ఉద్యోగులకు డీఏలతో జగన్‌ ఎన్నికల వల

అధికారపీఠం ఎక్కినప్పటి నుంచి ఉద్యోగులపై కక్షకట్టినట్టు వ్యవహరించిన సీఎం జగన్‌.. ఎన్నికల షెడ్యూలు విడుదలకు ఒకరోజు ముందు వారిని మభ్యపెట్టేందుకు రెండు డీఏలను ప్రకటించారు.

Updated : 16 Mar 2024 07:26 IST

పాత బకాయిలను గాలికి వదిలి ఓట్ల కోసం నటన
ఆర్థిక భారాన్ని వచ్చే ప్రభుత్వం పైకి నెట్టేసిన వైనం

ఈనాడు, అమరావతి: అధికారపీఠం ఎక్కినప్పటి నుంచి ఉద్యోగులపై కక్షకట్టినట్టు వ్యవహరించిన సీఎం జగన్‌.. ఎన్నికల షెడ్యూలు విడుదలకు ఒకరోజు ముందు వారిని మభ్యపెట్టేందుకు రెండు డీఏలను ప్రకటించారు. ఉద్యోగసంఘాల నేతలు, ఉద్యోగులు గత కొన్ని నెలలుగా పెండింగ్‌ డీఏలు ఇవ్వాలని నెత్తీనోరూ కొట్టుకుని మొత్తుకున్నా చెవికి ఎక్కించుకోలేదు. సంఘాల నేతలు క్యాంపు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకోలేదు. చర్చల పేరుతో మంత్రివర్గ ఉపసంఘం నిర్వహించిన సమావేశాల్లో డీఏలు ఇవ్వాలని కోరినా పెడచెవిన పెట్టారు. ఇప్పుడు ఎన్నికలు రావడంతో వారి ఓట్లకు గాలం వేసేందుకు రెండు డీఏలను ఒకేసారి ప్రకటిస్తూ శుక్రవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అవి కూడా ఏడాదిగా పెండింగ్‌లో పెట్టినవే. గత ఏడాది జనవరి, జులై మాసాల్లో విడుదల చేయాల్సినవి ఇప్పుడు ప్రకటించారు. 2023 జనవరి డీఏ 3.64%, జులై డీఏ 3.64% ఇచ్చారు.

పెండింగ్‌ డీఏల విడుదలలోనూ జిత్తుల మారితనమే:

పెండింగ్‌ డీఏల విడుదలలోనూ జగన్‌ తన జిత్తులమారితనాన్నే ప్రదర్శించారు. తాజాగా ప్రకటించిన డీఏలతో ఇప్పటికప్పుడు వైకాపా ప్రభుత్వంపై పడే భారం పెద్దగా లేదు. దాన్ని కొత్త ప్రభుత్వంపైకి నెట్టేశారు. జనవరి డీఏ నగదు 2024 ఏప్రిల్‌ జీతంతో కలిపి మే నెలలో ఉద్యోగులకు ఇస్తారు. ఈ ప్రభుత్వం చెల్లించేది ఇదొక్కటే. మిగతాదంతా కొత్త ప్రభుత్వమే చెల్లించాలి. జనవరి నుంచి మార్చి 31 వరకు చెల్లించాల్సిన బకాయిల్ని మూడు వాయిదాల్లో 2024 ఆగస్టు, నవంబరు, వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలల్లో పీఎఫ్‌/జీపీఎఫ్‌ ఖాతాల్లో జమచేస్తారు. సీపీఎస్‌ ఉద్యోగులకు 90% నగదు, మిగతా 10 శాతాన్ని ప్రాన్‌ ఖాతాలకు జమచేయనున్నారు. పదవీవిరమణ చేసే ఉద్యోగులకు బకాయిల్ని పదవీవిరమణ ప్రయోజనాలతో కలిపి చెల్లిస్తామని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

  • 2023 జులై డీఏని ఈ ఏడాది జులై జీతంతో కలిపి ఆగస్టులో చెల్లిస్తారు. 2023 జులై నుంచి 2024 జూన్‌ 30 వరకు చెల్లించాల్సిన బకాయిల్ని మూడు వాయిదాల్లో సెప్టెంబరు, డిసెంబరు, వచ్చే ఏడాది మార్చి నెలల్లో చెల్లించనున్నట్టు తెలిపింది.
  • విశ్రాంత ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఆర్‌ ఉత్తర్వులను విడుదల చేయలేదు. వీరికి బకాయిల్ని నగదు రూపంలో చెల్లించాలి. పాత బకాయిలనే చెల్లించని ప్రభుత్వం కొత్త వాటిపైనా స్పష్టత ఇవ్వలేదు

పాత బకాయిల మాటేంటి?

ఒక్కో ఉద్యోగికి జగన్‌ సర్కారు సగటున రూ.2.5 లక్షలకుపైగా ఇప్పటికీ బకాయి ఉంది. 2022 జులైలో డీఏ మంజూరు ఉత్తర్వులిచ్చినా ఇంతవరకూ ఆ ప్రయోజనాలు అందలేదు. 2018 జులై, 2019 జనవరి డీఏలకు సంబంధించిన దాదాపుగా 66 నెలల బకాయిల్ని చాలామంది ఉద్యోగులకు చెల్లించాలి. సాంకేతికంగా ఇచ్చేసినట్టు చూపించి ఉద్యోగుల నుంచి ఆదాయపన్నును మినహాయించారు. ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉంటుందా?

  • 2019 జులై, 2020 జనవరి, జులై, 2021 జనవరి, జులై డీఏలను 2022 జనవరి నుంచి ఇచ్చిన పీఆర్సీలో కలిపేసి జీతాలు భారీగా పెరిగినట్టు చూపించారు. కానీ వాటికి సంబంధించిన 54 నెలల బకాయిలు ఇవ్వలేదు.
  • 2022లో ఇవ్వాల్సిన జనవరి, జులై డీఏల బకాయిలు రూ.4,500 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. జులైలో ఇచ్చిన డీఏపై ఇంతవరకు ఆర్థిక ప్రయోజనాలే అందలేదు.
  • సీపీఎస్‌ ఉద్యోగులు, పింఛనుదారులకు నగదు రూపంలో చెల్లించాల్సిన డీఏ బకాయిలు రూ.2,100 కోట్లు ఉన్నాయి. ఇన్ని వేల కోట్ల డీఏ బకాయిలు పెట్టి ఇప్పుడు ఎన్నికల షెడ్యూలు రావడానికి ఒకరోజు ముందు ఉద్యోగులను మోసం చేసేందుకు రెండు డీఏలు విడుదల చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని