రాబోయే సంవత్సరాల్లో 6.5% పైనే వృద్ధి

ప్రస్తుత దశాబ్దంలో మిగిలిన ఆర్థిక సంవత్సరాల్లో భారత వృద్ధి రేటు 6.5 శాతం ఎగువనే నమోదవుతుందనే ఆశాభావాన్ని ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంతర నాగేశ్వరన్‌ వ్యక్తం చేశారు.

Published : 25 Nov 2022 03:42 IST

ముంబయి: ప్రస్తుత దశాబ్దంలో మిగిలిన ఆర్థిక సంవత్సరాల్లో భారత వృద్ధి రేటు 6.5 శాతం ఎగువనే నమోదవుతుందనే ఆశాభావాన్ని ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంతర నాగేశ్వరన్‌ వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని 6.5-7 శాతం వృద్ధితో ముగించే అవకాశం ఉందంటూ.. ప్రైవేటు రంగ విశ్లేషకులు, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ), అంతర్జాతీయ ఏజెన్సీలు వేసిన అంచనాలను గుర్తు చేశారు. సెప్టెంబరు త్రైమాసిక జీడీపీ గణాంకాలు కొద్ది రోజుల్లో రానున్నాయని.. అవి ఈ విషయంలో స్పష్టత తీసుకొస్తాయని ఆయన అన్నారు. 2023-24లో వృద్ధిరేటు 6-6.2 శాతం ఉండొచ్చని అంతర్జాతీయ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయని గురువారమిక్కడ జరిగిన ఎస్‌బీఐ బ్యాంకింగ్‌ అండ్‌ ఎకనమిక్‌ సదస్సులో నాగేశ్వరన్‌ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6.7 శాతంగా నమోదు కావొచ్చని సిటీ గ్రూప్‌, 7.3 శాతమని ఎస్‌ అండ్‌ పీ రేటింగ్స్‌ అంచనా వేశాయి. ఆర్‌బీఐ  7 శాతంగా పేర్కొంది. ‘ఈ దశాబ్దంలో మిగతా ఆర్థిక సంవత్సరాల్లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి 6.5 శాతంపైనే నమోదుకావొచ్చు. గిరాకీకి అంతర్గత కారకాలు బలంగా ఉండడమే ఇందుకు కారణం. ప్రైవేటు మూలధన వ్యయాలు పునః ప్రారంభం కావడం; కొన్నేళ్లుగా నిర్మాణాత్మక సంస్కరణలు కొనసాగుతుండడం వల్ల మధ్యకాలంలో వృద్ధి అధికంగానే కొనసాగగలద’ని ఆయన వివరించారు. ‘ప్రైవేటు రంగంలో మూలధన వ్యయాలు ఇప్పటికే రూ.3 లక్షల కోట్లను అధిగమించాయని, మార్చి ఆఖరుకు రూ.6 లక్షల కోట్లకు చేరుతాయ’ని ఆయన అంచనా వేశారు.

భారత ఎగుమతులపై మందగమన ప్రభావం.. గోయెల్‌ : ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చితి, మందగమన ధోరణులు భారత ఎగుమతులపై ప్రభావం చూపొచ్చని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూశ్‌ గోయెల్‌ అంచనా వేశారు. అయితే సేవల ఎగుమతుల వల్ల వృద్ధికి భారీ అవకాశాలున్నాయన్నారు. ‘ప్రపంచ మందగమన ప్రభావం భారత్‌పైనా కొంత ఉండొచ్చు. మన ఎగుమతుల్లో కొంత బలహీనతలు కనిపించొచ్చ’ని గురువారమిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన అన్నారు. 2022 ఏప్రిల్‌-అక్టోబరులో ఎగుమతులు 12.55% వృద్ధితో 263.35 బి. డాలర్లకు చేరగా.. దిగుమతులూ 33.12% పెరిగి 436.81 బి. డాలర్లకు చేరాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని