భళా.. మారుతీ

దేశీయ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) విశ్లేషకుల అంచనాలను మించి రాణించింది. డిసెంబరు త్రైమాసికంలో రూ.2,351 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.

Published : 25 Jan 2023 05:31 IST

నికర లాభం రూ.2,351 కోట్లు

దిల్లీ: దేశీయ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) విశ్లేషకుల అంచనాలను మించి రాణించింది. డిసెంబరు త్రైమాసికంలో రూ.2,351 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఏడాది క్రితం ఇదే సమయంలో సంస్థ ఆర్జించిన నికర లాభం రూ.1,011.3 కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపునకు పైగా (129.7%) ఎక్కువ. ఇదే సమయంలో నికర విక్రయాలు రూ.22,187.6 కోట్ల నుంచి రూ.27,849.2 కోట్లకు చేరాయి. వ్యయ నియంత్రణ చర్యలకు తోడు, వాహనాల ధరలు పెంచడం, విదేశీ మారకపు వ్యత్యాసం అనుకూలంగా ఉండటం, కమొడిటీ ధరలు శాంతించడం, అధిక నిర్వహణేతర ఆదాయం వంటివి లాభం పెరిగేందుకు దోహదం చేసినట్లు ఎంఎస్‌ఐ పేర్కొంది. వినియోగదారుల నుంచి అధిక ధర మోడళ్లకు గిరాకీ పెరగడమూ కలిసొచ్చింది.

3.63 లక్షల ఆర్డర్లు పెండింగ్‌: వినియోగదార్ల నుంచి వచ్చిన ఆర్డర్లలో 3,63,000 వాహనాలు సరఫరా చేయాల్సి ఉందని, ఇందులో 1,19,000 కొత్త మోడళ్లే అని ఎంఎస్‌ఐ పేర్కొంది.

* గ్రాండ్‌ విటారా, బ్రెజా కొత్త వెర్షన్‌ల వల్ల స్పోర్ట్స్‌ వినియోగ వాహన (ఎస్‌యూవీ) విభాగంలో మార్కెట్‌ వాటా పెరిగింది.

* ఎలక్ట్రానిక్‌ పరికరాల కొరతతో డిసెంబరు త్రైమాసికంలో సుమారు 46,000 వాహనాల ఉత్పత్తిపై ప్రభావం పడింది.

9 నెలలకు: ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-డిసెంబరులో ఎంఎస్‌ఐ నికర లాభం రూ.5,425.6 కోట్లుగా నమోదైంది. 2021-22 ఇదే కాల లాభం రూ.1,927.4 కోట్లే. గతంలో ఎన్నడూ లేని విధంగా, 2022 ఏప్రిల్‌-డిసెంబరులో అత్యధికంగా రూ.81,679 కోట్ల నికర విక్రయాలను నమోదు చేసినట్లు మారుతీ తెలిపింది. 2021-22 ఇదేకాల విక్రయాలు రూ.58,284.1 కోట్లే.


టీవీఎస్‌ లాభం రూ.304 కోట్లు

దిల్లీ: టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ డిసెంబరు త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.304 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది. 2021-22 ఇదే త్రైమాసిక లాభం రూ.237 కోట్లతో పోలిస్తే ఇది 28%  అధికం. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.6,606 కోట్ల నుంచి రూ.8,075 కోట్లకు పెరిగింది.  కంపెనీ ద్విచక్ర వాహన విక్రయాలు 8.35 లక్షల నుంచి  8.36 లక్షలకు పెరిగాయి. త్రిచక్ర వాహన విక్రయాలు 44,000 నుంచి 43,000కు తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో కంపెనీ నికర లాభం రూ.974 కోట్లకు వృద్ధి చెందింది. ఏడాది క్రితం ఇది రూ.456 కోట్లే.

* ఒక్కో షేరుకు రూ.5 (500 శాతం) మధ్యంతర డివిడెండ్‌ను డైరెక్టర్ల బోర్డు ప్రకటించింది. ఇందుకు రూ.238 కోట్లు వెచ్చించనుంది.


యూకో బ్యాంక్‌ లాభం రెట్టింపు

దిల్లీ: యూకో బ్యాంక్‌ డిసెంబరు త్రైమాసికంలో రూ.653 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదే కాల లాభం రూ.310 కోట్లతో పోలిస్తే, ఇది రెట్టింపు కంటే (110%) అధికం. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.4638 కోట్ల నుంచి రూ.5451 కోట్లకు పెరిగింది. వడ్డీ ఆదాయం కూడా రూ.3919 కోట్ల నుంచి రూ.4627 కోట్లకు చేరింది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) 8% నుంచి 5.63 శాతానికి, నికర ఎన్‌పీఏలు 2.81% నుంచి 1.66 శాతానికి పరిమితమయ్యాయి. వీటికి కేటాయింపులు కూడా రూ.565 కోట్ల నుంచి సగానికి పైగా తగ్గి రూ.220 కోట్లుగా నమోదయ్యాయి. ‘సమీక్షా త్రైమాసికంలో రుణాల్లో 20.5% వృద్ధి నమోదైంది. తాజాగా ఒత్తిడికి గురవుతున్న రుణాల మొత్తం రూ.1500 కోట్ల నుంచి రూ.500 కోట్లకు తగ్గింది. వడ్డీరేట్లు పెంచినందున, ప్రస్తుత త్రైమాసికంలో డిపాజిట్లలోనూ వృద్ధి పెరుగుతుంది. నికర వడ్డీ మార్జిన్‌ 3-3.01% కావచ్చు’ అని యూకో బ్యాంక్‌ ఎండీ-సీఈఓ సోమశంకర ప్రసాద్‌ తెలిపారు.


Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు