RBI Annual Report: చలామణిలో ఉన్న కరెన్సీలో రూ.500 నోట్లే అధికం!

Currency in circulation: క్రితం ఆర్థిక సంవత్సరంలో చలామణిలో ఉన్న కరెన్సీ విలువ, నోట్ల సంఖ్యను తాజాగా ఆర్‌బీఐ తన వార్షిక నివేదికలో వెల్లడించింది.

Updated : 30 May 2023 16:57 IST

ముంబయి: చలామణిలో ఉన్న కరెన్సీ (Currency in circulation) నోట్ల విలువ 2022- 23లో 7.8 శాతం పెరిగిందని మంగళవారం వెలువడిన ఆర్‌బీఐ (RBI) వార్షిక నివేదిక వెల్లడించింది. నోట్ల సంఖ్య 4.4 శాతం పెరిగినట్లు తెలిపింది. చలామణిలో ఉన్న కరెన్సీ (Currency in circulation) నోట్ల విలువలో రూ.500, రూ.2,000 నోట్ల విలువే 87.9 శాతమని తెలిపింది. 2021- 22లో ఇది 87.1 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. కేంద్రం ఇటీవలే రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. వాటిని మార్చుకోవడం లేదా డిపాజిట్‌ చేయడానికి సెప్టెంబరు 30 వరకు గడువిచ్చింది.

  • 2023 మార్చి 31 నాటికి చలామణిలో ఉన్న నోట్లలో సంఖ్యాపరంగా రూ.500 నోట్లే అధికం. వీటి వాటా 37.9 శాతం. తర్వాత రూ.10 నోట్లు 19.2 శాతం ఉన్నాయి. మొత్తం 5,16,338 లక్షల రూ.500 నోట్లు చలామణిలో ఉన్నాయి. వీటి విలువ రూ.25,81,690 కోట్లు.
  • 4,55,468 లక్షల రూ.2,000 నోట్లు మార్చి ముగిసే నాటికి చలామణిలో ఉన్నాయి. వీటి విలువ రూ.3,62,220 కోట్లు. క్రితం ఏడాదితో పోలిస్తే చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్ల సంఖ్య 1.3 శాతం తగ్గింది.
  • ప్రస్తుతం రూ.2, రూ.5, రూ.10, రూ.20, రూ.100, రూ.200, రూ.500, రూ.2,000 విలువ చేసే నోట్లు చలామణిలో ఉన్నాయి. నాణేల విషయానికి వస్తే 50 పైసలు, రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 చలామణిలో ఉన్నాయి.
  • 2022- 23లో ఇ-రూపీని ఆర్‌బీఐ ప్రయోగాత్మకంగా తీసుకొచ్చింది. ప్రస్తుతం చలామణిలో ఉన్న హోల్‌సేల్‌ ఇ-రూపీల విలువ రూ.10.69 కోట్లు. అలాగే రిటైల్‌ ఇ-రూపీల విలువ రూ.5.70 కోట్లు.
  • కొత్త నోట్ల ముద్రణ 2021- 22తో పోలిస్తే 2022- 23లో 1.6 శాతం పెరిగింది. రూ.2,000 ముద్రణకు క్రితం సంవత్సరాల్లోలాగే ఎలాంటి ఆదేశాలు రాలేదు.
  • నోట్ల ముద్రణ కోసం 2022- 23లో కేంద్రం రూ.4,682.80 కోట్లు ఖర్చు చేసింది. క్రితం సంవత్సరం ఈ విలువ రూ.4,984.80 కోట్లుగా ఉంది.
  • నకిలీ నోట్లు క్రితం ఏడాదితో పోలిస్తే తగ్గాయి. రూ.10 విలువ చేసే నకిలీ నోట్లు 11.6 శాతం, రూ.100 నోట్లలో 14.7 శాతం, రూ.2,000 విలువ చేసే నకిలీ నోట్లు 27.9 శాతం తగ్గాయి. 2022- 23లో బ్యాంకింగ్‌ సెక్టార్‌లో గుర్తించిన నకిలీ నోట్లలో 4.6 శాతం ఆర్‌బీఐలో, 95.4 శాతం ఇతర బ్యాంకుల్లో ఉన్నాయి.

వృద్ధి పథం కొనసాగుతుంది..

బలమైన స్థూల ఆర్థిక విధానాలు, కమొడిటీ ధరలు దిగొస్తున్న నేపథ్యంలో భారత ఆర్థిక వృద్ధి పయనం 2023- 24లోనూ కొనసాగుతుందని ఆర్‌బీఐ వార్షిక నివేదికలో పేర్కొంది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కూడా తగ్గుముఖం పడుతున్నట్లు తెలిపింది. అయితే, ప్రపంచ ఆర్థిక వృద్ధిలో మందగమనం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సవాల్‌ విసురుతున్నాయని పేర్కొంది. మరోవైపు సర్దుబాటు పరపతి విధాన వైఖరిని ఉపసంహరణపై ఆర్‌బీఐ దృష్టి కొనసాగుతుందని స్పష్టం చేసింది. ద్రవ్యోల్బణం లక్ష్యిత పరిధిలోకి వచ్చే వరకు అది తప్పదని తెలిపింది. స్థిర మారకపు రేటు, సాధారణ వర్షపాతం నమోదైతే ఈ ఏడాది ద్రవ్యోల్బణం సగటున 5.2 శాతానికి దిగొస్తుందని అంచనా వేసింది. క్రితం ఏడాది ఇది 6.7 శాతంగా ఉన్న విషయాన్ని గుర్తుచేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని