Artificial Intelligence: ఏఐతో భారత్‌లో మరిన్ని ఉద్యోగాలు.. టాటా సన్స్‌ ఛైర్మన్‌

భవిష్యత్తులో మానవవనరుల అందుబాటులో లేని రంగాల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్‌ చంద్రశేఖరన్ అన్నారు. దీనికి సంబంధించి కంపెనీలు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని తెలిపారు.

Published : 25 Aug 2023 17:15 IST

దిల్లీ: కృత్రిమ మేధ (AI)తో భారత్‌లో మరిన్ని ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయని టాటా సన్స్‌ (Tata Sons) ఛైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ (N Chandrasekaran) అభిప్రాయపడ్డారు. దాని సాయంతో తక్కువ నైపుణ్యం కలిగిన లేదా నైపుణ్యం లేని వ్యక్తులు సైతం ఉన్నత కొలువులు చేయగలుగుతారని అన్నారు. దిల్లీలో జరుగుతున్న బి20 సదస్సు (B20 Summit)లో పాల్గొన్న ఆయన కొత్త డిజిటల్‌ చట్టం ద్వారా డేటా భద్రత, వ్యక్తిగత గోప్యత విషయంలో భారత్‌ అద్భుతమైన పురోగతి సాధించిందన్నారు. చంద్రయాన్‌-3 విజయంతో మన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పామన్నారు. 

ఏఐ కారణంగా గోప్యతకు భంగం కలుగుతుందని, ఉద్యోగ భద్రత ఉండదనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో చంద్రశేఖరన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘భారత్‌లాంటి దేశంలో ఏఐ ఎన్నో ఉద్యోగాలను సృష్టిస్తుంది. తక్కువ నైపుణ్యం ఉన్నవారితోపాటు నైపుణ్యం లేని వ్యక్తులను ఇన్ఫర్మేషన్‌ రంగంలో ఏఐ నిష్ణాతులను చేస్తుంది. దాంతో వారు కూడా ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేయగలుగుతారు. ఉదాహరణకు ఓ డాక్టర్‌పై ఉన్న పని ఒత్తిడిని తగ్గించేందుకు నర్సుకు ఏఐ సాయపడుతుంది. అలాగే, వివిధ రంగాల్లోని వేర్వేరు విభాగాల్లో ఏఐ కీలకపాత్ర పోషిస్తుంది’’ అని చంద్రశేఖరన్‌ తెలిపారు. కొన్నిరంగాల్లో అవసరమైన మేరకు సేవలను అందించేందుకు తగిన మానవ వనరులు అందుబాటులో లేవని చంద్రశేఖరన్‌ అభిప్రాయపడ్డారు. ఆయా ఖాళీలను భవిష్యత్తులో ఏఐతో భర్తీ చేసేందుకు పలు సంస్థలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. 

డేటా ప్రైవసీలో  అద్భుతమైన పురోగతి

‘‘కొత్త డిజిటల్‌ చట్టం రూపకల్పనతో వ్యక్తిగత గోప్యత విషయంలో భారత్‌ అద్భుతమైన పురోగతిని సాధించింది. ఒకవైపు డేటా భద్రత, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించకూడదని ప్రభుత్వం విధివిధానాలను రూపొందించింది. మరోవైపు థర్డ్‌ పార్టీలకు ఇచ్చే సమాచారం సురక్షితంగా ఉండేందుకు డేటా ఎంపవర్‌మెంట్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఆర్కిటెక్చర్‌ (DEPA)ను తీసుకొచ్చింది. ఈ రెండింటి కలయికతో వినియోగదారులు డిజిటల్‌ చెల్లింపులు చేసేప్పుడు, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో షేర్‌ చేసేప్పుడు వారికి డేటా భద్రత ఉంటుంది. ఇదో కొత్త విధానం’’ అని చంద్రశేఖరన్‌ అన్నారు. 

చంద్రయాన్‌-3తో మన సత్తా చాటాం

చంద్రయాన్‌-3 విజయంతో బాబిల్లిని చేరాలనే ఆకాంక్ష నెరవేరిందని చంద్రశేఖరన్‌ అన్నారు. ‘‘ఈ గెలుపుతో భారతదేశం ఏం సాధించిందో, భవిష్యత్తులో ఇంకా ఏమేమి సాధించగలదో ప్రపంచానికి చాటి చెప్పింది. సాధ్యంకానిదంటూ ఏదీ లేదు అనుకున్న ప్రతిసారీ చంద్రుడిని చూపించేవారు. ఇకపై చంద్రుడికి, మనకు మధ్య ఉన్న దూరం చెరిగిపోనుంది’’ అని తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని