మార్కెట్లోకి KTM 125, KTM 200.. కొత్తగా తీసుకొచ్చిన మార్పులివే..

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు కేటీఎం.. కొత్తగా మరో రెండు బైక్‌లను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. 2022 కేటీఎం ఆర్‌సీ 125, కేటీఎం ఆర్‌సీ 200ను బుధవారం విడుదల చేసింది.

Published : 13 Oct 2021 20:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు కేటీఎం.. కొత్తగా మరో రెండు బైక్‌లను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. 2022 కేటీఎం ఆర్‌సీ 125, కేటీఎం ఆర్‌సీ 200ను బుధవారం విడుదల చేసింది. రెండో తరానికి చెందిన ఈ ఆర్‌సీ సిరీస్‌లో పలు మార్పులు చేశారు. కొత్తగా పలు ఫీచర్లను జోడించడంతో పాటు డిజైన్‌లోనూ మార్పులు చేశారు. ఆర్‌సీ 125 ధరను రూ.1.82 లక్షలుగా (ఎక్స్‌ షోరూమ్‌, దిల్లీ) కంపెనీ నిర్ణయించింది. ఆర్‌సీ 200 మోడల్‌ ధరను రూ.2.08గా పేర్కొంది. వీటి బుకింగ్స్‌ను ప్రారంభమైనట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

కొత్తగా తీసుకొచ్చిన ఆర్‌సీ 125లో హేలోజన్‌ హెడ్‌ల్యాంప్‌ను అమర్చారు. ఆర్‌సీ 200 మాత్రం ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌తో తీసుకొచ్చారు. గ్లోబల్‌గా రిలీజ్‌ చేసిన మోడళ్లలో రెండింట్లోనూ హేలోజన్‌ హెడ్‌ల్యాంప్స్‌ను మాత్రమే అమర్చారు. అలాగే, అడ్జస్ట్‌ చేసుకునేందుకు వీలున్న హ్యాండిల్‌ బార్స్‌ను ఇచ్చారు. ఫ్యూయల్‌ ట్యాంక్‌ కెపాసిటీ సైతం 9.5 లీటర్ల నుంచి 13.7 లీటర్లకు పెంచారు. ముందు వైపు యూఎస్‌డీ ఫోర్క్స్‌, వెనుకవైపు మోనో షాక్‌ అబ్జార్బర్‌ను అమర్చారు. ఇంజిన్‌లో పెద్దగా మార్పు చేయలేదు. ఆర్‌సీ 125లో 124.7 సీసీ సింగిల్‌ సిలిండర్‌ లిక్విడ్‌ కూల్‌ ఫ్యూయల్‌ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 9250 ఆర్‌పీఎం వద్ద 14.5 పీఎస్‌ పవర్‌ను, 8000 ఆర్‌పీఎం వద్ద 12Nm పీక్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆర్‌సీ 200 విషయానికొస్తే ఇందులో 199.5సీసీ సింగిల్‌ సిలిండర్‌ లిక్విడ్‌ కూల్డ్‌ ఫ్యూయల్‌ ఇంజెక్ట్‌డ్‌ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 10వేల ఆర్‌పీఎం వద్ద 25పీఎస్‌ పవర్‌ను, 8000 ఆర్‌పీఎం వద్ద 19.5 Nm పీక్‌ టార్క్‌ను అందిస్తుంది. రెండిట్లోనూ 6 స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ను అమర్చారు.

ఈ రెండోతరం ఆర్‌సీ బైక్‌లు గ్లోబల్‌గా ఆగస్టులోనే విడుదలయ్యాయి. ఇక భారత్‌లో తాజాగా విడుదలైన ఆర్‌సీ 200 అక్టోబర్‌ నుంచి అందుబాటులోకి రానుండగా.. ఆర్‌సీ 125 మోడల్‌ నవంబర్‌ నుంచి అమ్మకానికి రానుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. కేటీఎం భారత్‌లో అడుగుపెట్టి పదేళ్లు పూర్తయిందని, అందుకే ప్రత్యేక ధర కింద వీటిని విక్రయిస్తున్నట్లు బజాజ్‌ కంపెనీ ప్రో బైకింగ్‌ బిజినెస్‌ యూనిట్‌ ప్రెసిడెంట్‌ సుమీత్‌ నారంగ్‌ తెలిపారు. కేటీఎంలో బజాజ్‌కు వాటా ఉన్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని