Super Fast Railway Line: శంషాబాద్‌- విశాఖపట్నం వయా విజయవాడ

తెలుగు రాష్ట్రాల్లో కీలక రైల్వే ప్రాజెక్టులకు బీజం పడింది. ప్రతిపాదిత శంషాబాద్‌- విజయవాడ- విశాఖపట్నం, కర్నూలు- విజయవాడ సూపర్‌ఫాస్ట్‌ రైల్వే లైన్ల కోసం పెట్‌ (ప్రిలిమినరీ ఇంజినీరింగ్‌ అండ్‌ ట్రాఫిక్‌) సర్వే చేపట్టేందుకు రైల్వే బోర్డు తాజాగా అనుమతిచ్చింది.

Updated : 02 Jun 2023 08:08 IST

సూపర్‌ ఫాస్ట్‌ లైన్‌ సర్వేకు గ్రీన్‌ సిగ్నల్‌
కర్నూలు- విజయవాడకు సైతం
ద.మ.రైల్వే ప్రతిపాదనలకు బోర్డు ఆమోదం

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో కీలక రైల్వే ప్రాజెక్టులకు బీజం పడింది. ప్రతిపాదిత శంషాబాద్‌- విజయవాడ- విశాఖపట్నం, కర్నూలు- విజయవాడ సూపర్‌ఫాస్ట్‌ రైల్వే లైన్ల కోసం పెట్‌ (ప్రిలిమినరీ ఇంజినీరింగ్‌ అండ్‌ ట్రాఫిక్‌) సర్వే చేపట్టేందుకు రైల్వే బోర్డు తాజాగా అనుమతిచ్చింది. ప్రక్రియ పూర్తయ్యాక ఈ ప్రాజెక్టుల మంజూరుపై రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంటుంది. ఇవి కార్యరూపం దాలిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య రైలు ప్రయాణం మరింత వేగవంతం అవుతుంది. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి.. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి ప్రతిపాదిత ప్రాజెక్టుల ప్రాధాన్యాన్ని వివరించారు.

ఇప్పటికే గుత్తేదారు ఎంపిక..

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రైల్వే రూట్ల సామర్థ్యం ప్రస్తుతం 110 నుంచి 150 కిమీలోపే ఉంది. శంషాబాద్‌- విజయవాడ- విశాఖపట్నం, కర్నూలు- విజయవాడ మధ్య గంటకు 220 కిమీ గరిష్ఠ వేగం (సెమీ హైస్పీడ్‌)తో రైళ్లను నడిపేందుకు నూతన మార్గాల్ని నిర్మించాలన్నది రైల్వే శాఖ ఆలోచన. ఇందుకు ఆయా రూట్లను ఏయే ప్రాంతాల మీదుగా అలైన్‌మెంట్‌ చేయాలనే అంశానికి సంబంధించి పెట్‌ సర్వేకు ద.మ.రైల్వే కొద్దిరోజుల క్రితం గుత్తేదారును సైతం ఎంపిక చేసింది. సంబంధిత ప్రతిపాదనలకు రైల్వేబోర్డు ప్రస్తుతం ఆమోదం తెలిపింది. సదరు గుత్తేదారు ఆరు నెలల్లో నివేదిక ఇవ్వనున్నారు.

వందేభారత్‌ రైళ్లను దృష్టిలో పెట్టుకుని..

కొన్ని రూట్లు మినహా.. దేశంలో ప్రధాన రైల్వే లైన్ల గరిష్ఠ సామర్థ్యం 130 కి.మీ. మాత్రమే ఉంది. రైల్వేశాఖ కొత్తగా ప్రవేశపెడుతున్న వందేభారత్‌ రైళ్ల వేగ సామర్థ్యం 180 కిమీ కాగా.. త్వరలో ఉత్పత్తి మొదలుకానున్న వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌లను 200 కిమీ వేగంతో ప్రయాణించేలా డిజైన్‌ చేశారు. ద.మ.రైల్వే జోన్‌ పరిధిలో, తెలుగు రాష్ట్రాల మీదుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో వందేభారత్‌ రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది. శతాబ్ది, దురంతో రైళ్ల స్థానంలో క్రమంగా వందేభారత్‌ రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రతిపాదిత నూతన కారిడార్లను 220 కిమీ సామర్థ్యంతో నిర్మించేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు