మీ కోవిడ్ పాలసీ క్లెయిమ్ తిర‌స్క‌రించారా.. కార‌ణాలు ఇవే కావ‌చ్చు..

కోవిడ్-స్పెసిఫిక్ పాలసీ క్లెయిమ్ తిర‌స్క‌ర‌ణ‌కు గురికాకుండా కోవిడ్ నిర్ధార‌ణ అయిన వెంట‌నే బీమా సంస్థ‌కు తెలియ‌ప‌ర‌చ‌డం మంచిది. 

Published : 04 May 2021 16:49 IST

కోవిడ్ కేసుల సంఖ్య పెరిగేకొద్దీ, బీమా క్లెయిమ్‌లు కూడా పెరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన క్లెయిమ్‌ల‌ను వేగ‌వంతంగా ప‌రిష్క‌రించేందుకు సంస్థ‌లు చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. అయితే కొన్ని క్లెయిమ్‌లు మాత్రం తిర‌స్క‌ర‌ణ‌కు గురవుతున్నాయి. పాల‌సీదార‌డు ఆసుపత్రిలో చేరినప్పుడు,  కొన్ని కారణాలతో బీమా సంస్థ క్లెయిమ్‌ల‌ను తిర‌స్క‌రించే అవ‌కాశం ఉంది లేదా క్లెయిమ్‌ల‌ను పూర్తిగా పరిష్కరించక‌పోవ‌చ్చు. 

హాస్పిట‌లైజేష‌న్ అనేది సాంకేతికంగా ఆరోగ్య బీమా ప‌రిధిలో ఉండాలంటే ఈ మూడు ప‌రిస్థితుల‌కు లోబ‌డి ఉండాలి. మొద‌టిది, ఆసుప‌త్రిలో చేర‌డం అవ‌స‌రం అని నిపుణుడైన వైద్యుడు సూచించాలి.  రెండవ‌ది, ప్ర‌మాణిక చికిత్స‌, అందుకు త‌గిన‌ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించాలి. మూడోది  అన్నిటికంటే ముఖ్య‌మైన‌ది ఆసుప‌త్రిలో మాత్ర‌మే చేయ‌గ‌ల యాక్టీవ్ లైన్ ట్రీట్‌మెంట్ అయివుండాలి. 

ఉదాహ‌ర‌ణ‌కు, తేలికపాటి కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉండి, వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ అవ‌స‌రం లేకుండా నోటి మాత్ర‌ల‌తో న‌యం అయ్యే ప‌రిస్థితులు ఉన్న‌ప్పుడు, చికిత్స కోసం ఆసుప‌త్రిలో చేరిన‌ప్ప‌టికీ ఆరోగ్య బీమా వ‌ర్తించ‌దని నిపుణులు చెబుతున్నారు.  

కోవిడ్ ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల తిర‌స్క‌ర‌ణ‌కు కార‌ణాలు..

డాక్యుమెంటేషన్ సమస్య..
బీమా క్లెయిమ్‌ల‌కు సంబంధించి అవ‌స‌ర‌మైన అన్ని ప‌త్రాల‌ను చాలా వ‌ర‌కు ఆస్పత్రులు ఇవ్వ‌డం లేద‌ని బీమా సంస్థ‌లు చెబుతున్నాయి. కేవ‌లం బీమా చేసిన వ్య‌క్తి కోవిడ్ పాజిటీవ్‌గా నిర్ధార‌ణ అయిన‌ట్లు మాత్ర‌మే నివేదిక‌ను పంపిస్తున్నాయి. దీంతో అనేక ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. 

బీమా ప్ర‌దాత‌లుగా, పాల‌సీదారుని ఆరోగ్య ప‌రిస్థితి, తీవ్ర‌త‌ సంస్థ‌లు అంచనా వేయాలి. హోమ్ క్వారెంటైన్ నుంచి ఆసుప‌త్రిలో చేరే అవ‌స‌రం ఉందా.. అనేది తెలుసుకోవాలి. ఇందుకోసం, ఎయిమ్స్‌, ప్ర‌భుత్వం, డబ్ల్యూహెచ్‌ఓ, ఐసిఎంఆర్ మార్గదర్శకాలను  అనుస‌రించాల‌ని సూచిస్తున్న‌ట్లు మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సురెన్స్‌-ప్రొడ‌క్ట్స్‌, అండ‌ర్ రైటింగ్ అండ్ క్లెయిమ్స్ డైరెక్ట‌ర్ భ‌బ‌తోష్ మిశ్రా తెలిపారు. 

సాధారణంగా డేకేర్ చికిత్స విభాగంలో కోవిడ్ క‌వ‌ర్ కాదు. పాల‌సీ నిబంధ‌న‌లు, ష‌ర‌తుల‌కు లోబ‌డి హోమ్ క్వారంటైన్‌, ఇన్ పేషెంట్ చికిత్స‌లు క‌వ‌ర‌వుతాయి. ప్ర‌తీ క్లెయిమ్ ద‌ర‌ఖాస్తుకు సరైన బిల్లులు, డిస్చార్జ్ స‌మ‌రీలు, డియాగ్న‌స్టిక్ రిపోర్టులు, వైద్యుని  ప్రిస్క్రిప్షన్లు జ‌త‌చేయాలి. లేదంటే దావాలు తిరస్క‌రించే అవ‌కాశం ఉంది. ప్రోటోకాల్స్ ప్ర‌కారం ఆసుప్ర‌తిలో చేరే సూచ‌న‌లు లేన‌ప్పుడు కూడా క్లెయిమ్‌లు తిర‌స్క‌రిస్తారు. 

అవ‌స‌రం లేకుండా ఆసుప్ర‌తిలో చేరితే..
ప్ర‌స్తుత ప‌రిస్థితులు ఏవిధంగా ఉన్నాయంటే, తేలిక‌పాటి ల‌క్ష‌ణాలు ఉన్న వ్య‌క్తిని ఆసుప‌త్రిలో చేరిస్తే, అవ‌స‌ర‌మైన వారికి (వ్యాధి తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న రోగులకు) ఆసుప‌త్రిలో ఐసీయూ ప‌డ‌క‌లు, గ‌దులు అందుబాటులో ఉండ‌డం లేదు. 

అందువ‌ల్ల తేలిక‌పాటి ల‌క్ష‌ణాలు ఉన్న వారిని ఆసుప‌త్రిలో చేర్చాల్సిన అవ‌స‌రం లేదు. అయిన‌ప్ప‌టికీ రోగి ఆసుప‌త్రిలో చేరితే, అందుక‌య్యే ఖ‌ర్చుల‌కు క్లెయిమ్ సెటిల్మెంటు ర‌ద్దు చేస్తారు. అనవసరమైన పరీక్షలతో పాటు, అధిక యాంటీబయాటిక్స్ వాడకం కూడా చూస్తున్నామని, ఇది క్లెయిమ్‌ల పెరుగుదలకు దారితీస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. 

ఆసుప‌త్రిలో చేర‌కుండానే చేసే క్లెయిమ్‌లు తిర‌స్క‌రిస్తారు. అదే విధంగా పాల‌సీలో పేర్కొన్న స‌మ‌యం కంటే ఆసుప‌త్రిలో చేరిన వ్య‌వ‌ధి త‌క్కువ కూడా ఉన్న‌ప్పుడు కూడా క్లెయిమ్‌ల‌ను తిర‌స్క‌రిస్తారు. 

ముందుగా ఉన్న వ్యాధులు దాచిపెడితే..
ఆరోగ్య బీమా పాల‌సీ కొనుగోలు చేసే ఒక నెల లేదా అంత‌కంటే ముందు నిర్దార‌ణ అయిన వ్యాధులు(పీఈడి) గురించి బీమా సంస్థ‌లకు తెలియ‌జేయాలి. ముఖ్యంగా కోవిడ్‌-స్పెసిఫిక్ పాల‌సీని కొనుగోలు చేసేప్పుడు పీఈడి గురించి త‌ప్ప‌నిస‌రిగా తెలియ‌జేయాలి. లేదంటే చికిత్స స‌మ‌యంలో బ‌య‌ట ప‌డితే పాల‌సీ క్లెయిమ్‌ల‌ను తిర‌స్క‌రణ‌కు గురికాక త‌ప్ప‌దు.

బీమా సంస్థ‌లు కూడా క్లినిక‌ల్ పారామితుల‌ను స‌మీక్షిస్తాయి. ఇందుకోసం ప్ర‌త్యేకించి బీమా సంస్థ త‌రపున వైద్యులుంటారు. చికిత్స చేసిన విధానం, క్లినిక‌ల్ స‌మీక్ష పూర్తైన త‌ర్వాత క్లెయిమ్స్ ఆమోదిస్తారు. “బీమా చేసిన వ్యక్తికి డయాబెటిస్ /రక్తపోటు వంటి సహ-అనారోగ్యాలు ఉంటే, బీమా కొనుగోలు సమయంలో స‌రైన‌ సమాచారాన్ని ఇవ్వాలి. 

వెయిటింగ్ పిరియ‌డ్‌..
సాధార‌ణ ఆరోగ్య బీమా పాల‌సీ అయినా,  కోవిడ్ స్పెసిఫిక్ అయినా వెయిటింగ్ పిరియ‌డ్‌తో వ‌స్తాయి. ఈ స‌మ‌యంలో చేసే క్లెయిమ్‌ల‌ను బీమా సంస్థ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోదు. కోవిడ్-స్పెసిఫిక్ పాలసీల కోసం,  15 రోజులు, సాధారణ ఆరోగ్య పాలసీల‌కు 30 రోజులు, పీఈడిలకు నాలుగు సంవత్సరాలు, నిర్దిష్ట అనారోగ్యాలకు ఒకటి లేదా రెండు సంవత్సరాలు వెయిటింగ్ పిరియ‌డ్ ఉంటుంది. 

పాలసీని కొనుగోలు చేయడానికి ముందు పాలసీదారుడు కోవిడ్ కలిగి ఉంటే, పాల‌సీ రిజ‌క్ట్ అవుతుంది.  వెయిటింగ్ పీరియడ్ పూర్తైన త‌రువాత తీసుకునే చికిత్స‌కు సంబంధించిన క్లెయిమ్‌ల‌ను మాత్ర‌మే ప‌రిష్క‌రిస్తారు. 

డొమిసిలియరీ హాస్పిటలైజేషన్..
బీమా చేసిన వారి ఆరోగ్య పరిస్థితి కారణంగా గానీ, ఆసుపత్రిలో బెడ్స్ అందుబాటులో లేకపోవడం వల్ల గానీ ఇంట్లో జరిగే చికిత్స/వ్యాధుల కోసం అయ్యే ఖర్చులను కవర్ చేసేదే డొమిసిలియ‌రీ హాస్ప‌ట‌లైజేష‌న్‌. "కొన్ని ఆరోగ్య పథ‌కాలు, కరోనా కవర్-ఆధారిత పాలసీలు డొమిసిలియరీ హాస్పిటలైజేషన్‌ను అందిస్తున్నప్పటికీ, ఈ సదుపాయాన్ని తీసుకోవటానికి బీమా సంస్థల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవ‌డం అవసరం." బీమా సంస్థల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకపోతే క్లెయిమ్‌లు రద్దు చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని