సంక్షిప్త వార్తలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అవంతీ ఫీడ్స్‌ ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.1,278 కోట్ల ఆదాయాన్ని, రూ.82.73 కోట్ల నికర లాభాన్నీ నమోదు చేసింది.

Updated : 08 Nov 2023 05:55 IST

అవంతీ ఫీడ్స్‌ లాభం రూ.82.73 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అవంతీ ఫీడ్స్‌ ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.1,278 కోట్ల ఆదాయాన్ని, రూ.82.73 కోట్ల నికర లాభాన్నీ నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.1,322.09 కోట్లు, నికర లాభం రూ.67.45 కోట్లుగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో మొత్తం ఆదాయం రూ.2,832.14 కోట్లు, నికర లాభం రూ.197.47 కోట్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో సంస్థ ఆదాయం రూ.2,891.40 కోట్లు, నికర లాభం రూ.140.24 కోట్లుగా నమోదయ్యాయి. సంస్థకు అనుబంధంగా అవంతీ పెట్‌ కేర్‌ను జులైలో ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.


పెరిగిన విజయ డయాగ్నోస్టిక్‌ లాభం

ఈనాడు, హైదరాబాద్‌: రోగ నిర్థారణ సేవలను అందించే విజయ డయాగ్నోస్టిక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.138.9 కోట్ల ఆదాయం, రూ.33.3 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాలంలో సంస్థ రూ.120.7 కోట్ల ఆదాయంపై రూ.23.3 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. దీంతో పోలిస్తే ఈసారి ఆదాయం 15 శాతం, నికర లాభం 42.9 శాతం చొప్పున పెరిగాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకూ సేవలను విస్తరిస్తున్నట్లు విజయ డయాగ్నోస్టిక్‌ తెలిపింది. గత నెలలో ఒక స్టాండలోన్‌ కేంద్రాన్ని మహబూబ్‌నగర్‌లో ప్రారంభించినట్లు వెల్లడించింది. బీ2సీ విభాగం నుంచే 95 శాతం  ఆదాయాలు వచ్చినట్లు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ సుప్రిత రెడ్డి తెలిపారు. కొవిడ్‌ ఏతర పరీక్షల నుంచి వచ్చిన ఆదాయాల్లో 18 శాతం వృద్ధి కనిపించిందని పేర్కొన్నారు. కోల్‌కతా  కేంద్ర వృద్ధిపై సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. వైద్య పరీక్షలకు సంబంధించి ‘అన్నీ ఒకే చోట’ లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు వెల్లడించారు.


జీఓసీఎల్‌ ఆదాయం రూ.223 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: హిందుజా గ్రూపు కంపెనీ జీఓసీఎల్‌ కార్పొరేషన్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.223.42 కోట్ల ఆదాయాన్ని, రూ.15.71 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే కాలంలో ఆదాయం రూ.318.99 కోట్లు, నికర లాభం రూ.40.37 కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో ఆదాయం రూ.482 కోట్లు, నికర లాభం రూ.28 కోట్లుగా నమోదయ్యాయి. మార్కెట్‌ పరిస్థితులు ప్రతికూలంగా ఉండటం, ముడి సరకు ధరలు పెరగడం, ద్రవ్యోల్బణ ప్రభావం సమీక్షా త్రైమాసిక పనితీరుపై పడినా, స్థిరమైన వృద్ధి సాధించినట్లు సంస్థ ఎండీ, సీఈఓ పంకజ్‌ కుమార్‌ తెలిపారు. వినియోగదారుల అవసరాలకు తగ్గ ఉత్పత్తులు తీసుకొస్తున్నామని, దీర్ఘకాలంలో వృద్ధికి ఇది తోడ్పడుతుందన్నారు. ఎలక్ట్రానిక్స్‌ తయారీ, అంతరిక్షం, రక్షణ రంగాలకూ విస్తరిస్తున్నట్లు వివరించారు. చంద్రయాన్‌ మిషన్‌లోనూ తమ ఉత్పత్తులను వినియోగించినట్లు తెలిపారు. రాబోయే రెండేళ్ల కాలానికి సంస్థ చేతిలో రూ.1,100 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయని తెలిపారు.


పవర్‌గ్రిడ్‌ డివిడెండ్‌ 40 శాతం

దిల్లీ: పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ సెప్టెంబరు త్రైమాసికంలో   రూ.3,781.42 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాల లాభం రూ.3,650.29 కోట్లతో పోలిస్తే ఇది 4 శాతం ఎక్కువ. మొత్తం ఆదాయం రూ.11,349.44 కోట్ల నుంచి రూ.11,530.43 కోట్లకు పెరిగింది. రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.4 చొప్పున (40 శాతం) మధ్యంతర డివిడెండ్‌ చెల్లించేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. డిసెంబరు 6న డివిడెండ్‌ చెల్లించనుంది.


పెరిగిన నెట్‌లింక్స్‌ లాభం

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో ఐటీ, ఐటీ ఇంజినీరింగ్‌ సేవలను అందించే నెట్‌వర్క్‌ ఫ్లాట్‌ఫాం నెట్‌లింక్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.7.46 కోట్ల ఆదాయాన్ని,  రూ.1.67 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.6.4 కోట్లు, నికర నష్టం రూ.7.1 లక్షలుగా ఉంది. వీటితో పోలిస్తే ఈసారి ఆదాయం 16.54%, లాభం 2264% పెరిగాయి.


న్యూలాండ్‌ లేబొరేటరీస్‌ ఆదాయం రూ.421 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: న్యూలాండ్‌ లేబొరేటరీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.420.8 కోట్ల ఆదాయంపై రూ.89.1 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.293.9 కోట్లు, నికర లాభం రూ.38.3 కోట్లుగా ఉన్నాయి. వీటితో పోలిస్తే ఈసారి ఆదాయం 43.2 శాతం, నికర లాభం 132.3 శాతం మేర పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధానికి ఆదాయం రూ.785.8 కోట్లు, లాభం రూ.151.3 కోట్లుగా ఉన్నాయి. కొన్నేళ్లుగా సీఎంఎస్‌ విభాగంలో చేస్తున్న కృషికి ఈ ఫలితాలు నిదర్శనమని సంస్థ వైస్‌ ఛైర్మన్‌, సీఈఓ సుచేత్‌ దావులూరి తెలిపారు. వైస్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సహర్ష్‌ దావులూరి మాట్లాడుతూ.. నిధుల సమస్య ఉన్నప్పటికీ సీఎంఎస్‌ (కస్టమ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ సొల్యూషన్స్‌) ప్రాజెక్టులు రెట్టింపు వృద్ధితో సాగుతున్నాయన్నారు. సామర్థ్య విస్తరణ, వినియోగదారులకు అవసరమైన సేవలను అందించేందుకు పెట్టుబడులు కొనసాగిస్తామని పేర్కొన్నారు.


లిఖిత ఇన్‌ఫ్రా లాభం రూ.15.57 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: సెప్టెంబరు త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదిక ప్రకారం.. లిఖిత ఇన్‌ఫ్రా రూ.108.60 కోట్ల ఆదాయంపై రూ.15.57 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే మూడు నెలల్లో కంపెనీ ఆదాయం రూ.82.96 కోట్లు, లాభం రూ.14.60 కోట్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో సంస్థ రూ.198.80 కోట్ల ఆదాయం, రూ.31.49 కోట్ల లాభం నమోదు చేసింది.


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రుణరేట్ల పెంపు

ముంబయి: కొన్ని కాలావధుల రుణాలపై వడ్డీరేట్లను 0.05 శాతం పెంచినట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రకటించింది. తాజా మార్పుల ప్రకారం నిధుల వ్యయం ఆధారిత రుణరేటు (ఎంసీఎల్‌ఆర్‌) ఓవర్‌నైట్ రేటు 8.60 శాతం నుంచి 8.65 శాతానికి, మూడేళ్ల కాలపరిమితి రేటు 9.25 శాతం నుంచి 9.30 శాతానికి పెరిగింది. ఏడాది కాలపరిమితి రుణాలకు మార్పు చేయకుండా 9.20 శాతంగానే ఉంచింది.


అహేడ్‌లో 1,000 ఉద్యోగాలు

దిల్లీ: అమెరికా (షికాగో) కేంద్రంగా కార్యకలాపాలు సాగించే క్లౌడ్‌, డేటా, ఇంజినీరింగ్‌ సొల్యూషన్స్‌ కంపెనీ అహేడ్‌ మన దేశంలో వచ్చే 12 నెలల్లో 1,000 మందికి పైగా ఉద్యోగుల్ని నియమించుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. గురుగ్రామ్‌లో ఈ కంపెనీ సర్వీస్‌ డెలివరీ కార్యాలయాన్ని ప్రారంభించింది. అమెరికా వెలుపల ఈ సంస్థ ఏర్పాటు చేసిన తొలి కార్యాలయం ఇదే. ‘అమెరికాకు బయట మా తొలి డెలివరీ కేంద్రాన్ని భారత్‌లో ఏర్పాటు చేయడం ద్వారా దేశీయంగా విన్నూతత, డిజిటల్‌ వృద్ధికి ఉత్ప్రేరకంగా నిలుస్తాం. దేశీయంగా మా సర్వీస్‌ డెలివరీని పెంచడానికి అందుబాటులో ఉన్న అసాధారణ సాంకేతిక నైపుణ్యం కలిగిన 1,000 మంది ఉద్యోగులను నియమించుకుంటామ’ని అహేడ్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ డేనియల్‌ అడమానీ తెలిపారు.


కాఫీ బోర్డు ఛైర్మన్‌గా ఎం.జె.దినేశ్‌

దిల్లీ: కాఫీ బోర్డు ఛైర్మన్‌గా ఎం.జె.దినేశ్‌ను మూడేళ్ల కాలానికి నియమిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ పోస్టు కొంత కాలంగా ఖాళీగా ఉంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ నియంత్రణలో ఉండే ఈ బోర్డులో ఛైర్మన్‌, సెక్రటరీ-సీఈఓతో పాటు కాఫీకి సంబంధించిన వేర్వేరు వర్గాల నుంచి 31 మంది సభ్యులుంటారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు లేదా మూడేళ్ల కాలం ముగిసే వరకు.. ఏది ముందైతే ఆ ప్రాతిపాదికన దినేశ్‌ కొనసాగుతారని ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని