అరాచకాలకే అగ్రతాంబూలం

అరాచకం, అవినీతి, భూదందాలు సాగిస్తూ.. రౌడీయిజం చెలాయిస్తూ.. ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో చాలామందికి మళ్లీ ఈ ఎన్నికల్లో టికెట్లు దక్కాయి.

Published : 17 Mar 2024 05:04 IST

 వైకాపాకు చెందిన అత్యధిక అభ్యర్థులపై ఎన్నో ఆరోపణలు
అందులో దాదాపు 50 మందివి తీవ్ర అరాచకాలు
భూదందాలు, గనులు.. ఇసుక దోపిడీ, రౌడీయిజం

ఈనాడు, అమరావతి: అరాచకం, అవినీతి, భూదందాలు సాగిస్తూ.. రౌడీయిజం చెలాయిస్తూ.. ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో చాలామందికి మళ్లీ ఈ ఎన్నికల్లో టికెట్లు దక్కాయి. రూ.వేల కోట్ల అవినీతి కేసుల్లో ఛార్జిషీట్‌లు నమోదై.. ప్రస్తుతం బెయిల్‌ తీసుకుని, ముఖ్యమంత్రి పదవిలో ఉన్న జగన్‌ అధినాయకుడిగా ఉన్న వైకాపాలో అనేక మందికి మళ్లీ పోటీచేసే అవకాశం కల్పించడంలో అవే పెద్ద అర్హతలుగా మారడం విశేషం. ఒకవైపు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల అధికారి శనివారం ఎన్నికల షెడ్యూలు ప్రకటిస్తూ.. నాలుగు సవాళ్లను ఉటంకించారు. కండబలం, ధనబలం ఈ ఎన్నికల్లో ప్రధాన సవాళ్లని.. వాటిని ఎదుర్కొంటూ సక్రమంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బృహత్తర బాధ్యత ఉందని ప్రస్తావించారు. దురదృష్టవశాత్తు అధికార వైకాపా అలాంటి అరాచక శక్తులనే మళ్లీ ఈ ఎన్నికల్లో నిలిపింది. రాష్ట్రంలో 175 శాసనసభ, 24 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను శనివారం ఆ పార్టీ ప్రకటించింది. 175 మంది అభ్యర్థుల్లో అత్యధికులు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే.. అందులో అడ్డగోలు దోపిడీ చేస్తూ.. అరాచకశక్తులుగా విశ్వరూపం దాల్చిన వారు దాదాపు 50 మంది ఉన్నారు. క్రిమినల్‌ కేసులు, భూదందాలు, ఇసుక, మైనింగ్‌ దోపిడీ, రౌడీయిజంతో ఇప్పటికే ప్రజలను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. ఈ అక్రమయోధులకే మళ్లీ అభ్యర్థిత్వాలు కట్టబెట్టడం శోచనీయం.

వైకాపా అభ్యర్థుల్లో కొందరి ఘనకార్యాలిలా..

  • ప్రభుత్వంలో పెద్దాయనగా పేరు గాంచి, నంబరు 2గా చెలాయిస్తున్న ఆ నాయకుడు చేయని అరాచకాలు లేవు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అదే స్థానం నుంచి ఆయనకు మళ్లీ టికెట్‌ దక్కింది. తండ్రి పేరుతో అక్కడ తిరిగే టిప్పర్లు సహజ వనరులను దోచేస్తుంటాయి. తన సామ్రాజ్యంలోకి వేరే పార్టీ అధినేతను సైతం అడుగుపెట్టనీయకుండా పోలీసుల అండతో దందా సాగించారు.
  • పల్నాడు ప్రాంతంలోని ఓ నియోజకవర్గంలో నాయకుడి అరాచకాలకు అంతే లేదు. పట్టపగలే రాజకీయ ప్రత్యర్థుల గొంతులు కోస్తారు. విపక్ష పార్టీ జెండా పట్టుకుంటే వారి ఇళ్లు, దుకాణాలకు నిప్పుపెడతారు. ఆ ప్రాంతాన్ని ఆటవిక రాజ్యంగా మార్చేశారు. ఆయన తమ్ముడి ఆధ్వర్యంలోనే అక్రమ మద్యం వ్యాపారం సాగుతోంది. గ్రానైట్‌ లారీల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు పిండుకుంటారు.
  • ఉమ్మడి అనంతపురం జిల్లాలº సొంతిల్లు కూడా లేకుండా ఎమ్మెల్యేగా గెలిచి, ఇప్పుడు రూ.వందల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆ ఘనుడికీ మళ్లీ వైకాపా అభ్యర్థిత్వం దక్కింది. కిందటి ఎన్నికల్లో బీద కబుర్లు చెప్పారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను గడగడలాడించారు. పేదలకు ఇచ్చిన స్థలాలు లాక్కోవడం, ఎర్రమట్టి దందా సాగించడం.. ఆఖరికి పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధమైన వారి నుంచి రూ.కోట్ల కమీషన్లు కావాలంటూ బెదిరించి వారిని తరిమేసిన చరిత్ర ఈయనది.
  • ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బియ్యం డాన్‌గా పేరు మోసిన నాయకుడు మళ్లీ అదే స్థానం నుంచి పోటీకి సిద్ధపడుతున్నారు. ఉమ్మడి జిల్లా మెట్ట ప్రాంతంలోని వందల ఎకరాల్లో గ్రావెల్‌ను తరలించి సొమ్ము చేసుకున్నారు.
  • విశాఖలో రౌడీరాజుగా పేరు పొందారు. గంజాయి బ్యాచ్‌లను, కిరాయి నేరగాళ్లకు అండదండలు అందిస్తూ.. తనకు అనుకూలంగా మలుచుకోవడం ఈయన నైజం. ఒకప్పుడు ఎస్టీడీ బూత్‌ నడుపుతూ జీవితాన్ని ప్రారంభించిన ఈ నాయకుడు స్థిరాస్తి వ్యాపారంలో పాగా వేశాడు. విశాఖలోని ఒక నియోజకవర్గంలో ఏ నిర్మాణం చేపట్టాలన్నా ఈయనకు కప్పం కట్టాల్సిందే.
  • ఆయన సాక్షాత్తూ అధినేతకు దగ్గరి చుట్టం. కడప జిల్లాలో ఈయన అరాచకాలు అన్నీఇన్నీ కావు. కడప నగరంలోనే అనధికారిక వెంచర్లు ఎన్నో వేయించారు. రూ.200 కోట్ల విలువైన 54 ఎకరాల భూమి లాగేసుకున్నారు. సర్వారాయ ప్రాజెక్టు సమీపంలో 400 ఎకరాలు ఆక్రమించి చేపల చెరువులు, పండ్లతోటలు సాగు చేస్తున్నారు. తన కుమారుడి పేరుతో సత్యసాయి జిల్లాలోని భూములకు ఎసరు పెట్టారు.
  • అధికార పార్టీలో కంకర కింకరుడిగా పేరు గాంచాడు మరో నాయకుడు. ఈయన నెల్లూరు జిల్లాలో ఒక స్థానాన్ని దక్కించుకున్నాడు. అక్కడ ఆయన ఆధ్వర్యంలోనే కబ్జాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. జాతీయ రహదారికి పక్కనే గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో 25 ఎకరాల వరకు ఆక్రమించేశారు.
  • రాయలసీమలోని ఒక జిల్లాలో ఆమె మహిళా ప్రజాప్రతినిధి. జగనన్న కాలనీలకు భూములిస్తే పెద్ద మొత్తంలో పరిహారం ఇప్పిస్తామని చెప్పి రైతులతో మాట్లాడుకోవడం.. వచ్చిన సొమ్ములో మూడో వంతు కమీషన్‌గా తీసుకునేలా ఒప్పందాలు చేసుకోవడం ఆమె ప్రత్యేకత. పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడంతో వాటికోసం రైతుల నుంచి తీసుకున్న భూములను వారికి తిరిగి అప్పగించాల్సింది పోయి, వాటిని తానే లాక్కున్నారు. వాటిల్లో విలాసవంతమైన రిసార్టు నిర్మించుకుంటున్నారు.
  • ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో టీడీఆర్‌ కుంభకోణానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారింది మరొకరు. చౌక బియ్యాన్ని తెలివిగా మళ్లించి రూ.కోట్లు వెనకేసుకున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని