Bitcoin: కొనసాగుతున్న బిట్‌కాయిన్‌ పతనం.. 30వేల డాలర్ల డౌన్‌!

ప్రముఖ క్రిప్టోకరెన్సీల పతనం ఇంకా కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ఓ దశలో బిట్‌కాయిన్ విలువ 7 శాతానికి పైగా కుంగింది. దీంతో కాయిన్‌ విలువ 38,261 డాలర్ల వద్ద ఐదు నెలల కనిష్ఠానికి చేరింది.....

Published : 21 Jan 2022 19:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ క్రిప్టోకరెన్సీల పతనం ఇంకా కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ఓ దశలో బిట్‌కాయిన్ విలువ 7 శాతానికి పైగా కుంగింది. దీంతో కాయిన్‌ విలువ 38,261 డాలర్ల వద్ద ఐదు నెలల కనిష్ఠానికి చేరింది. ఈథర్‌ విలువ 3,000 డాలర్లకు పడిపోయింది. గత ఏడాది నవంబరులో జీవనకాల గరిష్ఠానికి చేరుకున్న ఈ డిజిటల్‌ టోకెన్ల మొత్తం విలువ ఇప్పటి వరకు 1 ట్రిలియన్‌ డాలర్ల వరకు పతనమవడం గమనార్హం.

అమెరికాలో వడ్డీరేట్ల పెంపు ప్రకటనతో మదుపర్లు మరింత సురక్షితమైన పెట్టుబడుల వైపు మళ్లడమే క్రిప్టోల పతనానికి ప్రధాన కారణంగా కనిపిస్తోందని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరోవైపు అమెరికాలో టెక్ కంపెనీ షేర్లు భారీగా పడిపోవడం కూడా కరెన్సీ విలువపై ప్రభావం చూపుతోంది. క్రిప్టో కరెన్సీలు పూర్తిగా బ్లాక్‌ చైన్‌ సాంకేతికతపై నడుస్తున్న విషయం తెలిసిందే. బినాన్స్‌ కాయిన్‌, కార్డనో, సొలానా వంటి ఇతర ప్రముఖ కాయిన్ల విలువ సైతం పతనమైంది.

వివిధ దేశాల్లో క్రిప్టో కరెన్సీని చట్టబద్ధం చేసే అవకాశం ఉందన్న ఊహాగానాల మధ్య బిట్‌కాయిన్‌ విలువ భారీగా పెరిగిన విషయం తెలిసిందే. గత నాలుగేళ్లలో కాయిన్‌ విలువ నాలుగింతలు పెరిగి 69,000 డాలర్లకు చేరింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు దాదాపు 30,000 డాలర్లు పతనమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని