Updated : 12 Apr 2021 16:09 IST

కరోనా ఫియర్‌.. సూచీలు బేజార్‌

మార్కెట్లకు బ్లాక్‌ మండే

ముంబయి: కరోనా భయాలు స్టాక్‌మార్కెట్లను కమ్మేశాయి. లాక్‌డౌన్‌ వార్తలతో సూచీలు బేజారయ్యాయి. ఒక్క రోజులో 3శాతానికి పైగా పతనమయ్యాయి. ఫలితంగా మదపర్ల లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైంది.  

దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతుండటం, మహారాష్ట్రలో బుధవారం నుంచి లాక్‌డౌన్‌ విధించనున్నట్లు వస్తున్న వార్తలతో దేశీయ మార్కెట్లు సోమవారం బేర్‌మన్నాయి. ట్రేడింగ్‌ ఆరంభమైన కొద్ది క్షణాల్లోనే భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. ఈ ఉదయం 48,956 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించిన సెన్సెక్స్‌ కాసేపటికే 1400 పాయింట్లు పతనమైంది. ఇంట్రాడేలో 47,693 వద్ద కనిష్ఠ స్థాయిని తాకిన సూచీ చివరకు కాస్త కోలుకున్నా భారీ నష్టం తప్పలేదు. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 1707.94(3.44శాతం) పాయింట్లు కుంగి 47,883.38 వద్ద స్థిరపడింది. అటు జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 524.10(3.53%) పాయింట్లు దిగజారి 14,310.80 వద్ద ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు కుదేలయ్యాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు 9శాతానికి పైగా కుంగిపోగా.. ఆటో, ఎనర్జీ, ఇన్‌ఫ్రా, లోహ రంగ షేర్లు 4-5 శాతం నష్టపోయాయి.

రూ. 8లక్షలకోట్ల సంపద ఆవిరి.. 

సూచీల నష్టాలతో నేటి ట్రేడింగ్‌లో రూ. లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ నేడు రూ. 8లక్షల కోట్లు తగ్గి రూ. 201లక్షల కోట్లకు పరిమితమైంది. శుక్రవారం నాటి ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ కంపెనీ మార్కెట్‌ విలువ రూ. 209లక్షల కోట్లుగా ఉంది. 

మార్కెట్‌ పతనానికి కారణాలివే..

భారీగా పెరిగిన కొవిడ్‌ కేసులు

 నేడు రికార్డు స్థాయిలో 1.69లక్షల కరోనా కేసులు నమోదు కావడంతో మార్కెట్లు బెంబేలెత్తిపోయాయి. ప్రపంచంలోని ప్రతి ఆరు  కేసుల్లో ఒకటి భారత్‌లో నమోదుకావడం ఆందోళనకరంగా మారింది. 2021లో ఇతే అత్యధికం. ప్రపంచంలోనే అత్యధిక కొవిడ్‌ కేసులు నమోదైన దేశాల్లో భారత్‌ రెండోస్థానంలోకి చేరింది. ఈ అంశాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేశాయి. 

లాక్‌డౌన్‌ భయాలు..

మహారాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించే విషయంలో బుధవారం నిర్ణయం తీసుకోనున్నట్లు వస్తున్న వార్తలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేశాయి. ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధివిధానాలపై.. ఆర్థిక ఒత్తిడిని తట్టుకొనే వ్యూహాలపై చర్చిస్తోందని ఆ రాష్ట్రమంత్రి రాజేష్‌ తోపే ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. దేశ ఆర్థిక వ్యవస్థలో మహారాష్ట్రది కీలకపాత్ర. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని వ్యాపారాలపై దీని ప్రభావం ఉండొచ్చనే ఆందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే  దిల్లీలో కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చారు. 

ఎఫ్‌పీఐల విక్రయాలు..

ఈ నెల ఇప్పటి వరకు ఫారిన్‌ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు దాదాపు రూ.929 కోట్లను నికరంగా విక్రయించారు. ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడంపై ఆందోళనలు నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. ఈక్విటీల నుంచి రూ.740 కోట్లు, డెట్‌మార్కెట్‌ నుంచి రూ.189 కోట్లను వాపస్‌ తీసుకొన్నారు. 9వ తేదీ వరకు వివరాలు మాత్రమే ఇవి. నేడు ఈమొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో రూపాయి విలువ భారీగా పతనం అయింది. నేటి ఉదయం 8నెలల అత్యల్ప విలువలో రూపాయి ట్రేడింగ్‌ మొదలైంది. 

బ్యాంకింగ్‌ షేర్లలో విక్రయాలు..

మార్కెట్‌ సూచీల్లో బ్యాంకింగ్‌ షేర్లవి అత్యంత కీలక స్థానం. కరోనా రెండో తరంగం వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధిస్తే వీటి ఎన్‌పీఏలు మరింత పెరిగే అవకాశం ఉండటం మదుపరుల్లో ఆందోళనను రేకెత్తించింది.  ఎస్‌బీఐ,హెచ్‌డీఎఫ్‌సీ,ఐసీఐసీఐ బ్యాంక్‌,ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌,యాక్సెస్‌ బ్యాంక్‌,పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ వంటి భారీ షేర్లు మొత్తం కుంగడంతో సూచీల పతనం తప్పలేదు. 

ఆసియా మార్కెట్ల పతనం..

నేడు ఆసియా మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి. జపాన్‌ నిక్కీ, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్‌, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్‌ సూచీలు 0.5శాతం నుంచి 1శాతం వరకు పతనమయ్యాయి. ఈ భయాలు దేశీయ మార్కెట్లను కూడా కమ్మేశాయి. 

అమెరికాలో ద్రవ్యోల్బణ భయాలు..

మార్చిలో అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు వెలువడటం కూడా మార్కెట్లను భయపెట్టాయి. మరోపక్క అమెరికా ట్రెజరీ ఈ వారం రుణాల మంజూరుకు మరో 100 బిలియన్‌ డాలర్లను సిద్ధం చేస్తోంది.  మరోపక్క అమెరికా ట్రెజరీ బాండ్ల ఈల్డ్‌ ఎగబాకాయి. ఇవి మార్చి నాటి అంచనాల కన్నా ఎక్కువగా పెరిగాయి. 

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని