SEBI: స్టాక్‌ మార్కెట్లో లావాదేవీల సెటిల్‌మెంట్‌ అప్పటికప్పుడే

స్టాక్‌మార్కెట్‌లో లావాదేవీలను అప్పటికప్పుడు సెటిల్‌ చేసేందుకు పనిచేస్తున్నట్లు.. వచ్చే ఆర్థిక సంవత్సరంలోగా దీన్ని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబి పురి బచ్‌ పేర్కొన్నారు.

Updated : 25 Jul 2023 09:30 IST

2024-25 కల్లా తీసుకొస్తాం
నిబంధనల అమలుకు కొత్త వ్యవస్థ
డీలిస్టింగ్‌పై త్వరలో చర్చాపత్రం
సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబి పురి బచ్‌

ముంబయి: స్టాక్‌మార్కెట్‌లో లావాదేవీలను అప్పటికప్పుడు సెటిల్‌ చేసేందుకు పనిచేస్తున్నట్లు.. వచ్చే ఆర్థిక సంవత్సరంలోగా దీన్ని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబి పురి బచ్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం లావాదేవీ అనంతరం ఒక ట్రేడింగ్‌ రోజు(టీ+1)కు సెటిల్‌మెంట్‌ అవుతోంది. సెకండరీ మార్కెట్‌ లావాదేవీలకు సైతం కొత్తగా తీసుకొచ్చిన అస్బా(అప్లికేషన్‌ సపోర్టెడ్‌ బై బ్లాక్డ్‌ అమౌంట్‌) పద్ధతి విజయవంతం అవుతోందని బచ్‌ పేర్కొన్నారు. సాంకేతికతను ఉపయోగించుకుని కొత్త ఈక్విటీ, డెట్‌ జారీ; మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలకు అనుమతుల్లో వేగం అందిపుచ్చుకోవడంపైనా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఈ చర్యల వల్ల మదుపర్లకు ఏటా రూ.3,500 కోట్ల ప్రయోజనాలు అందగలవని ఆమె అన్నారు.

రెగ్యులేటరీ శాండ్‌బాక్స్‌ వస్తుంది

నిబంధనల అమలుకు ఒక సరికొత్త వ్యవస్థను ఆవిష్కరించాలని సెబీ భావిస్తోందని బచ్‌ అన్నారు. ‘మేం ప్రకటించే నిబంధనల అమలు ఇబ్బందిగా ఉందని తరచు ఫిర్యాదులు వస్తున్నాయి. అందువల్లే దీనిపై ఒక ప్రయోగాత్మక ప్రాజెక్టును తీసుకొచ్చాం. ఇది ఒక రెగ్యులేటరీ శాండ్‌బాక్స్‌లా ఉంటుంది. పరిశ్రమ తమ నిర్దిష్ట సవాళ్లను తెలిపితే, అందుకు అనుగుణంగా దానిని సవరిస్తామ’ని స్పష్టం చేశారు. ‘మ్యూచువల్‌ ఫండ్‌ రంగంలో 40 సంస్థలే ఉన్నందున.. యాంఫీ ద్వారా నిబంధనల అమలు చాలా సులువు. కానీ వేల సంఖ్యలో ఉన్న నమోదిత కంపెనీల విషయంలో అది సంక్లిష్టంగా మారింది. అందుకే ప్రతిపాదిత రెగ్యులేటరీ శాండ్‌బాక్స్‌ విషయంపై సీఐఐ, ఫిక్కీ, ఐసీఏఐ, ఐసీఎస్‌సీలతో పాటు నిఫ్టీ-50 కంపెనీల సీఈఓలకూ సెబీ లేఖ రాసింద’ని తెలిపారు.

* డీలిస్టింగ్‌ ప్రక్రియను సమీక్షిస్తున్నామని.. డిసెంబరు కల్లా ఒక చర్చాపత్రంతో ముందుకొస్తామని తెలిపారు. డీలిస్టింగ్‌కు కూడా ఒక స్థిర ధరను పెట్టే అవకాశాన్ని హెచ్‌డీఎఫ్‌సీ మాజీ వైస్‌ ఛైర్మన్‌ కేకీ మిస్త్రీ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలిస్తోందని ఆమె వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని