అమెజాన్‌లో సెల్లర్‌ ఫీజు పెంపు.. ఆ ఉత్పత్తులు ఇక ప్రియం?

Amazon fee hike: తమ వేదికపై ఉత్పత్తులు విక్రయించే సెల్లర్ల నుంచి వసూలు చేసే ఫీజును అమెజాన్‌ పెంచింది. దీంతో ఆయా ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి.

Published : 16 May 2023 15:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ (Amazon) కొన్ని కేటగిరీ వస్తువులకు సెల్లర్‌ ఫీజును (Seller fee) పెంచింది. దుస్తులు, బ్యూటీ, కిరాణా, ఔషధాలు వంటి వివిధ రకాల వస్తువులపై విధించే సెల్లర్‌ ఫీజును సవరించింది. మే 31 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ఈ ఫీజు పెంచడం వల్ల ఆ భారాన్ని విక్రేతలు వినియోగదారుల నుంచి వసూలు చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

అమెజాన్‌లో తమ వస్తువులను విక్రయించినందుకుగానూ విక్రేతల నుంచి కొంత మొత్తాన్ని అమెజాన్‌ వసూలు చేస్తుంది. ఇది ప్రతి కేటగిరీలో ఒక్కోలా ఉంటుంది. మే 31 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం రూ.300లోపు ఉన్న హెయిర్‌కేర్‌, బాత్‌, బ్యూటీ, షవర్‌ ఐటెమ్స్‌కు 7 శాతంగా ఉన్న ఫీజు.. మే 31 నుంచి 8.5 శాతానికి పెరగనుంది. వెయ్యి రూపాయలకు పైగా ఉన్న దుస్తులపై 19 శాతంగా ఉన్న ఫీజును 22.5 శాతానికి పెంచుతున్నట్లు అమెజాన్‌ ప్రకటించింది. మూలికలు, మసాలా దినుసులపై తక్కువ మొత్తంలో కొనుగోళ్లకు ఫీజును తగ్గించింది. అదే ఎక్కువ మొత్తంలో కొనుగోళ్లపై మాత్రం ఫీజును పెంచింది. కస్టమర్లకు చేసే తిరిగి చెల్లింపుల ఫీజును (రిఫండ్‌) సైతం కొన్ని సందర్భాల్లో 40 శాతం వరకు సెల్లర్లు చెల్లించాల్సి ఉంటుంది.

మాంద్యం భయాల నేపథ్యంలో అమెజాన్‌ సహా పలు టెక్‌ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అదే సమయంలో లాభదాయకతపై దృష్టి సారిస్తున్నాయి. ఈ క్రమంలో సెల్లర్‌ ఫీజును అమెజాన్‌ సవరించింది. ప్రస్తుత మార్కెట్‌ , స్థూల ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఛార్జీలను సవరించినట్లు అమెజాన్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఫీజు పెంపుపై సెల్లర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తమ ఆదాయాలపై ఇది ప్రభావం చూపుతుందని చెప్తున్నారు. ఒకవేళ ధరలు అధికంగా పెడితే అమెజాన్‌ అల్గారిథమ్‌ ర్యాంకింగ్‌ సిస్టమ్‌లో తమ వస్తువులు ఎక్కువగా ఉండడమో.. లేదంటే ఇతర వేదికలపై తక్కువకే లభించడమో జరిగిన సందర్భాల్లో విక్రయాలపై ప్రభావం పడుతుందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు