Form 26AS: ఐటీఆర్ ఫైల్ చేసే ముందు వివ‌రాల‌ను చెక్ చేయండి..

ఫారం 26ఏఎస్ అంటే ఏమిటి? ఐటీఆర్ దాఖ‌లు చేసేప్పుడు దీన్ని ఎలా ఉప‌యోగించాలి త‌దిత‌ర విష‌యాలు తెలుసుకుందాం. 

Updated : 12 Jun 2021 12:32 IST

ఫారం 26ఏఎస్‌ను క‌న్సాలిడేటెడ్ స్టేట్మెంట్ అని కూడా పిలుస్తారు. నిర్థిష్ట ఆర్థిక లావాదేవీల‌(ఎస్ఎఫ్‌టీ)లో,  పేర్కొన్న ప‌రిమితికి మించి లావాదేవీలు చేసిన‌ప్పుడు, సంబంధిత స‌మాచారాన్ని ఆయా సంస్థ‌ల నుంచి ఆదాయపు ప‌న్ను శాఖ సేక‌రిస్తుంది. ఈ స‌మాచారం మొత్తం ఫారం 26 ఏఎస్‌లో పొందుప‌రుస్తారు. బ్యాంకులు, మ్యూచువ‌ల్ ఫండ్లు, బ్రోకింగ్ సంస్థ‌లు మొద‌లైన వారు పేర్కొన్న ప‌రిమితి మించి చేసే లావాదేవీల స‌మాచారాన్ని ఆదాయపు శాఖ‌కు అందిస్తాయి. 

ఉదాహరణకు, ఒక ఖాతాదారుడు, అత‌నికి ఉన్న‌ అన్ని పొదుపు ఖాతాలలో క‌లిపి ఒక ఏడాదిలో రూ. 10 లక్షలు దాటి డిపాజిట్ చేస్తే, ఆ బ్యాంక్ ఎస్ఎఫ్‌టీ దాఖలు చేయాలి. రూ. 30 ల‌క్ష‌ల విలువ‌కు మించిన స్థిర ఆస్తి లావాదేవీలో పాల్గొన్న ప్రతి వ్యక్తికీ రిజిస్ట్రార్లు ఎస్ఎఫ్‌టీని దాఖలు చేయాలి. 

అదేవిధంగా, రూ.10 ల‌క్ష‌లుకు మించి మ్యూచువ‌ల్ ఫండ్లు, బాండ్లు, షేర్లు కొనుగోలు చేసిన‌ప్పుడు వాటిని జారీ చేసిన సంస్థ‌లు ప‌న్నుశాఖ‌కు నివేదిస్తాయి. ప‌న్ను చెల్లింపుదారుల‌కు ముందుగా పూర్తిచేసిన (ఫ్రీఫైల్లింగ్‌) ఫారంల‌ను అందించేందుకు గానూ వ‌డ్డీ ఆదాయం, మూల‌ధ‌న రాబ‌డికి సంబంధించిన స‌మాచారాన్ని ఇవ్వాల‌ని బ్యాంకులు, పోస్టాఫీసులు, సంస్థ‌లు, ఎక్స్‌ఛేంజ్‌ల‌ను, ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌ ఇటీవ‌లే కోరింది. 

మూలంవ‌ద్ద ప‌న్ను(టీడీఎస్‌), మూలం వ‌ద్ద సేక‌రించిన ప‌న్ను(టీసీఎస్‌)ల‌కు  స‌బంధించిన స‌మాచారాన్ని ఫారం26ఎఎస్‌లో పొందుప‌రుస్తారు. ఉద్యోగుల‌కు సంబంధించి సంస్థ‌లు డిడ‌క్ట్ చేసిన టీడీఎస్ కూడా ఫారం 26ఏఎస్‌లో ప్ర‌తిబింబిస్తుంది. అందువ‌ల్ల ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేసేప్పుడు ఫారం 26ఏఎస్ ధృవీక‌రించ‌డం ముఖ్యం.  పేర్కొన్న ప‌రిమితికి మంచిన లావాదేవీలు నిర్వ‌హించిన అంద‌రి స‌మాచారాన్ని సంస్థ‌లు, ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌కు నివేదిస్తాయి. అందువ‌ల్ల ఒక్కోసారి పొర‌పాట్లు జ‌రిగే అవ‌కాశం ఉంటుంది. ఒక‌వేళ ఈ పొర‌పాటు మీ విష‌యంలో జ‌రిగి, ఏదైనా ఎంట్రీ త‌ప్పుగా న‌మోదైతే ఆదాయ‌పు ప‌న్ను శాఖ నుంచి నోటీసులు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. 

 ఈ సంవ‌త్స‌రం నుంచి వ‌డ్డీ ఆదాయం, డివిడెండ్‌, మూల‌ధ‌న రాబ‌డి మొద‌లైన ఆదాయాల‌కు సంబంధించి ఐటీ శాఖ ముందుగానే పూర్తి చేసిన ఫారంల‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఫ్రీ-ఫైల్డ్ ఫారంలో ఉన్న స‌మాచారాన్ని మీ వ‌ద్ద ఉన్న ప‌త్రాలు, బ్యాంకు స్టేట్‌మెంట్లు, ఫారం16తో క్రాస్‌చెక్  చేసి ధృవీక‌రించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని