ITC - GST: ఐటీసీ అదనపు క్లెయిమా.. ఎందుకో చెప్పాల్సిందే

వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) చట్టంలో కొత్త నిబంధనలు జతచేసే అంశంపై జీఎస్‌టీ మండలి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదనంగా క్లెయిమ్‌ చేసుకున్న ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ)కు,  ఖజానాకు అదనంగా జమ చేసిన మొత్తానికి కారణాలను కొత్త నిబంధనల ప్రకారం వ్యాపారులు వివరించాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Updated : 10 Jul 2023 08:44 IST

జీఎస్‌టీ చట్టంలో కొత్త నిబంధనలు
రేపు మండలి 50వ సమావేశంలో నిర్ణయం

దిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) చట్టంలో కొత్త నిబంధనలు జతచేసే అంశంపై జీఎస్‌టీ మండలి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదనంగా క్లెయిమ్‌ చేసుకున్న ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ)కు,  ఖజానాకు అదనంగా జమ చేసిన మొత్తానికి కారణాలను కొత్త నిబంధనల ప్రకారం వ్యాపారులు వివరించాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. జీఎస్‌టీఆర్‌-2బీలో ఉండే ఐటీసీ మొత్తంతో పోలిస్తే, జీఎస్‌టీఆర్‌-3బీ రిటర్న్‌లో పొందిన ఐటీసీకి భారీ వ్యత్యాసం ఉంటే.. సంబంధిత వ్యక్తికి పోర్టల్‌పై సమాచారం ఇస్తారు. ఇందుకు గల కారణాలను వివరించాలి.. లేదా పొందిన అదనపు ఐటీసీని వడ్డీతో తిరిగి చెల్లించాల్సిందిగా ఆదేశించనున్నారు. కేంద్రం, రాష్ట్రాలకు చెందిన పన్ను అధికారులతో కూడిన న్యాయ కమిటీ ఈ నిబంధన పెట్టేందుకు సుముఖంగా ఉందని సమాచారం. ఈ వ్యత్యాసం 20 శాతం లేదా రూ.25 లక్షల కంటే అధికంగా ఉంటే కొత్త నిబంధనలు అమలు చేయాలని కమిటీ సూచించింది. ఈనెల 11న (రేపు) జరగనున్న జీఎస్‌టీ మండలి 50వ సమావేశంలో ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

జీఎస్‌టీఎన్‌తో ఈడీ సమాచార పంపిణీ: జీఎస్‌టీ నెట్‌వర్క్‌తో సమాచారాన్ని పంచుకునేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకోసం మనీలాండరింగ్‌ చట్టంలోని నిబంధనలను సవరించింది. జీఎస్‌టీ ఎగవేతలను రికవరీ చేసేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది. రిటర్నులు, పన్ను ఫైలింగ్‌, ఇతర అంశాలతో పాటు జీఎస్‌టీకి సంబంధించిన మొత్తం సమాచారాన్ని జీఎస్‌టీఎన్‌ నిర్వహిస్తోంది. 2002 మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) నిబంధనల సవరణతో.. ఈడీతో సమాచారాన్ని పంచుకునే సంస్థల జాబితాలో జీఎస్‌టీఎన్‌ను చేర్చారు. పీఎంఎల్‌ఏ కింద జీఎస్‌టీఎన్‌ను చేర్చడంతో భారీ మొత్తంలో పన్ను ఎగవేస్తున్న వారిని గుర్తించొచ్చని, వారి నుంచి బకాయిలు రాబట్టుకోవచ్చని ఏఎంఆర్‌జీ అండ్‌ అసోసియేట్స్‌ సీనియర్‌ పార్టనర్‌ రజత్‌ మోహన్‌ అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని