Digital Payments: యూపీఐ, క్యూఆర్‌ కోడ్‌ చెల్లింపుల ఆల్‌టైమ్‌ రికార్డ్‌

భారత్‌లో యూపీఐ, క్యూఆర్‌ కోడ్ ద్వారా జరిగే డిజిటల్ చెల్లింపుల్లో గణనీయమైన వృద్ధి ఉన్నట్లు వరల్డ్‌లైన్ ఇండియా అనే సంస్థ రూపొందించిన నివేదికలో పేర్కొంది. గతేడాదితో పోలిస్తే 2021 క్యూ3లో డిజిటల్‌ చెల్లింపుల్లో 103 శాతం వృద్ధి నమోదైనట్లు వెల్లడించింది. 

Published : 03 Dec 2021 20:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా, లాక్‌డౌన్‌ పరిస్థితుల తర్వాత భారత్‌లో డిజిటల్‌ చెల్లింపులు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తాజా నివేదికలో వెల్లడయింది. వీటిలో ఎక్కువగా క్యూఆర్‌ కోడ్, యూనిఫైడ్ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ద్వారా జరిగే లావాదేవీలు ఎక్కువగా ఉన్నాయట. ఈ మేరకు వరల్డ్‌లైన్ ఇండియా అనే సంస్థ ఇండియా డిజిటల్ పేమెంట్స్‌ రిపోర్ట్ క్యూ3 2021 పేరుతో రూపొందించిన నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. 2021 క్యూ3 (జులై నుంచి సెప్టెంబరు)లో యూపీఐ ద్వారా జరిగే చెల్లింపుల్లో  103 శాతం పెరుగుదల చోటుచేసుకుందని నివేదికలో పేర్కొంది. 2020తో పోలిస్తే ఇది వంద శాతం పెరుగుదలని తెలిపింది. మొత్తంగా 2021 క్యూ3లో 360 కోట్ల లావాదేవీలు జరగ్గా వీటి విలువ రూ. 771 వేల కోట్లుగా ఉంది.    

అలానే వ్యక్తులకు చేసే చెల్లింపులు (పర్సన్‌-టు-పర్సన్‌) 54 శాతం, వాణిజ్యపరమైన చెల్లింపులు (పర్సన్‌-టు-మర్చంట్‌) 46 శాతం పెరిగినట్లు వెల్లడించింది. 2021 క్యూ3లో సుమారు 30కిపైగా బ్యాంకులు యూపీఐ సేవలను తమ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాగా, 2021 సెప్టెంబరు నాటికి ఈ సంఖ్య 259కి చేరినట్లు నివేదికలో పేర్కొంది. దీంతోపాటు క్యూఆర్‌ కోడ్ ద్వారా చెల్లింపులు చేసే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నట్లు తెలిపింది. 2021 సెప్టెంబరు నాటికి భారత్‌ క్యూఆర్‌ (బీక్యూఆర్‌) ద్వారా 52 లక్షల లావాదేవీలు, యూపీఐ క్యూఆర్‌ ద్వారా 11.96 కోట్ల లావాదేవీలు జరిగినట్లు నివేదికలో వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఇవి 116 శాతం పెరిగినట్లు తెలిపింది. 

పాయింట్ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) టెర్మినల్‌ ద్వారా 2021 జనవరిలో 47.1 లక్షల లావాదేవీలు జరగ్గా, 2021 సెప్టెంబరు నాటికి ఈ సంఖ్య 49.7 లక్షలు చేరింది. పీఓఎస్‌ టెర్మినల్ మార్కెట్లో ప్రైవేటు రంగ బ్యాంకులది 67 శాతం కాగా, ప్రభుత్వరంగ బ్యాంకులు 26 శాతం, పేమెంట్స్‌ బ్యాంక్స్‌ 6 శాతం, విదేశీ బ్యాంకులు ఒక శాతం మార్కెట్‌వాటాతో కొనసాగుతున్నాయి. భారతీయ బ్యాంకుల్లో హెచ్‌డీఎఫ్‌సీ, యూకో, యాక్సిస్‌, ఐసీఐసీఐ, ఆర్‌బీఎల్‌, స్టేట్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా ముందువరుసలో ఉన్నాయి. 

కిరాణా, రెస్టారెంట్, వస్త్ర దుకాణాలు, మందుల కొనుగోలు, హోటళ్లు, జ్యూయలరీ, గృహోపకరణాలు, డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌ వంటి చోట్ల 40 శాతం చెల్లింపులు జరగ్గా, మొత్తం విలువలో ఈ వాటా 50 శాతం కావడం గమనార్హం. ఆన్‌లైన్‌, ఈ-కామర్స్‌, గేమింగ్, ఆర్థికపరమైన సేవలకు సంబంధించి జరిగిన లావాదేవీల్లో 4 శాతం వాటా ఉంది. రాష్ట్రాల పరంగా చూస్తే భౌతికంగా చేసే డిజిటల్‌ చెల్లింపుల్లో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక ముందు వరుసలో ఉన్నాయి. నగరాల పరంగా హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నగరాలు ప్రథమ స్థానాల్లో ఉన్నట్లు నివేదికలో పేర్కొంది.    

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని