Pension Planning: పెన్షన్‌ ప్లాన్‌ తీసుకుంటున్నారా?ఈ 5 అంశాలు గుర్తుపెట్టుకోండి!

రిటైర్మెంట్‌ తర్వాత పింఛను కోసం తీసుకునే ప్లాన్‌లలో ఈ అంశాలు ఉండేలా చూసుకోవాలి...

Updated : 14 Dec 2021 12:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రోజురోజుకీ సామాజిక అంశాల్లో అనేక మార్పులు వస్తున్నాయి. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్నాయి. దీంతో పెద్దవారి బాగోగులు చూసుకోవడానికి ఎవరూ ఉండడం లేదు. పిల్లలు మెరుగైన ఉపాధి అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లక తప్పడం లేదు. పైగా నిత్యావసరాల ఖర్చులు పెరిగిపోతున్నాయి. అదనంగా కొత్త కొత్త జబ్బులు వచ్చిపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పింఛను కోసం ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా రిటైర్మెంట్‌ ప్లాన్‌ను కలిగి ఉండడం తప్పనిసరైంది.

అయితే, బాగా సంపాదిస్తున్నప్పుడే రిటైర్మెంట్‌ కోసం పటిష్ఠ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. సరైన మార్గంలో పెట్టుబడి పెట్టాలి. అప్పుడే సుఖప్రదమైన రిటైర్మెంట్‌ జీవితాన్ని అనుభవించగలం. అయితే, చాలా మంది దీన్ని పెద్దగా పట్టించుకోరు. భారత్‌లో ప్రతి నలుగురిలో ఒక్కరు కనీసం ఇప్పటి వరకు రిటైర్మెంట్‌ గురించి అసలు ఆలోచన కూడా చేయలేదట! మిగిలిన ముగ్గురు కూడా తమ పెట్టుబడుల్లో రిటైర్మెంట్‌ జీవితానికి పెద్దగా కేటాయింపులు చేయలేదని తేలింది.

మార్కెట్‌లో రిటైర్మెంట్ ప్లాన్ల పేరిట అనేక పెట్టుబడి పథకాలు ఉన్నాయి. ఉద్యోగ విరమణ తర్వాత క్రమం తప్పని ఆదాయాన్ని అందించడమే వీటి ప్రధాన లక్ష్యం. వీటిలో వినియోగదారులు దేన్నైనా ఎంపిక చేసుకోవచ్చు. అయితే, మీరు తీసుకునే ప్లాన్‌లో కొన్ని అంశాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం..!

ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడి..

నిత్యావసరాల ధరలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో సూచించేదే ద్రవ్యోల్బణం. కాబట్టి మనం రిటైర్మెంట్‌ కోసం చేసే పెట్టుబడి కచ్చితంగా ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడి ఇవ్వగలగాలి. ఉదాహరణకు ఏటా 6 శాతం ద్రవ్యోల్బణం ఉందనుకుందాం! అలాంటప్పుడు మన దగ్గర ప్రస్తుతం ఉన్న రూ.100 విలువ ఏడాది తర్వాత రూ.94 అవుతుంది. అంటే మనం చేసే మదుపు 6 శాతం లేదా అంతకంటే తక్కువ రిటర్న్స్‌ ఇస్తే ఉపయోగం ఉండదు.

నష్టభయం వద్దు..

నష్టభయం ఎక్కువగా ఉన్న  పథకాల్లో అస్సలు  మదుపు చేయొద్దు. రిటైర్మెంట్‌ అనంతర జీవితాన్ని సుఖంగా గడపాలే తప్ప నష్టభయంతో ఆందోళనకు గురికావొద్దు. పైగా ఆ వయసులో నష్టాన్ని భరించడం కూడా కష్టమే. ఎలాగూ ఆదాయం ఉండదు. పైగా పెట్టిన పెట్టుబడి కూడా పోతే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

సరిపడా పింఛను..

మీరు చేసే పెట్టుబడి రిటైర్మెంట్‌ తర్వాత నెలానెలా కొంత పింఛను అందించగలగాలి. పైగా అది మీ అవసరాలకు సరిపోవాలి. అలాగే అత్యవసర నిధి కోసం కొంత మొత్తాన్ని జమ చేసుకునేలా ఉండాలి.

యాన్యుటీ మొత్తం ఎంత?

యాన్యుటీని ఇవ్వడంలో రిటైర్మెంట్‌ పథకాలు ఒక్కోటి ఒక్కోలా ఉంటాయి. కొన్ని ప్లాన్లు ఒక నిర్ణీత కాలం వరకు మాత్రమే యాన్యుటీని అందజేస్తాయి. మరికొన్నేమో జీవితాంతం అందిస్తాయి. మరికొన్నైతే.. మరణం తర్వాత జీవితభాగస్వామికి లేదా వారిపై ఆధారపడ్డవారికి కూడా యాన్యుటీని అందజేస్తాయి.

పన్నులు..

రిటైర్మెంట్‌ ప్లాన్లను ఎంచుకునేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాల్సిన మరొక ముఖ్యమైన అంశం పన్నులు. మీరు ఎలాంటి పెన్షన్‌ ప్లాన్‌ తీసుకుంటున్నారనే అంశాన్ని బట్టి పన్నులు మారుతూ ఉంటాయి. అలాగే మీరు భరించే నష్టాన్ని బట్టి కూడా పన్నులు ఉంటాయి.

Read latest Business News and Telugu News

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని