RuPay Credit card: యూపీఐ ఎఫెక్ట్‌.. రూపే కార్డులకు భలే డిమాండ్‌..!

RuPay Credit cards: రూపే క్రెడిట్‌కార్డులకు ఆదరణ పెరుగుతోంది. యూపీఐకి లింక్‌ చేసుకునే సదుపాయం ఉండడమే దీనికి కారణం.

Published : 27 Sep 2023 16:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ పేమెంట్‌ నెట్‌వర్క్‌ రూపే (Rupay) క్రెడిట్‌ కార్డులకు డిమాండ్‌ పెరుగుతోంది. ముఖ్యంగా టైర్‌ 2, 3, 4 నగరాల్లో వీటికి ఆదరణ లభిస్తోంది. యూపీఐ చెల్లింపులకు రూపే క్రెడిట్‌ కార్డులను అనుసంధానం చేసుకునే వెసులుబాటు ఉండడమే దీనికి కారణం. దీంతో అంతర్జాతీయ పేమెంట్‌ నెట్‌వర్క్‌లైన మాస్టర్‌, వీసా కార్డుల కంటే రూపే క్రెడిట్‌ కార్డులనే వినియోగదారులు ఎక్కువ కోరుకుంటున్నట్లు ఫిన్‌టెక్‌ ప్లాట్‌ఫామ్‌ జడ్‌ఈటీ పేర్కొంది. ఈ మేరకు తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది.

యూపీఐ చెల్లింపులకు రూపే క్రెడిట్‌ కార్డులు (Rupay credit card) అనుసంధానం చేసేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) గతేడాది జూన్‌లో అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. కొనుగోళ్ల సమయంలో యూపీఐ చెల్లింపులకు క్రెడిట్‌ కార్డులను అనుసంధానం చేసుకోవచ్చు. దీంతో ఇటీవల రూపే క్రెడిట్‌ కార్డులకు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌లోని 706 చిన్న పట్టణాలు, నగరాల నుంచి రూపే క్రెడిట్‌ కార్డులకు వస్తున్న డిమాండ్‌ ఆధారంగా జడ్‌ఈటీ ఓ నివేదిక రూపొందించింది. జులై- సెప్టెంబర్‌ త్రైమాసికంలో తమ వేదికగా రూపే క్రెడిట్‌ కార్డులకు 37 శాతం డిమాండ్‌ వచ్చిందని తెలిపింది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో ఇది 23 శాతంగా ఉందని పేర్కొంది.

బిగ్‌ బిలియన్‌ సేల్‌లో నథింగ్‌, పిక్సెల్‌ ఫోన్లపై భారీ డిస్కౌంట్‌

ముఖ్యంగా జైపుర్‌, మేరట్‌, సూరత్‌, నాగ్‌పూర్‌, రాంచీ, రాయ్‌పూర్‌, వారణాసి, ఇందౌర్‌, కాన్పూర్‌, ఝాన్సీ పట్టణాల నుంచి రూపే క్రెడిట్‌ కార్డులకు వినియోగదారుల నుంచి అధిక డిమాండ్‌ వచ్చినట్లు నివేదిక పేర్కొంది. ఇదే త్రైమాసికంలో మాస్టర్‌ కార్డు క్రెడిట్‌ కార్డులకు 32 శాతం, వీసా కార్డులకు 31 శాతం మాత్రమే డిమాండ్‌ వచ్చిందని సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ మనీశ్‌ ష్రా పేర్కొన్నారు. రూపే నెట్‌వర్క్‌ ఎంపిక చేసుకుంటున్న వారు ముఖ్యంగా యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ బ్యాంకులకు ప్రాధాన్యం ఇస్తున్నారని నివేదిక తెలిపింది. దేశంలో ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్‌, కోటక్‌ బ్యాంకులు అత్యధికంగా క్రెడిట్‌ కార్డులు జారీ చేస్తున్నాయి. డెబిట్‌ కార్డుల విషయంలో ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ముందు వరుసలో ఉన్నాయి. క్రెడిట్‌ కార్డుల జారీలో ప్రైవేటు రంగ బ్యాంకులు, డెబిట్‌ కార్డుల విషయంలో ప్రభుత్వరంగ బ్యాంకులు ముందున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని