Telecom AGR: టెలికం సంస్థలకు సుప్రీంలో ఎదురుదెబ్బ.. బకాయిలు మొత్తం చెల్లించాల్సిందే!

సవరించిన స్థూల ఆదాయ(ఏజీఆర్‌) బకాయిలను తిరిగి లెక్కించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించిన టెలికం సంస్థల సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వర రావు, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌...

Published : 23 Jul 2021 12:51 IST

దిల్లీ: సవరించిన స్థూల ఆదాయ(ఏజీఆర్‌) బకాయిలను తిరిగి లెక్కించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించిన టెలికం సంస్థలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వర రావు, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌తో కూడిన ధర్మాసనం దీనిపై నేడు విచారణ జరిపింది.

ఏజీఆర్‌ ఛార్జీల లెక్కింపునకు డిపార్ట్‌ ఆఫ్‌ టెలికం(డీఓటీ) అనుసరించిన విధానంలో దోషాలు ఉన్నాయని టెలికం సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఆ దోషాలు పరిహరించి లెక్కిస్తే ఏజీఆర్‌ ఛార్జీలు చాలా వరకు తగ్గుతాయని అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏజీఆర్‌ ఛార్జీలను తిరిగి లెక్కించేలా డీఓటీకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా టెలీ సర్వీసెస్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అందుకు విముఖత వ్యక్తం చేసింది. ఏజీఆర్‌ ఛార్జీలను 10 వార్షిక వాయిదాల్లో చెల్లించాలని ఏప్రిల్‌ 1న జారీ చేసిన ఆదేశాల్లోనే పునఃలెక్కింపును కోర్టు నిషేధించిందని నేటి తీర్పులో ధర్మాసనం గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఏజీఆర్‌ ఛార్జీలను తిరిగి లెక్కించడం కుదరని తేల్చి చెప్పింది.

నిధుల కొరతతో సతమతమవుతున్న వొడాఫోన్‌ ఐడియాకు నేటి సుప్రీంకోర్టు తీర్పు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. డీఓటీ ప్రకారం.. వొడాఫోన్ ఐడియా రూ.58,400 కోట్లు.. టాటా టెలీసర్వీసెస్‌ రూ.16,798 కోట్లు.. ఎయిర్‌టెల్‌ రూ.43,980 కోట్లు చెల్లించాల్సి ఉంది. వీటిలో వొడాఫోన్ రూ.7,854 కోట్లు, ఎయిర్‌టెల్‌ రూ.18,003, టాటా టెలీ రూ.4,197 కోట్లు చెల్లించాయి. అయితే, తమ లెక్కల ప్రకారం.. వొడాఫోన్‌ రూ.21,533 కోట్లు, ఎయిర్‌టెల్‌ రూ.13,003 కోట్లు, టాటా టెలీ రూ.2,197 కోట్లు చెల్లించాల్సి ఉందని ఆయా సంస్థలు వాదిస్తున్నాయి. డీఓటీ గనక దోషాలను పరిహరించి లెక్కిస్తే తమ ఏజీఆర్‌ బకాయిలు భారీగా తగ్గుతాయని పేర్కొంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని