Xiaomi: యాపిల్‌ను వెనక్కి నెట్టిన షావోమి!

విక్రయాలపరంగా శాంసంగ్‌ తర్వాత  ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థగా చైనాకు చెందిన షియోమీ నిలిచింది. ఇప్పటి వరకు రెండోస్థానంలో ఉన్న యాపిల్‌ స్థానాన్ని షియోమీ ఆక్రమించింది. ‘కెనాలసిస్‌’ గణాంకాల ప్రకారం....

Published : 16 Jul 2021 15:06 IST

బీజింగ్‌: విక్రయాల పరంగా శాంసంగ్‌ తర్వాత  ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థగా చైనాకు చెందిన షావోమి నిలిచింది. ఇప్పటి వరకు రెండోస్థానంలో ఉన్న యాపిల్‌ స్థానాన్ని షావోమి ఆక్రమించింది. ‘కెనాలసిస్‌’ గణాంకాల ప్రకారం.. మార్కెట్‌ విక్రయాల్లో శాంసంగ్‌ వాటా 19 శాతం కాగా.. షావోమి 17 శాతంతో రెండో స్థానంలో ఉంది. యాపిల్‌కు మార్కెట్‌లో 14 శాతం వాటా ఉన్నట్లు తేలింది.

ఎగుమతులు భారీగా పెరిగిన నేపథ్యంలోనే షావోమి తయారీ గణనీయంగా పుంజుకుంది. షావోమి ఎగుమతులు లాటిన్ అమెరికాకు 300 శాతం, ఆఫ్రికాకు 150 శాతం, పశ్చిమ ఐరోపాకు 50 శాతం పెరిగాయి. సొంత దేశానికి చెందిన ఒప్పో, వివో నుంచి షావోమి గట్టిపోటీ ఎదురవుతున్నట్లు కెనాలసిస్‌ అభిప్రాయపడింది. అయితే, ప్రస్తుతం షావోమి అమ్మకాల్లో నమోదవుతున్న వృద్ధి ఇలాగే కొనసాగితే.. త్వరలో శాంసంగ్‌ను కూడా వెనక్కి నెట్టే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. నోట్‌ 10 సహా ఎంఐ సిరీస్‌లోని ఇతర మిడ్‌-ప్రీమియం విభాగంలో వచ్చిన ఫోన్లు షావోమి అమ్మకాల పెరుగుదలకు ఊతమిచ్చాయని పేర్కొంది.

గత ఏడాది హువావేపై అమెరికా ఆంక్షలు విధించడంతో దాని మార్కెట్‌ను ఇతర చైనా సంస్థలు తీసుకోగలిగాయి. ముఖ్యంగా ప్రీమియం సెగ్మెంట్‌లో యాపిల్‌కు గట్టిపోటీనిస్తూ రెండో స్థానంలో కొనసాగిన హువావే నిష్ర్కమణ షావోమికి బాగా కలిసొచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని