Automobile sales: నవంబరులో భారత వాహన పరిశ్రమ చరిత్రలోనే రికార్డు విక్రయాలు

Automobile sales: భారత వాహన పరిశ్రమ చరిత్రలోనే రికార్డు స్థాయి విక్రయాలు నవంబరులో జరిగినట్లు ఫాడా వెల్లడించింది.

Published : 09 Dec 2022 14:00 IST

దిల్లీ: గత నెలలో వాహన రిటైల్‌ విక్రయాలు (Automobile sales) రికార్డు స్థాయలో నమోదయ్యాయని వాహన డీలర్ల పరిశ్రమ సమాఖ్య ఫాడా (FADA) తెలిపింది. ప్రయాణికుల, ద్విచక్ర, వాణిజ్య వాహనాలు ఇలా అన్ని విభాగాల్లో అమ్మకాలు పుంజుకున్నాయని పేర్కొంది. నవంబరులో మొత్తం వాహన రిటైల్‌ విక్రయాలు (Automobile sales) 26 శాతం పుంజుకున్నాయని తెలిపింది. క్రితం ఏడాది ఇదే నెలలో 18,93,647 యూనిట్లు అమ్ముడుపోగా.. ఈసారి అది 23,80,465 యూనిట్లకు చేరినట్లు వెల్లడించింది.

‘‘బీఎస్‌-IV నుంచి బీఎస్‌-VIకు మారిన 2020 మార్చి నెలను పక్కనపెడితే.. భారత వాహన పరిశ్రమ చరిత్రలోనే అత్యధిక విక్రయాలు నవంబరులో జరిగాయి’’ అని ఫాడా అధ్యక్షుడు మనీశ్‌రాజ్‌ సింఘానియా తెలిపారు. పండగ సీజన్‌ ముగిసినప్పటికీ విక్రయాలు భారీ ఎత్తున కొనసాగాయని పేర్కొన్నారు. పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కావడం అందుకు దోహదం చేసినట్లు తెలిపారు.

ప్రయాణికుల వాహన (Passenger Vehicles) విక్రయాలు 21 శాతం పెరిగి 3,00,922 యూనిట్లకు చేరినట్లు సింఘానియా తెలిపారు. సరికొత్త మోడళ్లు అందుబాటులోకి రావడం, కొత్త వాహనాల విడుదల, గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ పుంజుకోవడం వంటి అంశాలు విక్రయాల వృద్ధికి దోహదం చేసినట్లు పేర్కొన్నారు. కాంపాక్ట్‌ ఎస్‌యూవీ, ఎస్‌యూవీల్లో పెద్ద వేరియంట్‌ మోడల్‌ కార్ల విక్రయాలు పెరిగాయని తెలిపారు. మరోవైపు ద్విచక్రవాహన విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 14,94,797 యూనిట్ల నుంచి 24 శాతం పెరిగి 18,47,708 యూనిట్లకు చేరినట్లు పేర్కొన్నారు. అదే సమయంలో వాణిజ్య వాహన విక్రయాలు 33 శాతం పుంజుకొని 79,369 యూనిట్లకు చేరాయి. త్రిచక్ర వాహన విక్రయాల్లో 81 శాతం, ట్రాక్టర్ల అమ్మకాల్లో 57 శాతం వృద్ధి నమోదైంది.

వాహన తయారీ సంస్థలు ధరల్ని పెంచుతున్నాయని ఫాడా గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో కిందిస్థాయి వేరియంట్ల వాహనాలపై సంస్థలు రాయితీలు ప్రకటించే అవకాశం ఉందని తెలిపింది. అలాగే సంవత్సరాంతం నేపథ్యంలో పాత స్టాక్‌ పూర్తి చేయడం కోసమూ కంపెనీలు ప్రయోజనాలను ప్రకటించొచ్చని అంచనా వేసింది. ఫలితంగా డిసెంబరులోనూ విక్రయాలు భారీ ఎత్తున జరిగే అవకాశం ఉందని తెలిపింది. అయితే, రానున్న రోజుల్లో ద్విచక్ర, ఎంట్రీలెవెల్‌ స్థాయి వాహన కొనుగోలు భారంగా మారొచ్చని తెలిపింది. రెపోరేటు పెరగడంతో రుణభారం అధికం కానుండడమే దీనికి కారణమని వివరించింది. చైనాలో ఆంక్షల వల్ల సెమీకండక్టర్ల సరఫరాపై ప్రభావం ఉండొచ్చని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని