ద్రవ్యలోటు 0.50% తగ్గిద్దాం!

ద్రవ్యలోటును కనీసం 50 బేసిస్‌ పాయింట్ల మేరకు తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

Published : 26 Nov 2022 03:10 IST

ప్రభుత్వ  యోచన

దిల్లీ: ద్రవ్యలోటును కనీసం 50 బేసిస్‌ పాయింట్ల మేరకు తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం స్థూల జాతీయోత్పత్తిలో 6 శాతం కంటే తక్కువకే ద్రవ్యలోటును పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని సంబంధిత వ్యవహారాలతో సంబంధం ఉన్న వర్గాలు పేర్కొంటున్నాయి. 2024లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో, ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి ఆఖరి పూర్తిస్థాయి బడ్జెట్‌ను వచ్చే ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టనున్నారు. 2024లో మధ్యంతర బడ్జెట్‌ మాత్రమే ఉంటుంది. ఎన్నికల నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం కాస్త అధికంగానే ఖర్చు చేసే అవకాశాలున్నాయి.
రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఆహారం, ఇంధన బిల్లుల భారం పెరిగింది. ఎగుమతులేమో తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశం కరెంటు ఖాతా లోటును ఎదుర్కొంటోంది. రూపాయి రికార్డు స్థాయిలో బలహీనపడింది. ఆహారం, ఎరువులు, ఇంధనంపై సబ్సిడీలు 2023 మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం 67 బిలియన్‌ డాలర్లు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం అమలవుతున్న బడ్జెట్‌లో ఈ మొత్తం 39.2 బిలియన్‌ డాలర్లుగానే ఉంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే, రూపాయి పతనాన్ని నిరోధించేందుకు ఆర్‌బీఐ ఇప్పటికే తన ఖజానా నుంచి 100 బిలియన్‌ డాలర్లను ఖర్చు చేసింది.

విదేశీ పెట్టుబడుల సాయంతో: ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నించడానికి, భారత్‌ను ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలో ద్రవ్యలోటు జీడీపీలో 6.4 శాతం వరకూ ఉంది. కొవిడ్‌ మహమ్మారి సమయంలో ఇది 9.2 శాతానికి చేరింది. 2025-26 నాటికి ఈ లోటును జీడీపీలో 4.5 శాతాని కన్నా తక్కువకు పరిమితం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా విధించుకుంది.

అంతర్జాతీయ అంశాల వల్లే అధిక ద్రవ్యోల్బణం : ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, దాని ప్రభావంతో ఇంధన, ఆహార వ్యయాలు పెరిగాయనీ; అదే సమయంలో కరోనా పరిణామాల ఫలితంగా సరఫరా ఇబ్బందులు తోడయి, అధిక ద్రవ్యోల్బణానికి కారణమయ్యాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రభుత్వానికి నివేదించిందని సమాచారం. రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని వరుసగా 3 త్రైమాసికాల పాటు నియంత్రిత లక్ష్యమైన 2-6 శాతం పరిధిలో ఉంచడంలో ఎందుకు విఫలమైందీ పేర్కొంటూ, కేంద్రానికి పరపతి విధాన కమిటీ (ఎమ్‌పీసీ) నివేదించింది. ఇందుకోసం ఎంపీసీ ప్రత్యేక సమావేశం నిర్వహించిన సంగతి విదితమే. తదుపరి ఈనెల మొదట్లోనే పంపిన లేఖలోని చాలా కొద్ది వివరాలే బయటకు వచ్చినట్లు ఆంగ్లపత్రికలు పేర్కొన్నాయి. ఈ ప్రకారం..
అంతర్జాతీయ అంశాల వల్లే ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని చేరడంలో విఫలమైనట్లు ఆర్‌బీఐ పేర్కొంది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల విషయంలో గరిష్ఠాన్ని అధిగమించినట్లు.. భవిష్యత్‌లో అంతటి ఇబ్బందులు ఉండకపోవచ్చని వివరించినట్లు  సమాచారం.

రెపోరేటు 6.4 శాతానికి!: ఏడాది కాలంలో రెపో రేటు ప్రస్తుత 5.9 శాతం నుంచి 6.4 శాతానికి పెరిగితే; ద్రవ్యోల్బణం ప్రస్తుత 6.8 శాతం నుంచి 5 శాతానికి తగ్గొచ్చని బ్లూమ్‌బర్గ్‌ నిర్వహించిన సర్వేలో ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. శక్తికాంతదాస్‌ ద్రవ్యోల్బణంపై గతంలో చెప్పిన అంచనాలకు అనుగుణంగా ఇవి ఉండడం గమనార్హం.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు