Petrol Prices: ఆగని పెట్రో బాదుడు!

దేశవ్యాప్తంగా పెట్రో ధరలు మరోసారి పెరిగాయి. ఆదివారం లీటర్‌ పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్‌పై 28 పైసలు పెంచుతూ దేశీయ ఇంధన విక్రయ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.103.36 చేరుకుంది. ఇక రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌....

Updated : 20 Jun 2021 11:59 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రో ధరలు మరోసారి పెరిగాయి. ఆదివారం లీటర్‌ పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్‌పై 28 పైసలు పెంచుతూ దేశీయ ఇంధన విక్రయ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.103.36కు.. డీజిల్‌ రూ.95.44కు చేరుకుంది. ఇక రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌ జిల్లాలో అత్యధికంగా లీటర్‌ పెట్రోల్‌ ఏకంగా రూ.108.37కి చేరడం గమనార్హం. ఇప్పటికే మొత్తం 7 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 పైకి ఎగబాకిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో రాజస్థాన్, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, లద్దాఖ్‌, కర్ణాటక ఉన్నాయి.

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.101.04గా, డీజిల్‌ రూ.95.89గా నడుస్తోంది. దేశ రాజధాని దిల్లీలో ఈ రేట్లు వరుసగా.. రూ.97.22, రూ.87.97గా ఉన్నాయి. మే 4 తర్వాత పెట్రో ధరలు పెరగడం ఇది 27వ సారి. ఈ 48 రోజుల్లో లీటర్‌ పెట్రోల్‌ రూ.6.82, లీటర్‌ డీజిల్ రూ.7.24 ప్రియమైంది. అంతకుముందు ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దాదాపు 18 రోజుల పాటు ధరల పెరుగుదల నిలిచిపోయింది.

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో పాటు దేశీయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన అధిక పన్నులే భారీ పెట్రో ధరలకు ప్రధాన కారణాలు. అయితే, గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ ధరలు కాస్త తగ్గినప్పటికీ దేశీయంగా ధరలు మాత్రం పెరగడం గమనార్హం.  అయితే, ఇటీవలి ఎన్నికల సందర్భంగా ధరల పెంపును నిలిపివేసిన సమయంలో తలెత్తిన నష్టాల నుంచి కోలుకోవడానికే ఇంధన విక్రయ సంస్థలు ధరల్ని పెంచుతున్నాయని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని