంది. రెండు రకాల కంటెంట్‌లను వినియోగిస్తే పిల్లల పరిస్థితి ఏంటి? బోధనకు ఉపాధ్యాయులెలా సిద్ధమవుతారు? పాఠశాల విద్యా శాఖ డబ్బులు ఖర్చు చేసి, మెటీరియల్‌ తయారు చేస్తున్నప్పుడు బైజూస్‌ కంటెంట్‌ ఎందుకు తీసుకుంటున్నట్లో పాలకులకే తెలియాలి.

వాళ్లెందుకు చేదో.?

కొన్నిచోట్ల తెలుగు ఉపాధ్యాయులతో టోఫెల్‌ పాఠాలు చెప్పిస్తున్నారు. రెగ్యులర్‌గా ఆంగ్లం, టోఫెల్‌ పాఠాలు ఒకరే చెబుతుండటం కష్టంగా మారడంతో.. టోఫెల్‌ను వేరే సబ్జెక్టుల వారితో బోధిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 44,478 పాఠశాలలుంటే దాదాపు 32వేల బడుల్లో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌, స్మార్ట్‌ టీవీలతో టోఫెల్‌ బోధన చేస్తున్నారు. మిగతా 12వేలకుపైగా బడుల్లోని పేద పిల్లలకు ఆంగ్ల నైపుణ్యాలు అవసరం లేదని సర్కారు అభిప్రాయమేమో.

ప్రభుత్వానిదే ఆ బాధ్యత..

ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు బాగా చదువుకోవాలనే వారిని బడికి పంపిస్తుంటారు. కానీ, జగన్‌ సర్కారు మాత్రం రకరకాల ప్రయోగాలు చేస్తూ.. విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా బేస్‌లైన్‌ పరీక్ష నిర్వహించి, దాని ఫలితాలను బయటకు రాకుండా దాచేసింది. వెబ్‌సైట్‌ నుంచీ తొలగించింది. పాఠశాలల పరిస్థితులతోపాటు అభ్యసన సామర్థ్యాలనూ తల్లిదండ్రులకు వివరించాల్సిన ప్రభుత్వం, వాస్తవాలను దాచేస్తే నష్టపోయేది పేద విద్యార్థులే కదా!

కాకినాడ జిల్లా బెండపూడి పాఠశాల విద్యార్థులు ఆంగ్లం బాగా మాట్లాడుతున్నారని, ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ, బేస్‌లైన్‌ సర్వేలో ఆంగ్లంలో కొందరి పరిస్థితి అధ్వానంగా ఉన్నట్లు తేలింది. 6, 7, 8 తరగతుల్లోని 290మంది ఆంగ్లంలో చిన్న వాక్యమూ చదవలేకపోయారు.

చేరట్లేదు.. చేరినా మానేస్తున్నారు..

రాష్ట్రంలో అంతా బాగుందని ప్రభుత్వం జబ్బలు చరచుకుంటున్నా.. మధ్యలోనే బడి మానేస్తున్న పిల్లల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. శ్రీకాకుళం జిల్లాలో చేసిన సర్వేలో 14-16 ఏళ్ల వారిలో 1.3 శాతం.. 17-18 ఏళ్ల వారిలో 6.7శాతం మంది పాఠశాల, కళాశాల విద్యకు దూరమవుతున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉపాధి కోసం పిల్లలతో సహా తల్లిదండ్రులు వలస వెళ్తున్నారు. వలస వెళ్లే పిల్లల కోసం సీజనల్‌ హాస్టళ్లు ఏర్పాటు చేయాలనే ఆలోచన జగన్‌ సర్కారుకు లేకపోయింది. ‘సమగ్ర శిక్షా అభియాన్‌’ నిధులను ఐఎఫ్‌పీలు, ట్యాబ్‌ల కోసం మళ్లిస్తున్న ప్రభుత్వం.. పిల్లల కోసం కేటాయించడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో మూడేళ్లుగా ప్రవేశాలు కూడా దారుణంగా పడిపోతున్నాయి. ఇన్ని రకాల సదుపాయాలు, ఐబీ, సీబీఎస్‌ఈ సిలబస్‌, టోఫెల్‌ అమలు చేస్తుంటే, పిల్లలు ఎందుకు రావడం లేదనే దానిపై పాలకులు దృష్టిసారించడం లేదు. 2021-22లో 44.29లక్షలుగా ఉన్న విద్యార్థుల సంఖ్య.. 2023-24లో 38.25లక్షలకు పడిపోయింది. ఇందులోనూ రిజిస్టర్‌లో పేరు ఉండీ, పాఠశాలలకు వెళ్లని పిల్లలూ ఉన్నారు.  వాస్తవంగా చూస్తే ఈ సంఖ్య 37లక్షలే.

ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని