Stock market: అరగంటలో సూచీల్లో ఒమిక్రాన్‌ ఆందోళన మాయం!

ఈరోజు ఉదయం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలను వెంటాడిన కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాలు ఎంతోసేపు నిలవలేదు. కేవలం అరగంటలోపే సూచీలు ఆ ఆందోళన నుంచి బయటకు వచ్చేశాయి....

Updated : 29 Nov 2021 15:46 IST

ముంబయి: ఈరోజు ఉదయం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలను వెంటాడిన కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాలు ఎంతోసేపు నిలవలేదు. కేవలం అరగంటలోపే సూచీలు ఆ ఆందోళన నుంచి బయటకు వచ్చేశాయి. దేశీయంగా ఉన్న సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్నాయి. మరోవైపు దీర్ఘకాలంలో భారత మార్కెట్లపై మదుపర్లు బుల్లిష్‌గా ఉన్న నేపథ్యంలో కనిష్ఠాల వల్ల కొనుగోళ్ల తాకిడి పెరిగింది. దీంతో సూచీలు భారీగా పుంజుకున్నాయి. రిలయన్స్‌ టారిఫ్‌లు పెంచడం, ప్రైవేటు బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటాపై ఆర్‌బీఐ సానుకూల ప్రతిపాదనలు, ముడి చమురు ధర తగ్గడం వంటి పరిణామాలు సూచీలకు దన్నుగా నిలిచాయి. వీటితో పాటు ఐరోపా మార్కెట్లు లాభాలతో ప్రారంభం కావడం సూచీల్లో విశ్వాసం నింపింది.

ఉదయం సెన్సెక్స్‌ 57,028.04 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 56,382.93 వద్ద కనిష్ఠాన్ని, 57,626.51 వద్ద గరిష్ఠాన్ని తాకింది. ఇంట్రాడే కనిష్ఠాల నుంచి సెన్సెక్స్ ఏకంగా 700 పాయింట్లు ఎగబాకింది. చివరకు 153.43 పాయింట్ల లాభంతో 57,260.58 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 16,782.40-17,160.70 మధ్య కదలాడింది. చివరకు 27.50 పాయింట్లు లాభపడి 17,053.95 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.09 వద్ద నిలిచింది. సెన్సెక్స్‌ 30 సూచీలో 18 షేర్లు లాభపడ్డాయి. కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టైటాన్‌, టీసీఎస్‌, బజాజ్ ఫినాన్స్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌, రిలయన్స్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎంఅండ్‌ఎం షేర్లు రాణించాయి. అత్యధికంగా నష్టపోయిన వాటిలో సన్‌ఫార్మా, ఎన్‌టీపీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, నెస్లే ఇండియా, బజాజ్‌ ఆటో షేర్లు ఉన్నాయి. 

Read latest Business News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని