పదోన్నతుల ఎర.. టీచర్లకు వల!

ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా పాఠశాల విద్యాశాఖ అధికారులు బరితెగించి ఉపాధ్యాయుల పదోన్నతులు, పోస్టుల హేతుబద్ధీకరణకు చర్యలు చేపట్టారు.

Updated : 27 Mar 2024 05:11 IST

యథేచ్ఛగా పురపాలక పాఠశాలల హేతుబద్ధీకరణ
ఎస్జీటీలకు పదోన్నతులు ఇచ్చేందుకు చర్యలు
ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక విద్యపై శిక్షణ ఇచ్చి టీచర్లుగా నియామకం
పోలింగ్‌ విధుల్లో పాల్గొనేవారిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు

ఈనాడు, అమరావతి: ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా పాఠశాల విద్యాశాఖ అధికారులు బరితెగించి ఉపాధ్యాయుల పదోన్నతులు, పోస్టుల హేతుబద్ధీకరణకు చర్యలు చేపట్టారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో వైకాపా ప్రభుత్వం విఫలం కావడంతో వారంతా జగన్‌ సర్కారుపై వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు వారిని మచ్చిక చేసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ కొత్త ఎత్తుగడ వేసింది. ఉపాధ్యాయులకు పోలింగ్‌ విధులు ఉండే విషయం తెలిసిందే. వీరు ఎన్నికల నిర్వహణలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా టీచర్లకు పదోన్నతులు, సర్దుబాట్లు చేయడానికి అధికారులు సిద్ధమయ్యారంటే తెర వెనుక ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. పురపాలక పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ, సర్దుబాటు చేసేందుకు ఇప్పుడు వివరాలు సేకరిస్తున్నారు.

ఈ నెల 27వ తేదీ లోపు వీటిని పంపాలని జిల్లా విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కోడ్‌ ఉన్న సమయంలో ఇలాంటి చర్యలు చేపట్టకూడదని తెలిసినా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మరోపక్క మిగులుగా (సర్‌ప్లస్‌) ఉన్న సెకండరీ గ్రేడ్‌ టీచర్ల(ఎస్జీటీ)కు శిక్షణ ఇచ్చి స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లుగా నియమించేందుకు మరో ఉత్తర్వు ఇచ్చారు. ఉపాధ్యాయులను ఒక విభాగం నుంచి మరో విభాగానికి మార్పు చేస్తామని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ రావడానికి ముందు సిఫార్సులతో భారీగా ఉపాధ్యాయులను బదిలీ చేసిన అధికారులు.. ఇప్పుడు పదోన్నతులు, సర్దుబాట్లు, హేతుబద్ధీకరణకు సిద్ధమవుతుండటంపై ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోకుండా ముందుకు వెళుతున్నారు. ఎన్నికల కోడ్‌ ఉంటే మాకేంటి? అధికార పార్టీ సేవలో తరించడమే మా పని అని అనుకుంటున్నారో ఏమోగాని, విద్యాశాఖ అధికారుల చర్యలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

టీచర్లను ప్రభావితం చేసేందుకేనా?

గత విద్యా సంవత్సరంలో జిల్లా, మండల పరిషత్తులు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు, హేతుబద్దీకరణ చేశారు. ఇప్పుడు ఎన్నికల కోడ్‌ ఉన్నా పట్టించుకోకుండా పురపాలక బడుల్లో అమలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. జిల్లాల నుంచి పురపాలక పాఠశాలలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలను విద్యాశాఖ సేకరిస్తోంది. సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్నా డీఎస్సీలో పోస్టులను తగ్గించేశారు. ఇప్పుడు అర్హత గల ఎస్జీటీలతో వీటిని భర్తీ చేసేందుకు సిద్ధమయ్యారు. 3, 4, 5 తరగతులను సమీపంలోని ప్రాథమికోన్నత, ఉన్నత బడుల్లో విలీనం చేసేందుకు మ్యాపింగ్‌ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,114 పురపాలక పాఠశాలలు ఉండగా.. వీటికి మంజూరైన పోస్టులు 12,006 ఉన్నాయి. వీటిల్లో దాదాపు 1,942 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చాలాచోట్ల సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. వీటిని ఎస్జీటీలతో భర్తీ చేయనున్నారు.

ప్రత్యేక విద్యా టీచర్లుగా..

ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో మిగులుగా ఉన్న ఎస్జీటీలకు ప్రత్యేక పాఠశాలల్లో ప్రత్యేక విద్య టీచర్లుగా నియమించేందుకు సోమవారం పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆసక్తి ఉన్న ఉపాధ్యాయుల వివరాలను పంపాలని డీఈవోలను ఆదేశించింది. ఆసక్తి చూపిన వారికి ప్రత్యేక విద్య కోర్సుపై శిక్షణ ఇచ్చి, ఆ బడుల్లో నియమిస్తారు. వాస్తవంగా సబ్జెక్టు టీచర్లు, ప్రత్యేక విద్య టీచర్ల ఖాళీలను డీఎస్సీతో భర్తీ చేయాల్సి ఉండగా.. పోస్టుల హేతుబద్దీకరణ, పదోన్నతులతో సర్దుబాటు చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ సమయంలో ఇలా చేయడం.. పోలింగ్‌ విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులను ప్రభావం చేసినట్లవుతుందని సంఘాల నాయకులు కొందరు అభిప్రాయపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని