వడ్డీ రేట్లు మరింత పైకి

వచ్చే ఆర్థిక సంవత్సరంలో రుణాలపై వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ అంచనా వేస్తోంది.

Updated : 15 Mar 2023 08:04 IST

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే ఆర్థిక సంవత్సరంలో రుణాలపై వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ అంచనా వేస్తోంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక రెపోరేటును పెంచుతున్నందున, బ్యాంకులకు నిధుల లభ్యత తగ్గుతోంది. ఫలితంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు నిధుల వ్యయం ఆధారిత రుణ వడ్డీ రేటును 100-150 బేసిస్‌ పాయింట్ల మేరకు పెంచే అవకాశం ఉందని పేర్కొంది.

నిధుల సమీకరణకు: డిపాజిట్ల ద్వారా డబ్బును సేకరించడం, రివర్స్‌ రెపో లేదా స్టాండింగ్‌ డిపాజిట్‌లో ఉన్న డబ్బును వెనక్కి తీసుకోవడం ద్వారా రుణాల జారీకి అవసరమైన నిధులు సమీకరించేందుకు బ్యాంకులు ఇప్పటి వరకు ప్రయత్నించాయి. దీంతో రుణ రేట్లను పెద్ద ఎత్తున పెంచే విషయంలో బ్యాంకులకు అంత ఒత్తిడి ఎదురవ్వలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు దాదాపు రూ.5లక్షల కోట్లను రివర్స్‌ రెపో ఖాతాల నుంచి వెనక్కి తీసుకుని, రుణాల జారీకి వినియోగించాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ అవకాశం కనిపించడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాంకులు నిధుల వ్యయం ఆధారిత రుణరేట్లను (ఎంసీఎల్‌ఆర్‌) పెంచకతప్పకపోవచ్చనే అంచనాలున్నాయి.

ఈ ఆర్థిక సంవత్సరంలో 2.50% పెంపు

ఈ ఆర్థిక సంవత్సరం మే నుంచి ఆర్‌బీఐ రెపో రేటును 250 బేసిస్‌ పాయింట్ల మేరకు పెంచింది. కేంద్ర బ్యాంకు నిబంధనల ప్రకారం బ్యాంకులు తమ రుణ రేట్లను నిధుల సమీకరణ వ్యయాల ఆధారంగా ప్రతి నెలా సవరిస్తూ ఉంటాయి. ముందస్తు పన్ను, జీఎస్‌టీ చెల్లింపులు తదితర కారణాల వల్ల వచ్చే కొన్ని వారాల్లో బ్యాంకింగ్‌ వ్యవస్థలో, ద్రవ్య లభ్యత కఠినతరం అవుతుందని రేటింగ్‌ ఏజెన్సీ తెలిపింది. దీర్ఘకాలిక రెపో వేలం, స్వల్పకాలిక బాండ్లు, ట్రెజరీ బిల్లులను బహిరంగంగా మార్కెట్‌లో కొనుగోలు వంటి విభిన్న సాధనాలను ఉపయోగించి ద్రవ్య లభ్యత విషయంలో బ్యాంకింగ్‌ వ్యవస్థకు ఆర్‌బీఐ మద్దతు ఇస్తుందని ఫిచ్‌ గ్రూపు కంపెనీ అంచనా వేస్తోంది. నగదు లభ్యత తక్కువగా ఉంటుందని భావిస్తున్న స్వల్ప కాల వ్యవధిలో, బలహీన సంస్థలకు సమస్యాత్మకంగా మారొచ్చని రేటింగ్‌ ఏజెన్సీ తెలిపింది. 2023-24లో పాలసీ రేటు స్థిరంగా ఉన్నప్పటికీ, బ్యాంకింగ్‌ వ్యవస్థ వడ్డీ రేట్ల విషయంలో కొంత ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్‌ అంచనా వేస్తోంది.

రుణ రేట్లు పెంచిన ఎస్‌బీఐ

ఎస్‌బీఐ బెంచ్‌మార్క్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేటును 70 బేసిస్‌ పాయింట్ల మేరకు పెంచి, 14.85% చేసినట్లు ప్రకటించింది. కొత్త రేటు నేటి నుంచి అమల్లోకి రానుంది. బేస్‌ రేటునూ 70 బేసిస్‌ పాయింట్లు పెంచి, 10.10 శాతానికి చేర్చింది. ఎంసీఎల్‌ఆర్‌ను మాత్రం పెంచలేదు. ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ 8.50%, రెండేళ్ల వ్యవధికి 8.60%, మూడేళ్ల వ్యవధికి 8.70 శాతంగా ఉంది.

ఏమిటీ ఎంసీఎల్‌ఆర్‌?

బ్యాంకులు నిధుల సమీకరణకు చేసే వ్యయాల ఆధారంగా మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేటు (ఎంసీఎల్‌ఆర్‌)ను నిర్ణయిస్తాయి. అంటే ఈ శాతానికన్నా తక్కువగా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి వీల్లేదు. రోజు, నెల, 3, 6, ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల వ్యవధికి ఈ వడ్డీ రేట్లను బ్యాంకులు నిర్ణయిస్తాయి. ఇది బ్యాంకును బట్టి మారుతుంది. ఈ విధానం 2016 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి తీసుకున్న గృహరుణాలు, తనఖా రుణాలు, కార్పొరేట్‌ రుణాలు ఎక్కువగా దీని పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం గృహరుణాలు చాలావరకూ రెపో ఆధారిత వడ్డీ రేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌) మారాయి. అంటే రెపోరేటు ఆధారంగా ఇది మారుతుంటుంది. ఈ విధానానికి మారని వారికి ఎంసీఎల్‌ఆర్‌ వర్తిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని