Banks: వ్యాపార విస్తరణకు ఫిన్‌టెక్‌లతో బ్యాంకుల భాగస్వామ్యం

ఫిన్‌టెక్‌ సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకొని వ్యాపార విస్తరణకు కృషి చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ ప్రభుత్వరంగ బ్యాంకులకు సూచించింది....

Published : 26 Jun 2022 16:13 IST

పీఎస్‌బీలకు కేంద్ర ఆర్థికశాఖ సూచన

దిల్లీ: ఫిన్‌టెక్‌ సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకొని వ్యాపార విస్తరణకు కృషి చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ ప్రభుత్వరంగ బ్యాంకులకు సూచించింది. రుణ వితరణకు డేటా అనలిటిక్స్‌ వంటి అత్యాధునిక సాంకేతిక మార్గాలను వినియోగించుకోవాలని తెలిపింది. సైబర్‌ మోసాలను అరికట్టేలా ఐటీ వ్యవస్థను పటిష్ఠం చేయాలని కోరింది. ఉత్పాదకత ఎక్కువగా ఉండే రంగాలకు రుణ పంపిణీని వేగవంతం చేయాలని ఆర్థికశాఖ బ్యాంకులకు సూచించింది. ఫలితంగా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వంటి సవాళ్ల నుంచి ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం.. ప్రభుత్వరంగ బ్యాంకుల రుణ వితరణ వృద్ధి గత ఏడాది మార్చిలో 3.6 శాతంగా ఉండగా.. ఈసారి అది 7.8 శాతానికి ఎగబాకింది. కొన్ని బ్యాంకుల్లో ఈ వృద్ధి 26 శాతంగానూ నమోదవ్వడం విశేషం. అత్యధికంగా ఈ మార్చిలో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర రుణ పంపిణీ 26 శాతం వృద్ధి చెంది రూ.1,35,240 కోట్లుగా నమోదైంది. తర్వాత ఎస్‌బీఐ 10.27 శాతం, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 9.66 శాతం వృద్ధి నమోదు చేశాయి. నిరర్థక ఆస్తుల పరిష్కార ప్రక్రియను కూడా వేగవంతం చేసి మొండి బకాయిలను రికవరీ చేయాలని బ్యాంకులకు ఆర్థిక శాఖ సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని