RILAGM: కొవిడ్‌పై పోరుకు రిలయన్స్‌ ‘5 మిషన్స్‌’ 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 44వ వార్షిక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో భారీ ప్రకటనలు ఉంటాయని వాటాదారులు ఆశిస్తున్నారు. తొలుత కొవిడ్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయిన రిలయన్స్‌ సిబ్బంది, వాటాదారులు, వారి కుటుంబ సభ్యులకు

Updated : 24 Jun 2021 15:34 IST

వార్షిక సమావేశంలో అంబానీ కుటుంబం వెల్లడి

ఇంటర్నెట్‌డెస్క్‌: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 44వ వార్షిక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో భారీ ప్రకటనలు ఉంటాయని వాటాదారులు ఆశిస్తున్నారు. తొలుత కొవిడ్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయిన రిలయన్స్‌ సిబ్బంది, వాటాదారులు, వారి కుటుంబ సభ్యులకు నిమిషం పాటు మౌనం పాటించారు. మనమంతా మానవీయ సంక్షోభంలో ఉన్నామని రిలయన్స్‌ అధినేత ముకేశ్ అంబానీ విచారం వ్యక్తం చేశారు. మానవత్వ స్ఫూర్తిని కరోనా మహమ్మారి పరీక్షిస్తోందని ఆయన సతీమణి నీతా అన్నారు. కొవిడ్‌పై పోరుకు రిలయన్స్‌ అయిదు మిషన్స్‌ ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. 

గురువారం మధ్యాహ్నం 2 గంటలకు రిలయన్స్‌ వార్షిక సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. తొలుత ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. ‘‘వరుసగా రెండో ఏడాది వాటాదారులతో ముఖాముఖీ మాట్లాడ లేకపోతున్నాను. కొవిడ్‌ కారణంగా వర్చువల్‌ విధానంలో జరుగుతున్న సమావేశంలో అనేక మందివాటాదారులు పాల్గొన్నారు. మహమ్మారి వ్యాప్తి ఉన్నా.. మంచి పనితీరు ప్రదర్శించాము. కొవిడ్‌పై పోరాటంలో ప్రతి ఉద్యోగి భాగస్వామి అయ్యారు. మన సంస్థ కొవిడ్‌ సమయంలో చేసిన సేవలను ఈషా, ఆకాశ్‌ వివరిస్తారు’’ అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ.. ‘‘కొవిడ్‌-19 అతిపెద్ద సంక్షోభం. మానవత్వానికి పరీక్ష పెట్టింది. అంత చీకటి సమయంలో కూడా మా లక్ష్యాలు మెరిశాయి. మేము అందరం సమష్టిగా పోరాడాం. కొవిడ్‌ వ్యాప్తి మొదలుకాగానే మా 14 పాఠశాలలు డిజిటల్‌ మోడ్‌లోకి మారాయి. జియో ఇన్‌స్టిట్యూట్‌ ఈ ఏడాది నుంచి నవీ ముంబయిలోని క్యాంపస్‌లో తరగతులు ప్రారంభించనుంది. గతేడాది పృథ్వీ ఆకాశ్‌ అంబానీ రాకతో నేను, ముఖేశ్‌ బామ్మా తాతయ్య అయ్యాము. కొవిడ్‌పై పోరుకు రిలయన్స్‌ మొత్తం ఐదు కార్యక్రమాలను చేపట్టింది. మిషన్‌ ఆక్సిజన్‌, మిషన్‌ కొవిడ్‌ ఇన్‌ఫ్రా, మిషన్‌ అన్నసేవ, మిషన్‌ ఎంప్లాయికేర్‌, మిషన్‌ వ్యాక్సిన్‌ సురక్ష కార్యక్రమాలు మొదలుపెట్టాం’’ అని వెల్లడించారు. 

‘‘జామ్‌ నగర్‌ రిఫైనరీని కొన్ని రోజుల్లోనే అత్యుత్తమ శ్రేణి మెడికల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రంగా మార్చేశాం. మా ఇంజినీర్లు 85వేల పనిగంటలు వెచ్చించి దీనిని సాధించారు. ప్రస్తుతం రిలయన్స్‌ దేశ అవసరాల్లో 11శాతం మెడికల్‌ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తోంది. దీన్ని పూర్తి ఉచితంగా అందిస్తున్నాం. రిలయన్స్ దేశ విదేశాల నుంచి 100 మెడికల్‌ గ్రేడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లను కొనుగోలు చేసింది. పలు ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను అమర్చాం’’ అని నీతా తెలిపారు. 

‘‘గతేడాది 250 పడకలతో ఒక ఆసుపత్రిని ముంబయిలో ఏర్పాటు చేశాం. సెకండ్‌ వేవ్‌ తాకగానే 870 పడకలతో మరో ఆసుపత్రిని ఏర్పాటు చేశాం. దేశం మొత్తం మీద 2,000 పడకలతో సకల సదుపాయాలతో కూడిన ఆసుపత్రులను అందుబాటులోకి తెచ్చాం. రోజుకు 15వేల పరీక్షలు నిర్వహించే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాము. కొవిడ్‌ యోధులకు ధన్యవాదాలు.  అన్న సేవ కార్యక్రమంలో పశువులు, ఇతర జీవాలకు కూడా ఆహారం అందించాము. మా రిలయన్స్‌ కుటుంబంలో ఉద్యోగులకు కొవిడ్‌ ప్రారంభం నుంచి వర్క్‌ఫ్రం హోం ఇచ్చాము. ఎటువంటి వేతన కోతలు విధించలేదు. ఉద్యోగులకు, వారి కుటుంబాలకు అండగా నిలిచాము’’  అని ఆమె వెల్లడించారు. 

‘‘భారత్‌కు మాస్‌ వ్యాక్సినేషన్‌ అత్యంత కీలకం. మేము 116 వ్యాక్సినేషన్‌ సెంటర్లను 109 పట్టణాల్లో ఏర్పాటు చేశాము. జియో హెల్త్‌ హబ్‌ ద్వారా బుక్‌ చేసుకొని ఇక్కడ ఉచితంగా వ్యాక్సినేషన్‌ చేయించుకోవచ్చు. రోజుకు లక్ష టీకాలు ఇస్తున్నాము. దీనిని ఇప్పటికే రిలయన్స్‌ కుటుంబంలోని 20 లక్షల మందికి ఉచితంగా టీకాలు ఇచ్చాము. వ్యాక్సిన్‌ సురక్ష అతిపెద్ద కార్పొరేట్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ’’ నీతా వివరించారు.

‘‘ఇప్పుడు మా తాతగారు ఉంటే గర్వపడేవారు. రిలయన్స్‌ ఈ విధంగా దేశానికి సేవ చేయాలని ఆయన కలలు గన్నారు. మాలో ప్రతి ఒక్కరు అవసరమైన వారికి సాయం చేశారు. ’’- ఈషా అంబానీ

‘‘రిలయన్స్‌ కుటుంబం దేశ ఇంధన, డిజిటల్‌ అవసరాలపై ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా కృషి చేసింది.’’- ఆకాశ్‌ అంబానీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని