Future Group: భారీగా పతనమైన ఫ్యూచర్‌ గ్రూప్‌ షేర్లు!

ఫ్యూచర్‌ గ్రూప్‌ షేర్లు సోమవారం భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి....

Published : 25 Apr 2022 12:14 IST

దిల్లీ: ఫ్యూచర్‌ గ్రూప్‌ షేర్లు సోమవారం భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. రిటైల్, టోకు, రవాణా, గిడ్డంగులను రూ.24,713 కోట్లకు కొనుగోలు చేసేందుకు కుదిరిన ఒప్పందాన్ని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రద్దు చేసుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఫ్యూచర్‌ రిటైల్‌ సెక్యూర్డ్‌ రుణదాతలు ఈ విలీన పథకానికి వ్యతిరేకంగా ఓటు వేసిన నేపథ్యంలో ఈ ఒప్పందాన్ని అమలు చేయలేమని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ శనివారం ప్రకటించింది.

ఫలితంగా సోమవారం దాదాపు తొలి మూడు గంటల ట్రేడింగ్‌లో బీఎస్‌ఈలో ‘ఫ్యూచర్‌ కన్జ్యూమర్‌’ షేర్లు 19.91%, ‘ఫ్యూచర్‌ సప్లయ్‌ చైన్‌ సొల్యూషన్స్‌’ 19.96%, ‘ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్స్‌’ 19.89%, ‘ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌’ 9.87%, ‘ఫ్యూచర్‌ రిటైల్‌’ షేర్లు 4.96% వరకు పడిపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్‌ షేర్లు సైతం 1.75 శాతం పతనమయ్యాయి.

ఒప్పందంపై వాటాదార్లు, రుణదాతలు ఇచ్చిన ఓటింగ్‌ ఫలితాలను ఫ్యూచర్‌ రిటైల్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఆర్‌ఎల్‌), ఇతర నమోదిత కంపెనీలతో కూడిన ఫ్యూచర్‌ గ్రూప్‌ కంపెనీలు ఇటీవల రిలయన్స్‌కు తెలిపాయి. ఫ్యూచర్‌ రిటైల్‌ సంస్థ సెక్యూర్డ్‌ రుణదాతలు ఈ విలీన పథకానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ నేపథ్యంలోనే ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు రిలయన్స్‌ శనివారం ప్రకటించింది.

ఫ్యూచర్‌ గ్రూప్, రిలయన్స్‌ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఫ్యూచర్‌కు చెందిన 19 కంపెనీలను ఒక కంపెనీగా ఏకీకృతం చేసి.. ఆ తర్వాత రిలయన్స్‌ రిటైల్‌కు బదిలీ చేయాల్సి ఉంటుంది. కాగా, ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజ్‌ శుక్రవారం వెలువరించిన ఓటింగ్‌ ఫలితాల ప్రకారం.. 99.97% సెక్యూర్డ్‌ రుణదాతలు ఈ పథకాన్ని వ్యతిరేకించారు. అయితే 99.99% మంది వాటాదార్లు; 62.65% అన్‌సెక్యూర్డ్‌ రుణదాతలు సానుకూలంగా ఓటేశారు. ఫ్యూచర్‌ సప్లై చైన్‌ సొల్యూషన్స్‌ తప్ప మిగిలిన అన్ని నమోదిత కంపెనీలు ఈ పథకానికి అవసరమైన 75% ఓటింగ్‌ను పొందలేకపోయాయి. ఈ ఓటింగ్‌ల నేపథ్యంలో ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్స్‌ ఛైర్‌పర్సన్‌ శైలేశ్‌ హరిభక్తి రాజీనామా చేశారు. ఒప్పందం వెనక్కి వెళ్లిపోవడంతో ఫ్యూచర్‌ రిటైల్‌ బోర్డు, యాజమాన్య పరిస్థితి అనిశ్చితిలో పడిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని