స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో ఆర్‌ఆర్‌బీల నమోదు!

స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు కావడం ద్వారా నిధులను సమీకరించుకునేందుకు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ)లకు  వీలు కల్పించే అంశంలో భాగంగా ఆర్థిక శాఖ అందుకు సంబంధించిన ముసాయిదా నిబంధనలు జారీ చేసింది.

Published : 03 Oct 2022 02:18 IST

ముసాయిదా నిబంధనలు జారీ చేసిన ఆర్థిక శాఖ

దిల్లీ: స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు కావడం ద్వారా నిధులను సమీకరించుకునేందుకు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ)లకు  వీలు కల్పించే అంశంలో భాగంగా ఆర్థిక శాఖ అందుకు సంబంధించిన ముసాయిదా నిబంధనలు జారీ చేసింది. ఇందులో ప్రధానంగా గడిచిన మూడేళ్లలో బ్యాంక్‌ నికర విలువ కనీసం రూ.300 కోట్లుగా ఉండాలి. ఆ సమయంలో మూలధన కనీస నిష్పత్తి కూడా నియంత్రణ సంస్థలు నిర్దేశించిన కనీస స్థాయి అయిన 9 శాతం కంటే పైనే ఉండాలి. గడిచిన 5 ఏళ్లలో మూడేళ్లపాటు ఆర్‌ఆర్‌బీలు కనీసం రూ.15 కోట్ల మేర నిర్వహణ లాభం ఆర్జించి ఉండాలి. 5 ఏళ్లలో కనీసం మూడేళ్లు ఈక్విటీపై 10 శాతం ప్రతిఫలం అందించి ఉండాలి. ముసాయిదా నిబంధనల మేరకు ప్రాయోజిత బ్యాంక్‌లు ఐపీఓలకు సరిపోయే ఆర్‌ఆర్‌బీలను గుర్తించాల్సి ఉంటుంది. మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ)ల నియమ నిబంధనలు పరిగణనలోకి తీసుకుని ప్రాయోజిత బ్యాంక్‌లు ఆర్‌ఆర్‌బీలను ఐపీఓలకు సూచించాల్సి ఉంటుంది. వ్యవసాయ రుణాలు అందించడంలో కీలక పాత్ర పోషించే ఆర్‌ఆర్‌బీలను ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) ప్రాయోజితం (స్పాన్సర్‌) చేస్తుంటాయి. ప్రస్తుతం ఆర్‌ఆర్‌బీల్లో 50 శాతం వాటా కేంద్రం వద్ద, 35 శాతం వాటా ప్రాయోజిత బ్యాంక్‌ వద్ద, 15 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉంటోంది. ఆర్‌ఆర్‌బీ చట్టం 1976 ప్రకారం ఆర్‌ఆర్‌బీలను ఏర్పాటు చేశారు. చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ ప్రాంతాల్లోని చేతి వృత్తుల వారికి రుణాలు, ఇతర సదుపాయాలు కల్పించే ప్రధాన ఉద్దేశంతో వీటిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

* ప్రస్తుతం దేశంలో 43 ఆర్‌ఆర్‌బీలు ఉండగా, 12 పీఎస్‌బీలు స్పాన్సర్‌ చేస్తున్నాయి. 26 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో (పుదుచ్చేరి, జమ్ము-కశ్మీర్‌, లద్దాఖ్‌) కలిపి ఆర్‌ఆర్‌బీలకు 21,856 శాఖలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని