లారస్‌ ల్యాబ్స్‌ ఆదాయాల్లో 50% వృద్ధి

లారస్‌ ల్యాబ్స్‌ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.1,545 కోట్ల ఆదాయాన్ని, రూ.203 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. త్రైమాసిక ఈపీఎస్‌

Published : 31 Jan 2023 02:42 IST

ఈనాడు, హైదరాబాద్‌: లారస్‌ ల్యాబ్స్‌ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.1,545 కోట్ల ఆదాయాన్ని, రూ.203 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. త్రైమాసిక ఈపీఎస్‌  రూ.3.7గా ఉంది. 2021-22 ఇదేకాల ఆదాయం  రూ.1028 కోట్లతో పోలిస్తే 50%, నికరలాభం రూ.154 కోట్లతో పోలిస్తే 32% పెరిగాయి. సింథసిస్‌ విభాగంలో 60 కొత్త ప్రాజెక్టులపై పనిచేస్తున్నామని, సీడీఎంఓ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకునే సన్నాహాల్లో ఉన్నట్లు వివరించింది. డిసెంబరు త్రైమాసికంలో జనరిక్‌ ఎఫ్‌డీఎఫ్‌ (ఫినిష్డ్‌ డోసేజ్‌ ఫార్ములేషన్స్‌) ఆదాయాలు 33% తగ్గినా, జనరిక్‌ ఏపీఐ ఆదాయాలు 49% పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల కాలానికి లారస్‌ ల్యాబ్స్‌ రూ.4,660 కోట్ల ఆదాయాన్ని, రూ.687 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ఈపీఎస్‌ రూ.12.7గా ఉంది. ఎబిటా మిగులు 28 శాతం, నికరలాభాల మిగులు 15 శాతం ఉన్నాయి.

కొత్త ఔషధాల ఆవిష్కరణకు పరిశోధనలు: మూడో త్రైమాసిక ఫలితాలపై లారస్‌ ల్యాబ్స్‌ సీఈఓ సత్యనారాయణ చావ స్పందిస్తూ, దాదాపు అన్ని విభాగాల్లో మెరుగైన పనితీరు ప్రదర్శించినట్లు చెప్పారు. ఏఆర్వీ ఎఫ్‌డీఎఫ్‌ విభాగంలో కొంత సానుకూల పరిస్థితి కనిపించినట్లు తెలిపారు. హెచ్‌ఐవీ మందుల కోసం కొన్ని ప్రపంచ స్థాయి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని ‘ప్యానెల్‌ సప్లయర్‌’గా ఎంపికైనట్లు వెల్లడించారు. కొత్త ఔషధాలను ఆవిష్కరించడానికి పరిశోధన- అభివృద్ధి కార్యక్రమాలను పెద్దఎత్తున చేపడుతున్నట్లు వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో పరిశోధన- అభివృద్ధికి లారస్‌ ల్యాబ్స్‌ రూ.153 కోట్లు వెచ్చించింది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్ల వరకు మూలధన పెట్టుబడి పెడుతున్నామని, ఇందులో మూడో వంతు ఇప్పటికే వెచ్చించినట్లు సత్యనారాయణ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని