SVB Crisis: ఫస్ట్‌ సిటిజన్స్‌ బ్యాంక్‌కు ఎస్‌వీబీ ఆస్తులు, డిపాజిట్లు

 SVB Crisis: ఎస్‌వీబీ డిపాజిటర్లంతా సోమవారం నుంచి ఫస్ట్‌ సిటిజన్‌ బ్యాంక్‌ ఖాతాదారులుగా మారనున్నారు. అలాగే డిపాజిట్లన్నింటికీ పరిమితికి లోబడి ఎఫ్‌డీఐసీ బీమా వర్తిస్తుంది.

Updated : 27 Mar 2023 15:28 IST

వాషింగ్టన్‌: అమెరికాలో ఆర్థికంగా కుదేలైన ‘సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌’కు చెందిన డిపాజిట్లు, రుణాలను ‘ఫస్ట్‌ సిటిజన్స్‌ బ్యాంక్‌’ కొనుగోలు చేసింది. ప్రస్తుతం ‘సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (Silicon Valley Bank)’ కార్యకలాపాలు ‘ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (FDIC)’ నియంత్రణలో ఉన్నాయి. తాజా కొనుగోలు నేపథ్యంలో ఎస్‌వీబీ డిపాజిట్లు, రుణాలు ఎఫ్‌డీఐసీ నుంచి ఫస్ట్‌ సిటిజన్స్‌ బ్యాంక్‌కు బదిలీ కానున్నాయి. 

తాజా పరిణామం నేపథ్యంలో ఎస్‌వీబీ డిపాజిటర్లంతా సోమవారం నుంచి ఫస్ట్‌ సిటిజన్‌ బ్యాంక్‌ ఖాతాదారులుగా మారనున్నారు. అలాగే డిపాజిట్లన్నింటికీ పరిమితికి లోబడి ఎఫ్‌డీఐసీ బీమా వర్తిస్తుంది. రాలీ కేంద్రంగా పనిచేస్తున్న ‘ఫస్ట్‌ సిటిజన్‌ బ్యాంక్‌షేర్స్‌ కంపెనీ’కి ‘ఫస్ట్‌ సిటిజన్‌ బ్యాంక్‌’ అనుబంధ సంస్థ. ఈ బ్యాంకుకు ప్రస్తుతం 109 బిలియన్‌ డాలర్ల ఆస్తులు, 89.4 బిలియన్‌ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయి. తాజా కొనుగోలు నేపథ్యంలో ద్రవ్య లభ్యత సమస్య తలెత్తకుండా ఎఫ్‌డీఐసీ ఫస్ట్‌ సిటిజన్‌ బ్యాంక్‌కు ‘లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌’ అందించనుంది.

2023 మార్చి 10 నాటికి ఎస్‌వీబీకి 167 బిలియన్‌ డాలర్ల ఆస్తులు, 119 బిలియన్‌ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయి. తాజా కొనుగోలులో 72 బిలియన్‌ డాలర్ల ఆస్తులను 16.5 బిలియన్‌ డాలర్ల రాయితీతో ఫస్ట్‌ సిటిజిన్‌ సొంతం చేసుకుంది. మరో 90 బిలియన్‌ డాలర్ల సెక్యూరిటీలు, ఆస్తులు ఎఫ్‌డీఐసీ నియంత్రణలోనే ఉండనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని