Mis selling: బ్యాంకుల్లో మిస్‌ సెల్లింగ్‌కు బాధితులవుతున్నారా?

ఓ పథకంలో మదుపు చేద్దామని బ్యాంకుకు వెళితే.. అక్కడి ఉద్యోగులు మన అవసరాలకు సరిపడని వాటిలో ఇన్వెస్ట్‌ చేయిస్తారు. దీన్నే మిస్‌-సెల్లింగ్‌ అంటారు.....

Updated : 21 Feb 2022 13:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా మనం ఓ పథకంలో మదుపు చేద్దామని బ్యాంకుకు వెళతాం. కానీ, తీరా అక్కడికి వెళితే.. అక్కడి ఉద్యోగులు మనకు వేరే పథకాల గురించి చెబుతారు. ఎదోలా ఒప్పించి అందులో పెట్టుబడి పెట్టిస్తారు. సమయం గడిస్తే గానీ, తెలియదు. అవి మన అవసరాలకు సరిపడేవి కాదని. దీన్నే మిస్‌-సెల్లింగ్‌ అంటారు. సాధారణంగా అధిక రుసుము, కమీషన్‌ అందే పథకాలనే బ్యాంకులు ఎక్కువగా ప్రచారం చేస్తుంటాయి. పైగా ఉద్యోగులకు లక్ష్యాలను నిర్దేశిస్తుంటాయి. దీంతో చేసేది లేక ఉద్యోగులు మదుపర్లను లేదా సామాన్య ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంటారు. అయితే, ఇది అన్ని బ్యాంకుల్లో, అందరు ఉద్యోగులు చేస్తారని కచ్చితంగా చెప్పలేం!

సాధారణంగా మిస్‌-సెల్లింగ్‌కు అవకాశం ఉండే పథకాలను చూద్దాం...


ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చాలా మందికి తెలిసిన, నష్టభయం లేని, భద్రతతో కూడిన ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్‌. నెలవారీ వడ్డీ ఇచ్చే ఎఫ్‌డీలో మదుపు చేద్దామని బ్యాంకుకు వెళితే.. అక్కడి ఉద్యోగులు మనతో బ్యాలెన్స్‌డ్‌ ఫండ్లలో ఇన్వెస్ట్‌ చేస్తే మేలని ప్రోత్సహిస్తారు. నిజానికి ఎఫ్‌డీతో పోలిస్తే వీటి నుంచి రాబడి ఎక్కువగానే ఉంటుంది. కానీ, నష్టభయం కూడా ఎక్కువే. ఈ విషయాన్ని బ్యాంకులు హైలైట్‌ చేయవు. పైగా నెలవారీ డివిడెండ్లు కూడా నిర్దిష్టంగా ఉండవు.

ప్రభావం: నెలనెలా ఆదాయం కోసం మదుపు చేసే వారికి బ్యాలెన్స్‌డ్‌ ఫండ్లు సరైన మార్గం కాదు. పైగా డివిడెండ్లు పూర్తిగా ఫండ్ల ‘నికర ఆస్తుల విలువ (NAV)’పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఎన్‌ఏవీ భారీగా పడిపోతే.. మనం పెట్టిన పెట్టుబడిలో కోత పడొచ్చు.


సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీం (SCSS)

ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేద్దామని వెళితే.. బ్యాంకర్లు ఎఫ్‌డీ లేదా యులిప్‌లో మదుపు చేయించే ప్రయత్నం చేస్తారు. 60 ఏళ్లు పైబడినవారికే ఎస్‌సీఎస్‌ఎస్‌ అందుబాటులో ఉంటుందని.. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే ఈ పథకం ఉందని చెబుతుంటారు. కానీ, అవన్నీ నిజం కాదు. 55 ఏళ్లు పైబడి.. రిటైర్‌ అయినవారు లేదా వీఆర్‌ఎస్‌ తీసుకున్నవారు కూడా ఎస్‌సీఎస్‌ఎస్‌లో ఇన్వెస్ట్‌ చేయొచ్చు. అలాగే ప్రైవేటు బ్యాంకుల్లోనూ ఇది అందుబాటులో ఉంటుంది.

ప్రభావం: ఎస్‌సీఎస్‌ఎస్‌, ఎఫ్‌డీ మధ్య ఉండే వడ్డీరేటు వ్యత్యాసం మీ రాబడిపై ప్రభావం చూపొచ్చు. ఇక యులిప్‌ నష్టభయంతో కూడుకున్న పథకం. ఇది రిటైర్‌ అయినవారికి సరిపోయే పథకం కాదు.


టర్మ్‌ ఇన్సూరెన్స్‌

తక్కువ ప్రీమియంతో.. ఎక్కువ బీమా కవర్‌ కావాలంటే టర్మ్‌ ఇన్సూరెన్స్‌ సరైంది. కానీ, బ్యాంకుల్లో మాత్రం వీటి స్థానంలో యులిప్‌లు తీసుకోమని సలహా ఇస్తుంటారు. అధిక రిటర్న్స్‌ ఉంటాయని చెబుతుంటారు. సాధారణంగా బీమా పథకాలను రిటర్న్స్‌ కంటే భద్రత కోసం తీసుకుంటుంటారు. కాబట్టి తొలి ప్రాధాన్యం కచ్చితంగా బీమా కవర్‌కే ఇవ్వాలి.

ప్రభావం: టర్మ్‌ ఇన్సూరెన్స్‌తో పోలిస్తే.. యులిప్‌ ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటుంది. బీమా కవర్‌ కూడా తక్కువుంటుంది. అది మన అవసరాలకు సరిపోకపోతే ఇబ్బందులు తప్పవు.


గోల్డ్‌ బాండ్స్‌

గోల్డ్‌ బాండ్స్‌లో మదుపు చేసేందుకు వెళితే.. గోల్డ్‌ కాయిన్స్‌ గురించి చెబుతుంటారు బ్యాంకర్లు. బాండ్స్‌లో లాకిన్‌ పీరియడ్‌ ఉంటుందని.. కాయిన్స్‌లో అలాంటి ఇబ్బందులేవీ ఉండవని నమ్మబలికించే ప్రయత్నం చేస్తారు. కానీ, వాస్తవానికి గోల్డ్‌ బాండ్స్‌కి కూడా లాకిన్‌ పీరియడ్‌ ఉండదు. బాండ్లు సెకండరీ మార్కెట్‌లో లిస్టయి ట్రేడవుతుంటాయి.

ప్రభావం: గోల్డ్‌ బాండ్స్‌ కాలపరిమితి ముగిసే వరకు వచ్చే వడ్డీరేటును కోల్పోతాం. పైగా గోల్డ్‌ కాయిన్స్‌ బయట విక్రయిస్తే.. మార్కెట్‌ రేటుతో పోలిస్తే 5-10 శాతం తక్కువ రేటు కట్టిస్తుంటారు.


బ్యాంకు లాకర్‌

మన దగ్గర ఉండే విలువైన వస్తువుల్ని, సొమ్ముల్ని దాచుకోవడం కోసం బ్యాంకు లాకర్లు తీసుకుంటుంటాం. కానీ, తమ వద్ద పరిమిత సంఖ్యలో లాకర్లు ఉన్నాయని.. ఎఫ్‌డీ లేదా యులిప్‌ వంటి పథకాల్లో మదుపు చేసేవారికి లాకర్‌ కేటాయించడంలో ప్రాధాన్యం ఇస్తామని చెబుతుంటారు. బలవంతంగా ఏదో ఒక పథకంలో ఇన్వెస్ట్‌ చేయించేందుకు ప్రయత్నిస్తారు.

ప్రభావం: విలువైన వస్తువుల భద్రత కోసం మనకు అవసరం లేని పథకంలో మదుపు చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఇతర అవసరాల కోసం కేటాయించిన నిధుల్ని ఎఫ్‌డీయో లేక యులిప్‌ కొనుగోలుకో వెచ్చించాల్సి రావొచ్చు. దీనివల్ల మన ఆర్థిక ప్రణాళిక దెబ్బతిని ఇబ్బందులు తలెత్తొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని