లాభాలు కొనసాగే అవకాశం

లాభాలను మార్కెట్లు ఈ వారమూ కొనసాగించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిఫ్టీ-50 సూచీ కీలక 18,450 పాయింట్ల స్థాయిని అధిగమించడం ఇందుకు దోహదం చేయొచ్చని అంటున్నారు.

Published : 29 May 2023 03:48 IST

ప్రైవేటు బ్యాంకర్లతో ఆర్‌బీఐ గవర్నర్‌ సమావేశంపై దృష్టి
కార్పొరేట్‌ ఫలితాల ఆధారంగా షేర్ల కదలికలు
వాహన, బ్యాంకు స్క్రిప్‌లకు సానుకూలతలు
విశ్లేషకుల అంచనాలు
స్టాక్‌ మార్కెట్‌ ఈ వారం

లాభాలను మార్కెట్లు ఈ వారమూ కొనసాగించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిఫ్టీ-50 సూచీ కీలక 18,450 పాయింట్ల స్థాయిని అధిగమించడం ఇందుకు దోహదం చేయొచ్చని అంటున్నారు. నిఫ్టీకి 18,400 వద్ద తక్షణ మద్దతు, 18,520 వద్ద నిరోధం కనిపించొచ్చన్నది సాంకేతిక నిపుణుల అంచనా. గతవారం ధోరణి కొనసాగితే.. కొత్త గరిష్ఠాలు కష్టమేమీ కాకపోవచ్చని బ్రోకరేజీలు అంచనా వేస్తున్నాయి. అయితే విదేశీ, దేశీయ సంస్థాగత మదుపుదార్లు ఒకే సమయంలో నికర కొనుగోలుదార్లుగా ఉంటే, లాభాల స్వీకరణకూ అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఐటీ, ఎఫ్‌ఎమ్‌సీజీ రంగాలకు తోడు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ను ముందుండి నడిపించొచ్చని అంటున్నాయి. ప్రైవేటు రంగ బ్యాంకుల డైరెక్టర్లతో ఆర్‌బీఐ గవర్నర్‌ నేడు సమావేశం కానున్న నేపథ్యంల, మదుపర్ల దృష్టి అటువైపు ఉండొచ్చు. వివిధ రంగాలపై విశ్లేషకుల అంచనాలు..

సిమెంటు రంగ షేర్లు స్తబ్దుగా కదలాడొచ్చు. బలహీన ధరల నుంచి రికవరీ కావడానికి ఈ రంగం ప్రయత్నిస్తోంది. ముడిపదార్థాల అధిక ధరలు ఇబ్బంది పెడుతున్నాయి.  

ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా వంటి చమురు ఉత్పత్తి కంపెనీల షేర్లు అంతర్జాతీయ ముడి చమురు ధరల చలనాల ఆధారంగా కదలాడనున్నాయి. ఒపెక్‌ తదుపరి సమావేశం జూన్‌ 4న జరగనుంది. చమురు మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు రిటైల్‌ ధరల నుంచి సంకేతాలందుకోవచ్చు.

ఎంపిక చేసిన టెలికాం షేర్లలో చలనాలు కనిపించొచ్చు. తాజా వినియోగదారు గణాంకాల ప్రభావం కొనసాగొచ్చు. వరుసగా 12వ నెలైన మార్చిలో రిలయన్స్‌ జియో నికరంగా 30.5 లక్షల మంది వినియోగదార్లను జత చేసుకుంది.  

వాహన షేర్లు లాభాలందుకోవచ్చు. స్వల్ప, మధ్య కాలానికి ఈ రంగంపై సానుకూల భావనలున్నాయి. నిఫ్టీ ఆటో సూచీ మార్కెట్‌ను మించి రాణించొచ్చన్న అంచనాలున్నాయి.  

అమెరికా టెక్‌ షేర్లు పుంజుకోవడంతో పాటు సానుకూల అంచనాల నేపథ్యంలో, మన ఐటీ షేర్లూ  లాభాలను కొనసాగించొచ్చు. మైక్రోసాఫ్ట్‌ తన విండోస్‌ కోపైలట్‌ను ప్రకటించడం టెక్‌ షేర్లపై ప్రభావం చూపింది.

అమెరికా రుణ పరిమితి పెంపుపై చర్చలు సానుకూలంగా ఉన్నాయన్న వార్తలు, లోహ షేర్లకు ఉపకరించొచ్చు.

కొద్ది రోజులుగా రాణిస్తున్న ఔషధ షేర్లు స్థిరీకరణకు గురికావొచ్చు. నిఫ్టీ ఫార్మా సూచీ ఒక వేళ 12,800 స్థాయిని అధిగమిస్తే మాత్రం 13,100 పాయింట్ల దాకా పెరగొచ్చు. లేదంటే 12,400 వైపునకు దిద్దుబాటుకు గురికావొచ్చు. సన్‌ఫార్మా, అరబిందో, ఇప్కా ల్యాబ్‌ ఫలితాల ప్రభావమూ కనిపించొచ్చు.

ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు రాణించొచ్చు. ఈ రంగ సూచీ ఈ నెలలో జీవనకాల గరిష్ఠాలను తాకుతూనే ఉంది. 52000 వద్ద నిరోధం, 49400 వద్ద మద్దతు కనిపిస్తోంది.    

బ్యాంకు షేర్లు తమ లాభాలను కొనసాగించొచ్చు. నిఫ్టీ బ్యాంక్‌కు 43,500 వద్ద మద్దతు, 44,500 వద్ద నిరోధం ఎదురుకావొచ్చు. యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ సానుకూల ధోరణితో ముందుకెళ్లొచ్చు.

బలమైన ఫలితాల మధ్య యంత్రపరికరాల షేర్లు స్వల్పకాలంలో మెరుగ్గా చలించొచ్చు. అన్ని కంపెనీలు ఫలితాలను వెల్లడించాకే, స్పష్టమైన దిశను అంచనా వేయగలమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని