దేశీయ సాంకేతిక అంకురాలకు మైక్రోసాప్ట్‌ అండ

దేశీయ సాంకేతిక అంకురాలకుసహకారం అందించేందుకు ఇన్వెస్ట్‌ ఇండియాతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు మైక్రోసాఫ్ట్‌ ఇండియా మంగళవారం వెల్లడించింది. ఇందులో భాగంగా ‘యాక్సిల్‌రేటింగ్‌ గ్రోత్‌ ఆఫ్‌ న్యూ

Updated : 25 Aug 2021 04:08 IST

ఇన్వెస్ట్‌ ఇండియాతో జట్టు

దిల్లీ: దేశీయ సాంకేతిక అంకురాలకుసహకారం అందించేందుకు ఇన్వెస్ట్‌ ఇండియాతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు మైక్రోసాఫ్ట్‌ ఇండియా మంగళవారం వెల్లడించింది. ఇందులో భాగంగా ‘యాక్సిల్‌రేటింగ్‌ గ్రోత్‌ ఆఫ్‌ న్యూ ఇండియాస్‌ ఇన్నోవేషన్స్‌’ (ఏజీఎన్‌ఎల్‌ఐ మిషన్‌) కార్యక్రమంతో కలిసి మైక్రోసాఫ్ట్‌ ఫర్‌ స్టార్టప్స్‌ ప్రోగ్రామ్‌ పనిచేయనుంది. ‘ఏజీఎన్‌ఎల్‌ఐ మిషన్‌ సహకారంతో 11 అంకురాలను మైక్రోసాఫ్ట్‌ ఫర్‌ స్టార్టప్స్‌ ప్రోగ్రామ్‌లో చేర్చుకుంది. ఇవి వ్యవసాయం, రక్షణ- భద్రత, ఐటీ/ ఐటీఈఎస్‌, ఇ-మొబిలిటీ, వ్యర్థ నిర్వహణ, ఆర్థిక సేవల రంగాలకు చెందినవ’ని సంస్థ తెలిపింది. ‘దేశీయ అంకురాలను పెద్ద సంస్థలుగా తీర్చిదిద్దేందుకు ప్రపంచంలోని దిగ్గజ సంస్థలతో జట్టు కట్టడంలో ఏజీఎన్‌ఎల్‌ఐ కీలక పాత్ర పోషించింద’ని ఇన్వెస్ట్‌ ఇండియా, ఎండీ, సీఈఓ దీపక్‌ బాగ్లా అన్నారు. ఎంపికైన అంకురాలు మైక్రోసాప్ట్‌ సాంకేతికతలను ఉపయోగించుకుని, తమ వ్యాపారాలు నిర్వహించుకుంటాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 


భారత్‌పే నుంచి 12% క్లబ్‌ యాప్‌

దిల్లీ: ఫిన్‌టెక్‌ అంకురం భారత్‌పే వినియోగదారుల విభాగంలోకి ప్రవేశించి, 12% క్లబ్‌ యాప్‌ను ఆవిష్కరించింది. వ్యక్తుల నుంచి వ్యక్తులు రుణం తీసుకునేందుకు ఈ యాప్‌ వీలు కల్పిస్తుంది. వినియోగదారులు ఇందులో మదుపు చేసి 12 శాతం వడ్డీకి రుణం ఇవ్వవచ్చు. ఇతరులు ఇదే వడ్డీకి రుణం తీసుకోవచ్చు. ఈ యాప్‌ ద్వారా ఎవరైనా సరే.. పీ2పీ విధానంలో ఎంపిక చేసిన ఎన్‌బీఎఫ్‌సీల ద్వారా రుణం ఇచ్చేందుకు వీలుంది. రుణగ్రహీతలు గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు ఎలాంటి హామీ లేకుండా 12 శాతం వడ్డీకి అప్పు తీసుకోవచ్చు. దీన్ని 3 నెలల్లోగా తీర్చాల్సి ఉంటుంది. ఇందులో పెట్టుబడి పెట్టిన వారు.. ఏ సమయంలోనైనా తమ పెట్టుబడిని పూర్తిగా లేదా పాక్షికంగా వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. ఒక వ్యక్తి ప్రస్తుతం గరిష్ఠంగా రూ.10లక్షల వరకు మదుపు చేయొచ్చు. కొన్ని నెలల్లో దీన్ని రూ.50 లక్షలకు పెంచే ప్రయత్నాల్లో ఉన్నట్లు భారత్‌పే తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని