Adani Group: కష్టకాలంలో ‘అదానీ’కి ఊరట.. శ్రీలంకలో పెట్టుబడులకు గ్రీన్‌ సిగ్నల్‌

Adani Group: శ్రీలంక (Sri Lanka)లో 442 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రీన్‌ ఎనర్జీకి అనుమతి లభించింది.

Published : 24 Feb 2023 18:50 IST

కొలంబో: అదానీ గ్రూప్‌ (Adani Group)నకు చెందిన రెండు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు శ్రీలంక ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బాడీ ఆమోదం తెలిపింది. దీంతో శ్రీలంక (Sri Lanka)లో 442 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రీన్‌ ఎనర్జీకి అవకాశం లభించింది. గ్రూప్‌ (Adani Group) కంపెనీల షేర్ల పతనం సహా పలు ఇతర ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో అదానీ గ్రూప్‌ (Adani Group)నకు ఇది ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి.

అయితే, షేర్ల పతనం నేపథ్యంలో కొత్త పెట్టుబడుల విషయంలో అదానీ గ్రూప్‌ (Adani Group) కొంత ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటికే కొన్ని కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడంపై వెనక్కి తగ్గింది. అలాగే కొన్ని రంగాల్లో ఎలాంటి కొత్త ప్రాజెక్టులకు బిడ్లు దాఖలు చేయబోమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో శ్రీలంక (Sri Lanka)లో పెట్టుబడులపై అదానీ గ్రూప్‌ (Adani Group) ఎలా స్పందించనుందో చూడాల్సి ఉంది.

శ్రీలంకలోని మన్నార్‌ ప్రాంతంలో 250 మెగావాట్ల సామర్థ్యంతో పవనవిద్యుత్‌ ప్లాంట్‌ నిర్మించాలని అదానీ గ్రూప్‌ ప్లాన్‌ సిద్ధం చేసింది. పూనెరిన్‌లో 100 మెగావాట్ల సామర్థ్యంతో మరో ప్లాంట్‌ ఏర్పాటుకూ ప్రణాళికలు రచించింది. అనుమతుల కోసం శ్రీలంక ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ప్రాజెక్టు ప్రతిపాదనలను సమీక్షించిన ‘శ్రీలంక బోర్డ్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌’ ఆమోదం తెలుపుతూ గురువారం ‘లెటర్‌ ఆఫ్‌ అప్రూవల్‌’ జారీ చేసింది.

350 మెగావాట్ల సామర్థ్యంగల ఈ రెండు ప్రాజెక్టులు ప్రణాళిక ప్రకారం రెండేళ్లలో ప్రారంభించాల్సి ఉంది. 2025 నాటికి శ్రీలంక నేషనల్‌ గ్రిడ్‌కు అనుసంధానించాలి. ఈ ప్రాజెక్టులతో 1,500- 2,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఈ వారం ఆరంభంలో శ్రీలంక ఇంధనశాఖ మంత్రి కాంచన విజిశేఖరతో అదానీ గ్రూప్‌ ప్రతినిధులు సమావేశమయ్యారు. రెండు ప్రాజెక్టులకు సంబంధించిన పురోగతిపై చర్చించారు. హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత అదానీ గ్రూప్‌ ప్రతినిధులు శ్రీలంక అధికారులతో భేటీ కావడం ఇదే తొలిసారి. ఇప్పటికే అదానీ గ్రూప్‌ కోలంబో పోర్టులోని పశ్చిమ కంటైనర్‌ టెర్మినల్‌లో పెట్టుబడులు పెట్టింది.

మీడియాను నియంత్రించలేం: సుప్రీం

‘అదానీ- హిండెన్‌బర్గ్‌’ వ్యవహారంపై కోర్టు తీర్పు వెలువడే వరకు ఈ అంశంపై రిపోర్టింగ్‌ చేయకుండా మీడియాను నిలువరించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అలాంటి ఆదేశాలు జారీ చేయలేమని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసింది.

షేర్‌మార్కెట్‌ను కుదిపేస్తున్న అదానీ కంపెనీలు-హిండెన్‌బర్గ్‌ నివేదిక వివాదంలో తదుపరి చర్యల విషయమై కేంద్ర ప్రభుత్వం సీల్డ్‌కవర్‌లో అందజేసిన సూచనలను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 17న తోసిపుచ్చింది. ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ కోసం తాము పూర్తిస్థాయి పారదర్శకతను కోరుకుంటున్నామని సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ, జస్టిస్‌ జె.బి.పార్దీవాలాతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. స్టాక్‌మార్కెట్ల నియంత్రణ చర్యల బలోపేతానికి తామే సొంతంగా నిపుణుల కమిటీని నియమిస్తామని పేర్కొంది. ఈ కేసులో తీర్పును రిజర్వులో ఉంచింది.

అదానీ-హిండెన్‌బర్గ్‌ వ్యవహారంపై ఇప్పటి వరకూ నాలుగు పిల్స్‌ దాఖలు కాగా వాటన్నింటినీ సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణకు చేపట్టింది. ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి.. తద్వారా విచారణ జరిపించాలని కోరుకుంటున్నట్లు కొద్ది రోజుల క్రితం కేంద్రం ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు తెలిపారు. అదానీ గ్రూప్‌ షేర్ల పతనానికి దారి తీసిన హిండెన్‌బర్గ్‌ నివేదికను పరిశీలించి ఇన్వెస్టర్లకు నష్టం కలిగించకుండా సూచనలు చేసేందుకు, ఈ ప్రక్రియపై విశ్వాసం కలిగించేందుకు తామే ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొంది. హిండెన్‌బర్గ్‌ నివేదిక ప్రభావం స్టాక్‌ మార్కెట్‌పై ఉండదన్న సెబీ వాదనతో ధర్మాసనం విభేదించింది. ‘అదే నిజమైతే ఇన్వెస్టర్లు రూ.లక్షల కోట్లు ఎలా నష్టపోయార’ని ప్రశ్నించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని