Crude Oil: చకా చకా పెరుగుతోన్న చమురు ధరలు!

యుద్ధ భయాలతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు కొండెక్కి కూర్చున్నాయి....

Updated : 07 Mar 2022 10:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావమే చూపించే సూచనలు కనిపిస్తున్నాయి. కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దేశాలకు ఇది పెనుశాపంగా పరిణమించే సంకేతాలు వెలువడుతున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే రష్యా భీకర దాడులు, ఉక్రెయిన్‌ గట్టి ప్రతిఘటనకు యావత్తు ప్రపంచం మూల్యం చెల్లించాల్సి వస్తుందేమోననిపిస్తోంది. 

ఒక్కరోజే 10 డాలర్లు..

యుద్ధ భయాలతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు కొండెక్కి కూర్చున్నాయి. భారత్‌లో ప్రామాణికంగా భావించే బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర ప్రస్తుతం 129 డాలర్ల వద్ద చలిస్తోంది. ఓ దశలో ఇది 139 డాలర్లను కూడా తాకింది. ఇది 13 ఏళ్ల గరిష్ఠం. చివరి సారి 2008లో ఈ ధరలు నమోదయ్యాయి. భారత్‌లో త్వరలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు ప్రక్రియ ప్రారంభమవనున్నట్లు ఇప్పటికే సంకేతాలు వెలువడ్డాయి. గత 4 నెలలుగా ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో పెంపు భారీ ఎత్తున ఉండొచ్చని తెలుస్తోంది. సరిగ్గా ఈ తరుణంలో ధరలు అసాధారణంగా పెరుగుతుండడం.. సామాన్యులపై పెను భారాన్ని మోపే అవకాశం ఉంది. చమురు ధరలు ఈ స్థాయిలో ఎగబాకడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. 

ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమణ ఇంకా భీకరంగా మారుతుండడంతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఇది గత కొన్ని రోజులుగా చమురు మార్కెట్లను కలవరపెడుతూనే ఉంది. ఇక మరో అంశానికి వస్తే.. ఇప్పటి వరకు పాశ్చాత్య దేశాలు రష్యాపై కఠిన ఆర్థిక ఆంక్షలు విధించాయి. రష్యా నుంచి దిగుమతి అవుతున్న చమురుపై మాత్రం ఎలాంటి నియంత్రణలు అమలు చేయలేదు. అయితే, ఉక్రెయిన్‌ విషయంలో రష్యా ఏమాత్రం వెనక్కి తగ్గే సూచనలు కనిపించకపోవడంతో రష్యాను మరింత ఒత్తిడిలోకి నెట్టడానికి ఉన్న అన్ని మార్గాలను వాడుకోవాలని అమెరికా సహా ఐరోపా దేశాలు యోచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో భాగంగా రష్యా చమురు ఎగుమతులపైనా ఆంక్షలు అమలు చేయాలని ఆలోచిస్తున్నట్లు సమచారం. ఇదే జరిగితే.. దాదాపు ప్రపంచ చమురు అవసరాల్లో 10 శాతం వాటా కలిగి ఉన్న రష్యా నుంచి సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇది తీవ్ర కొరతకు దారితీయొచ్చు.

చమురు ధరల్ని ప్రభావితం చేస్తున్న చివరి అంశానికి వస్తే.. ఇరాన్‌తో అణుఒప్పందంపై చర్చలు ఆలస్యం కావడం. ఈ డీల్ ఖరారైతే.. ఇరాన్‌పై ఉన్న ఆంక్షల్ని ఎత్తివేయాలని అమెరికా యోచిస్తోంది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లోకి ఆ దేశపు చమురు కూడా వచ్చి చేరుతుంది. దీంతో రష్యా స్థానాన్ని అది భర్తీ చేసే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. కానీ, ఆ చర్చలు ఇంకా ఓ కొలిక్కి రావడం లేదు.

గ్యాస్‌ ధరలు సైతం పైపైకే..

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం గ్యాస్‌ ధరలపైనా పడింది. ముఖ్యంగా అమెరికాలో సాధారణ గ్యాస్‌ గ్యాలన్‌ ధర 4 డాలర్లకు చేరింది. 2008 తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. అమెరికాలో ఈ సమయంలో సాధారణంగానే ధరలు ఎక్కువగా ఉంటాయి. దీనికి యుద్ధం కూడా జతకావడం అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. ఈ ప్రభావం ఇతర దేశాల్లో గ్యాస్‌ ధరల్ని సైతం ప్రభావితం చేసే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని