Updated : 06 Apr 2022 06:30 IST

Janasena Party: 2024 లో వైకాపా రాదుగాక రాదు

ప్రజలనే పల్లకి ఎక్కిస్తా

రాష్ట్రం బాధ్యత జనసేనదే

వైకాపా వ్యతిరేక ఓటును చీలనివ్వం

కేంద్రం పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గించాలి: పవన్‌కల్యాణ్‌

వంద మంది వద్ద పన్నుల రూపంలో వసూలు చేసి మీరనుకున్న 30 మందికిస్తే మిగిలిన 70 మంది ఏం కావాలి? వారు నిశ్శబ్దంగా ఉంటారా? వారికి బాధలుండవా? బాదుడే బాదుడు అన్నమాట జనసేన సృష్టించిందా? మీరు చెప్పింది కాదా? 2018లో విద్యుత్తు బిల్లులు పెంచినప్పుడు మీరన్నది కాదా? మరి అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు తగ్గించాల్సిన బాధ్యత మీపై లేదా?

-జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌

ఈనాడు, అమరావతి: వైకాపా నాయకులు ఎంత గింజుకున్నా, కొట్టుకున్నా రాష్ట్రంలో 2024లో ఆ పార్టీ ప్రభుత్వం రాదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ధీమా వ్యక్తం చేశారు. అరాచకాలు, విధ్వంసాలతో 25ఏళ్లపాటు రాష్ట్రాన్ని వెనక్కు తీసుకెళ్లారని ధ్వజమెత్తారు. ‘వైకాపా వ్యతిరేక ఓటును చీల్చబోమని చాలా ఆలోచించే చెప్పా. సరదాగా, రాజకీయ వ్యూహాల కోసం మాట్లాడలేదు. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలు, వారి అరాచకం, దోపిడీ, రాష్ట్రాన్ని శ్రీలంకలా చేసేసిన వారి విధానాలపై గళం విప్పుతూ చేసిన ఆ ఏకవాక్య తీర్మానానికి వైకాపా నాయకులు భయపడటం ఎందుకు? మీరు ప్రజలకు మంచే చేశామని భావిస్తే ఇంత భయమెందుకు? మోసపోవద్దు.. పల్లకిలు మోయవద్దంటూ జనసేన కార్యకర్తలపై ప్రేమ ఒలకబోయడం ఎందుకు? వైకాపా నాయకులారా గుర్తుంచుకోండి.. ఎవరి పల్లకిలు మోసేందుకు మేము లేము. ప్రజలను పల్లకి ఎక్కించడానికే ఉన్నాం’ అని ప్రకటించారు. ‘అంతేకాదు.. దీనిపై పార్టీలో, బయట భిన్నాభిప్రాయాలు చెబుతున్నారు. వినయంగా ఒకటి చెబుతున్నా. వ్యూహం నాకు వదిలేయండి. ఎవరినో పల్లకి ఎక్కించేందుకు నేను ఇక్కడ లేను. ప్రజలను పల్లకి ఎక్కించడానికే ఉన్నా. రాష్ట్రం బాధ్యత జనసేన తీసుకుంటుందని చెప్పా. అంటే చాలా ఆలోచించే చెప్పా. 4దశాబ్దాల అనుభవమున్న పార్టీ నాయకులు కూడా విలవిల్లాడినా నేను ఇంత ధైర్యంగా ఉన్నానంటే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండి మాట్లాడుతున్నా’ అని పేర్కొన్నారు. ‘నాకు అనుభవం లేదనుకోవద్దు. 2007నుంచి క్షేత్రస్థాయి రాజకీయాల్లో ఉన్నా. ప్రతి ఒక్కరితో మాట్లాడలేకపోవచ్చు. ప్రతి నియోజకవర్గంలో నాకు కళ్లు, చెవులు ఉన్నాయి. నా మనుషులున్నారు’ అని పేర్కొన్నారు. మంగళగిరిలోని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మంగళవారం రాత్రి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి14న రాజకీయ ప్రకటన తర్వాత వచ్చిన విమర్శలు, భిన్నాభిప్రాయాలను ప్రసంగంలో స్పృశించారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.లక్ష సాయమందించాలని నిర్ణయించినట్లు పేర్కొంటూ, దీనికి తాను వ్యక్తిగతంగా రూ.5కోట్లు విరాళమిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న ప్రతి కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శిస్తానని, ఏప్రిల్‌ 12న తొలుత అనంతపురం జిల్లాలో 30మంది కౌలు రైతు కుటుంబాలను కలుసుకొని సాయం అందించాలనుకుంటున్నానని చెప్పారు. ఆయనేమన్నారంటే..

ఎన్నికల్లో ఓటుకు రూ.వెయ్యి ఇస్తే సరిపోతుందా?
ఎన్నికల్లో ఓటుకు రూ.వేయి ఇస్తే సరిపోతుందా? సాటి మనిషికి అండగా ఉండొద్దా? కౌలు రైతుల సంగతే తీసుకుందాం. సమాచార హక్కు చట్టం ప్రకారం తీసుకున్న వివరాల్లోనే.. ఒక కర్నూలు జిల్లాలో ఈ మూడేళ్లలో 350 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న వారిలో అన్ని కులాలవారూ ఉన్నారు. అన్నం పెట్టే రైతుల కులాలు చూడకూడదు. ఓసీ కులాలకు వైకాపా ప్రభుత్వం సాయమందించడం లేదు. ఇది బాధాకరం. అన్నదాతలు వేలల్లో చనిపోతుంటే బాధగా ఉంది. అందుకే జనసేన తరఫున ఒక్కో కుటుంబానికి రూ.లక్ష సాయమందిస్తాం. అది పెద్ద సాయం కాకపోవచ్చు. కష్టాల్లో ఉన్నవారిని చూస్తే దాని నుంచి ఏదో బావుకోవాలనో, ఓట్లు దండుకోవాలనో ఆలోచించను. వారికి ఏం చేయాలని ఆలోచిస్తా. వారి కుటుంబాలకు రూ.5 కోట్లు ఇస్తున్నా. ఎందరో నాయకులు దేశం కోసం సర్వస్వం అర్పించారు. నాకు అంత పెద్ద హృదయం లేకపోవచ్చు. 2024లో మేం అధికారంలోకి వస్తాం. అంతవరకు కష్టాల్లో ఉన్నవాళ్లని ఏదోలా ఆదుకోవాలి కదా. మనసుంటే డబ్బులు వస్తాయి. ముందు మొదలు పెడదాం.

లేని సమస్యను నేను మాట్లాడగలనా?
లేని సమస్యను నేను సృష్టించగలనా? ప్రతిదానికి డబ్బులు డబ్బులు లేవు అంటారు. కౌలు రైతుల సమస్య నేను సృష్టించానా? మద్యనిషేధమని చెప్పి ఓట్లడిగారు. మళ్లీ తప్పుడు లాజిక్‌ చెబుతారు. ధరలు పెంచడం వల్ల మద్యం వినియోగం తగ్గుతుందని చెబుతారు. వాళ్ల ఇష్టానికి వాళ్లు మాట్లాడేస్తారు. చెత్తపన్ను వేస్తున్నారు. ఆస్తిపన్ను పెంచేశారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. ఇది కొత్త తరం రాజకీయాలు.

కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించాలి
పెట్రోధరలు పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. తగ్గించాలని కేంద్రాన్ని కోరుతున్నా. ఈ డిమాండ్‌ చేస్తున్నా కదా అని ఎవరూ విపరీతార్థాలు తీయవద్దు. భాజపాతో పొత్తులో ఉన్నాం కదా అని ఒక మాట చెప్పేందుకు భయపడక్కర్లేదు. నాకు ఆ భయాలు లేవు. ఆ కేసులు తీసెయ్యండి.. ఈ కేసులు తీసెయ్యండని అడిగే పరిస్థితులు నాకు లేవు. అలాంటి పరిస్థితులూ తెచ్చుకోను. పొత్తులో ఉన్నప్పుడు 70శాతం ఏకాభిప్రాయం ఉంటే చాలు..30శాతం భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. మన అభిప్రాయాలూ చెప్పవచ్చు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను జనసేన వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వమే ఈ విశాఖ ఉక్కుకు గనులు కేటాయించే పరిస్థితి వస్తుంది. ఈ విషయంలో కార్మికుల పక్షాన నిలబడి కేంద్రానికి గౌరవంగా తెలియజేస్తాం. ఒకవేళ ప్రైవేటీకరణకే కేంద్రం ముందుకెళితే అన్ని పక్షాలతో కలిసి ఆలోచించి అది ఆపేందుకు ఏ ప్రణాళికతో ముందుకెళ్లవచ్చో చూస్తాం. జనసేన యువతకు ఉద్యోగాలు వచ్చేలా చూస్తుంది. షణ్ముఖ వ్యూహంతో ప్రకటించినవి అమలుచేస్తుంది.

ఎన్నికలు ముందొచ్చినా సిద్ధం
ఎన్నికలకు రెండేళ్ల గడువుంది. ముందు వచ్చినా సిద్ధం. ప్రతి నియోజకవర్గాన్ని నేనే సమీక్షిస్తా. పార్టీని బలోపేతం చేయాలి. ఉత్తరాంధ్రలో ఒక ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుచేస్తా. అక్కడ బలం ఉండి సరిగా ఎదగలేకపోతున్నాం. నాయకత్వం వారికి అందించాలి. తదుపరి తమ ప్రభుత్వం రాకపోయినా అప్పులు విపరీతంగా చేసి వచ్చే ప్రభుత్వమూ ఏమీ చేయలేని పరిస్థితులు కల్పించాలని వైకాపా అనుకుంటోంది. అది కూడా జనసేన ఎదుర్కొంటుంది. అప్పులూ తీరుస్తాం’ అని పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు.
‘సంక్షేమ కార్యక్రమాలపై గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు. రైతులను ఆదుకునేవారు లేరు. 2011లో అప్పటి ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకునేందుకు చట్టంచేసినా ఈ ముఖ్యమంత్రి 2019లో చట్టాన్ని సవరించేశారు. అది కౌలు రైతులకు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టింది’ అని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. కౌలు రైతులకు సాయం కోసం పవన్‌కల్యాణ్‌ చేపట్టిన కార్యక్రమానికి రూ.10లక్షల సాయాన్ని పార్టీ నాయకుడు, సినీ నటుడు నాగబాబు ప్రకటించారు.


* ‘రాష్ట్రంలో బలమైన పాలన వ్యవస్థ ఉంటే నేరగాళ్లు భయపడతారు. పేకాట క్లబ్బులు, నృత్యాలు.. ఇవేమిటని అడిగితే రౌడీయిజం చేస్తారు.’
* ‘ఐఏఎస్‌లు మోకాళ్లపై కూర్చుని రాష్ట్ర నాయకత్వానికి లొంగిపోతే ప్రభుత్వం సరిగా పనిచేయడంలేదనే అర్థం’
* ‘ఉద్యోగాలిస్తామన్న వైకాపా నాయకత్వం మాటలు నమ్మి యువత ఓటేశారు. ఆ తర్వాత జాబ్‌క్యాలెండర్‌ మరిచారు. అందుకే రాష్ట్రంలో గంజాయి సాగు పెరుగుతోంది. ఉద్యోగాలు లేక యువత అటు వెళ్లిపోతోంది.’

-జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌


Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని